nara-lokesh-and-jagan-mohan-reddy mothers Love

టీడీపీ మద్దతుదారుల నోళ్ళలో నానే ముఖ్య పేర్లలో ఈ వల్లభనేని వంశీ పేరు ఒకటి. అయితే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో నిన్న ఉదయం హైద్రాబాద్ లో అరెస్టైన వంశీ కి కోర్ట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

అయితే వంశీ ఏ కేసులో అరెస్టయినప్పటికీ టీడీపీ తమ్ముళ్లు మాత్రం తమ పార్టీ అధినేత సతీమణి నారా భువనేశ్వరిని అగౌరవపరిచినందుకు వంశీకి తగిన శిక్ష పడిందనే ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ ఆనందం వారికి ఇంకెంత కాలం ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం లోకేష్ తన తల్లికి జరిగిన బహిరంగ అవమానానికి బదులు తీర్చుకున్నారు అంటూ సంబరపడుతున్నారు.

Also Read – తమిళనాడుకి దూరంగా చంద్రబాబు… దగ్గరవుతున్న పవన్!

నాడు భువనేశ్వరి ఆత్మగౌరవం మీద వంశీ చేసిన కామెంట్స్ తో అసెంబ్లీలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణుల దిగజారుడు వ్యాఖ్యలకు తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ కంటతడి పెట్టని బాబు వెక్కి వెక్కి ఏడ్చారు. అలాగే తన ముందు తన భార్యకు జరిగిన ఈ ఘోర అవమానానికి గాను ప్రతీకారంగా తిరిగి తానూ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను అంటూ శపథం చేసిన బాబు తన పంతం నిలబెట్టుకున్నారు.

అలాగే నిండు సభలో తన తల్లికి జరిగిన అవమానికి, వల్లభనేని చేసిన వ్యాఖ్యలకు అధికారంలోకి వచ్చాక తప్పక బదులు చెపుతాను అంటూ లోకేష్ పట్టిన పంతం నిన్న నెరవేరింది. దీనితో అమ్మకు ప్రేమతో….లోకేష్ ఇలా తన తల్లిని అవమానించిన వారి పై పైచేయి సాధించారు అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు.

Also Read – జగన్‌, చంద్రబాబు: ఇద్దరు భక్తుల కధ!

లోకేష్ తీరు ఇలా ఉంటే, మరి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తీరు మరోలా ఉంది. విజయానికి, వైసీపీ అధికారానికి కారణమైన తల్లి విజయలక్ష్మి ని తానూ ముఖ్యమంత్రి పదవి చెప్పట్టగానే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి అవమానించారు అంటూ గత జగన్, విజయమ్మ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.




ఇలా అమ్మ మీద ప్రేమతో లోకేష్ తన తల్లికి జరిగిన అవమానానికి అరెస్టు తో బదులు తీర్చుకుంటే, జగన్ మాత్రం తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిలకు మద్దతు పలికింది అనే ద్వేషంతో పదవి నుంచి తొలగించి తల్లిని అగౌరవపరిచారు అనేలా రెండు సందర్భాలను, ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలంటూ కోరుతున్నారు టీడీపీ శ్రేణులు.

Also Read – జగన్‌ మోడల్ బెస్ట్ అంటున్న రేవంత్ రెడ్డి!