
ఇటీవలే థియేటర్లలో దర్శనమిచ్చిన ‘డాకు మహారాజ్’ చిత్రం పై అక్కడా ఇక్కడా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, నందమూరి నటసింహం బాలకృష్ణ పర్ఫామెన్స్ పై వేలెత్తి చూపలేదెవ్వరు. ఇటీవల కాలంలో బాలకృష్ణ, తన అభిమానుల ప్రశంసలను పొందటంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటున్నారు.
లయన్, రూలర్, ఎన్.టీ.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు వంటి దారుణమైన బాక్స్-ఆఫీస్ పరాజయాలను అందుకుని, ఇక కెరీర్ ముగిసినట్టే అనుకున్న సమయంలో మళ్ళీ ఈ రేంజ్ కం-బ్యాక్ ఇస్తారని కనీసం నందమూరి అభిమానులు కూడా ఊహించలేదు. 2021 నుండి బాలయ్య కు బంగారపు శకం నడుస్తున్నట్టే కనపడుతుంది.
Also Read – వైసీపీ ఓటమికి మరో కారణం.. నిజమా?
బాలకృష్ణ పట్టిందల్లా బంగారమైపోతుంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ నుండి బాలకృష్ణ కు ఈ మహర్దశ మొదలయ్యింది. బోయపాటి మాస్ టేకింగ్, బాలకృష్ణ యాక్టింగ్, మ్యూజిక్ బాక్సులు బద్దలైపోయే బ్యాక్-గ్రౌండ్ తో థమన్ ‘అఖండ’ విజయాన్ని తమ కెరీర్ బెస్ట్ మూవీ గా మలచుకున్నారు. దీనితో ఇక ఆ తరువాత వచ్చిన 4 బాలకృష్ణ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కొనసాగుతూ వస్తున్నారు.
అఖండ మానియా తరువాత వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ సైతం అప్పట్లో ఆయన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. పెద్ద బాలకృష్ణ గెట్-అప్ తో అభిమానులను ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఆ తరువాత చక్కటి సందేశం తో అభిమానుల ముందుకు వచ్చిన ‘భగవంత్ కేసరి’ కూడా బాక్స్-ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుని బాలయ్య కు హాట్-ట్రిక్ విజయాన్ని కట్టబెట్టింది.
Also Read – చంద్రబాబు చేయలేకపోయారు… జగన్ చేస్తున్నారు?
ఇక ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేస్తున్న సినిమా ‘డాకు మహారాజ్’ కూడా బాలయ్య కు నందమూరి అభిమానుల నుండే కాదు సాధారణ సినీ ప్రేక్షకుడి నుండి కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. థమన్ మ్యూజిక్ కు బాలయ్య స్క్రీన్ ప్రెజన్స్ తోడయ్యి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేస్తున్నారు ‘బాబీ’. ఇంతటి బిజీ షెడ్యూల్ లో కూడా ‘అన్-స్టాపబుల్’ అంటూ బుల్లితెర మీద కూడా జై బాలయ్య అంటూ వెలిగిపోతున్నారు ఈ హిందూపూర్ ఎమ్మెల్యే.
ప్రేక్షకులు మునుపెప్పుడు చూడని బాలకృష్ణను చూపించిన ఈ షో, ఇతర హీరోల అభిమానులను కూడా బాలయ్య వైపు చూసేలా చేసింది. ఇలా, నిత్యం స్క్రీన్ పై కనిపిస్తూ, కనిపించిన ప్రతిసారి అభిమానులను అలరిస్తూ, ప్రతి హీరో అభిమాని ‘జై బాలయ్య’ అనే స్థాయికి చేరుకున్న బాలకృష్ణ తన రాజకీయ, సినీ కెరీర్ లో అన్ స్టాపబుల్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
Also Read – కేసీఆర్ రీరిలీజ్ కోసం ఉప ఎన్నికలు నిర్వహించాలా?