
తెలంగాణకు కుల రాజకీయాలను పరిచయం చేసిన మాజీ కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహానికి గురై పార్టీ నుండి సస్పెన్షన్ వేటు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గా ఉంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వ పెద్దల మీద వారి నిర్ణయాల మీద అనేకానేక విమర్శలు చేసారు.
దీనితో కాంగ్రెస్ పారీ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కుల రాజకీయాలను రెచ్చకొడుతూ ఒక కులనాయకుడిగా ఎదగాలనుకుంటున్న మల్లన్న ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ను కలిశారు.
Also Read – పిఠాపురం పంచాయితీ తీరినట్టేనా.?
దీనితో తెలంగాణలో ఇన్నాళ్లుగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య కొనసాగిన ప్రాంతీయ వాదం రూటు మార్చుకుని కుల సమీకరణాల వైపు మళ్లబోతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత పదేళ్లు అధికార పార్టీగా ఉన్న బిఆర్ఎస్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన మల్లన ఇప్పుడు అదే పార్టీ పెద్దలను కలవడం వెనుక దాగిఉన్న రాజకీయ లెక్కలు ఏమిటి అనేదాని మీద ఇటు కాంగ్రెస్ అటు బిఆర్ఎస్ శ్రేణులలో చర్చ జరుగుతుంది.
తెలంగాణలో బీసీ నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న తీన్మార్ మల్లన్న పలువురు బీసీ నేతలతో కలిసి కేటీఆర్ కు ఒక మెమోరాండం అందించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు పై అసెంబ్లీ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ కేటీఆర్ ను కోరిన ఈ మాజీ కాంగ్రెస్ నాయకుడు బిఆర్ఎస్ పార్టీ నేతలతో ఊరుకుంటారా.? లేక ఇదే విషయం మీద బీజేపీ పార్టీ నేతలను కూడా కలుస్తారా.?
Also Read – జమ్ము కశ్మీర్ దాడి: అందరి తాపత్రయం మైలేజ్ కోసమే?
ప్రాంతీయ వాదం అనే నినాదాన్ని తలకెత్తుకుని, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఎదిగి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు మల్లన్న మాదిరే తెలంగాణలో కుల రాజకీయాలకు నాటులు వెయ్యాలనుకుంటున్నారా.? తెలంగాణలో బీసీ వాదాన్ని వినిపించి తన పార్టీ కున్న ప్రాంతీయ వాదం అనే బలాన్ని కుల రాజకీయాలతో కేటీఆర్ పక్కదారి పట్టించబోతున్నారా.?
గత ఎన్నికలలో ప్రాంతీయవాదాన్ని పక్కన పెట్టి జాతీయవాదంతో ప్రజల ముందుకెళ్లిన బిఆర్ఎస్ పార్టీకి ఓటమి అనే చేదు అనుభవమే ఎదురయ్యింది. ఇటువంటి తరుణంలో బిఆర్ఎస్ మరోసారి తన కారు గేరు ను మార్చే సాహసం చెయ్యగలుగుతుందా.? అలాగే మొదటిసారిగా ఎమ్మెల్సీ అయిన మల్లన్న ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా ఈ కుల రాజకీయాలతో నాయకుడిగా నిలబడగలుగుతారా.?