
ఇన్నాళ్లు కుల రాజకీయాలకు దూరంగా ఉన్న తెలంగాణ కూడా ఇప్పుడు కుల రాజకీయాలతో కొట్లాడుతుంది. ముఖ్యంగా బీసీ ల చుట్టూ తిరుగుతున్న ఈ తెలంగాణ రాజకీయం ఇక మునుపు ఏ మలుపు తీసుకోనుందో.?
కులగణన అంటూ రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్వే నుంచి మొదలైన ఈ లొల్లి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కమ్మేసింది. సొంత పార్టీలోనే తీన్మార్ మల్లన్న తో మొదలైన ఈ కుల పంచాయితీ ఇప్పుడు ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ఒక ప్రధాన అస్త్రంగా మారింది.
Also Read – కోర్ట్: నాని జడ్జ్ మెంట్ బాగుంది..!
ఈ కులగణనతో బీసీలకు అనాయ్యం జరుగుతుంది, మా ఓట్లతో గద్దెనెక్కి మా పై మీ పెత్తనమా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ లను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో పెద్ద దుమారాన్నే లేపాయి. మొదట్లో అంతగా పట్టించుకోని తీన్మార్ వ్యాఖ్యలు పోను పోను ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారాయి.
ఇక దీనితో ఇన్నాళ్లుగా ‘ప్రాంతీయ వాదం’ మీద రాజకీయం చేసిన బిఆర్ఎస్ కూడా ఈ ‘కుల రాజకీయాలను’ తలకెక్కించుకున్నాయి. కాంగ్రెస్ పభుత్వం చేసిన సర్వే తప్పులతడక గా ఉందంటూ వ్యాఖ్యానించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీ లకు సీఎం రేవంత్ బేషరతు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!
ఇప్పటి వరకు జరిగిన కులగణనలో పాల్గొనలేకపోయిన వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అవకాశాన్ని కల్పిస్తూ ఈ నెల 16 నుంచి 28 వరకు జరగబోయే సర్వేలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. దీనితో కనీసం ప్రభుత్వం ఈసారి నిర్వహించే సర్వేలో అయినా సమగ్రంగా విచారణ జరిపి బీసీలకు 42 % రిజర్వేషన్లు కల్పించాలంటూ రేవంత్ సర్కార్ కి అల్టిమేటం జారీ చేసారు కేటీఆర్.
అలాగే బీసీ ల రిజర్వేషన్ పంచాయితీ ఒక కొలిక్కి వచ్చాకే ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు రేవంత్ మాటలను, కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేలను తెలంగాణ సమాజం నమ్మదంటూ హెచ్చరించారు కేటీఆర్. మొత్తానికి రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ కులగణన కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలనే మార్చేలా కనిపిస్తుంది.
Also Read – అవినీతిని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారుగా!
ఇప్పటికే సొంత పార్టీ నేత నుండి వ్యతిరేకత, ప్రతిపక్షాల నుండి విమర్శలు, బీసీ ల నాయకుడు ఆర్ కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ 42 % కి పెంచుతూ అసెంబ్లీ లో చట్టం చెయ్యాలని, లేకుంటే ఉద్యమిస్తామంటూ ముఖ్యమంత్రిని కలిసి మరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనితో హైడ్రా మాదిరి కులగణన లో కూడా రేవంత్ లెక్క తప్పిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.