
ఓ దేశం లేదా రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వాలు ప్రణాళికలు రచించి అమలు చేయడం అందరికీ తెలుసు. కానీ 2019లో జగన్ అధికారంలోకి రాగానే, 2024లో జరుగబోయే ఎన్నికలలో వైసీపీని మళ్ళీ ఏవిదంగా గెలిపించుకోవాలా? అని ప్లాన్ చేసుకోవడం, అందుకు అవసరమైన డబ్బు పోగేసుకునేందుకు మద్యం కుంభకోణం ప్లాన్ చేసి చాలా పకడ్బందీగా అమలుచేయడం విచిత్రం.
Also Read – ట్రంప్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
సంపూర్ణ మద్యపాన నిషేదం అమలుచేస్తామంటూ మద్యం వ్యాపారం చేస్తూ వేలకోట్ల కుంభకోణానికి పాల్పడటం ఇంకా విచిత్రం.
ఈ కుంభకోణంలో సూత్రధారి ఒకరే అయినప్పటికీ వైసీపీలో అనేక మంది పాత్రధారులున్నారు. వారిలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి (ఏ-4) కూడా ఒకరని ఏపీ సీఐడీ పోలీసులు నేరారోపణ చేశారు. ఈ కేసులో అరెస్ట్ తప్పదని తెలుసు కనుక మిథున్ రెడ్డి హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.
Also Read – నిర్మాణం ఎలాగూ చాతకాదు కనీసం..
దానిపై విచారణ జరిగినప్పుడు ఈ కుంభకోణంలో డబ్బు ఏవిదంగా చేతులు మారిందో ఏపీ సీఐడీ తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్రా వివరించారు.
ఈ కుంభకోణంలో కమీషన్లు ఇచ్చిన మద్యం కంపెనీలకు మాత్రమే ప్రభుత్వం తరపున ఆర్డర్స్ లభించేవని, ఈ ప్రక్రియని మిథున్ రెడ్డి చూసుకునేవారని హైకోర్టుకి తెలిపారు.
Also Read – కమల్ హాసన్‌కి మాత్రమే న్యాయం…. చాలుగా!
దీనిలో మిథున్ రెడ్డికి కూడా కమీషన్స్ ముడుతుండేవని తెలియజేసేందుకు సిద్ధార్థ లూద్రా ఓ చిన్న ఉదాహరణ చెప్పారు.
ఈ మద్యం కుంభకోణంలో ఏ-16గా ఉన్న డికార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి ఏ-4గా ఉన్న మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంక్ ఖాతాలో రూ.5 కోట్లు జమా అయ్యాయని తెలియజేశారు.
కానీ మద్యం కుంభకోణం కేసు నమోదు కాగానే ఆ సొమ్ముని తిరిగి పంపించేశారని తెలియజేస్తూ ఆ బ్యాంక్ లావాదేవీలకు సంబందించిన పత్రాలు హైకోర్టుకి సమర్పించారు.
కనుక ఓ ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కూడా భాగస్వామిగా ఉన్నారు కనుక ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని, ఆయన విచారణకు సహకరించడం లేదు కనుక కస్టడీకి అనుమతించాలని సిద్ధార్థ లూద్రా హైకోర్టుని అభ్యర్ధించారు.
మద్యం కుంభకోణంలో నిందితులను కాస్త ముందూ వెనుకగా అరెస్ట్ అవడం ఖాయమే. మహా అయితే ఈ కేసులో జగన్‌ని కూడా అరెస్ట్ చేయగలరేమో?
కానీ ఆక్రమాస్తుల కేసులలో 16 నెలలు చంచల్ గూడ జైల్లో గడిపినా జగన్ ముఖ్యమంత్రి కాగలిగారు. బెయిల్‌పై రాష్ట్రాన్ని 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు. మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతానని నమ్మకంతో ఉన్నారు కూడా.
అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసుతో ఏళ్ళ తరబడి ఫుట్‌బాల్ ఆడుకుంటూ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, పెద్దల సభ (రాజ్యసభ) ఉప సభాపతి కాగలిగినప్పుడు, ఈ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు శిక్షలు పడేలా చేయడం సాధ్యమేనా?కూటమి ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్థానాలే సమాధానం చెప్పాలి.