గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏ రాజాతో సహా పోలీసులు 11 మందిని ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అయితే ఏదో రోజు ఇదే జరుగుతుందని అందరికీ తెలుసు. కనుక ఇదేమి పెద్ద వార్త లేదా విశేషం కాదనే చెప్పొచ్చు.
Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ
వంశీ అనుచరులు ఆయన అనుమతి, ప్రోత్సాహం లేకుండానే టీడీపీ కార్యాలయంపై దాడి చేయరు. కనుక ఆయన ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందని భావించవచ్చు. కనుక దీని ప్రధాన సూత్రధారి ఆయనే అవుతారు.
నాడు వైసీపీలో, ప్రభుత్వంలో అన్నీ తానై చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణా రెడ్డి వంశీ వంటి వైసీపీ నేతలకు ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తుండేవారని, వాటిని వారు తూచాతప్పకుండా పాటిస్తుండేవారని వైసీపీని వీడిన నేతలే చెపుతున్నారు. కనుక టీడీపీ కార్యాలయంపై దాడి కేసు వెనుక వైసీపీలో ఇంకా చాలా మంది ఉన్నారని అర్దమవుతోంది.
Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!
టీడీపీ కార్యాలయంపై దాడితోనే వైసీపీ నేతలు సంతృప్తి చెందలేదు. నాడు వంశీ అనుచరులను అడ్డుకునేందుకు వెళ్ళిన టీడీపీ సీనియర్ నేత పట్టాభిపై ఎదురుకేసు నమోదు చేసి ఎంతగానో వేదించి జైల్లో పెట్టారు కూడా.
సజ్జల రామకృష్ణా రెడ్డి ఆదేశం లేనిదే టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారంటే నమ్మశక్యంగా లేదు. అవునో కాదో ఆ పోలీసులనే అడిగితే వారే చెపుతారు.
Also Read – కౌశిక్ రెడ్డి…పార్టీ కోసమా..? పేరు కోసమా.?
ఇంతకీ విషయం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతోంది. కానీ ఇంతవరకు వల్లభనేని వంశీని టచ్ చేయలేకపోతోంది!
వంశీపైనే టచ్ చేయలేకపోతున్నప్పుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ మంత్రులు ఆర్‌కె రోజా, అంబటి రాంబాబులను టచ్ చేయగలదా?వారినే ఏమీ చేయలేకపోతే ఇక సజ్జల రామకృష్ణా రెడ్డి, జగన్, విజయసాయి రెడ్డిల దారిదాపులకైనా వెళ్ళగలదా?అనే సందేహం కలుగుతోంది.
ఈ లెక్కన జగన్ వద్దకు చేరుకోవడానికి కూటమి ప్రభుత్వానికి 5 ఏళ్ళు సరిపోవేమో?ఇది అసమర్ధతా లేక ఆచితూచి అడుగులు వేయడమా?టీడీపీ నేతలే చెప్పాలి.
జగన్ లేదా వైసీపీ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే, రాజకీయ కక్ష సాధింపు అని వైసీపీ చాటింపు వేసుకొని ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుందని వేరే చెప్పక్కరలేదు. కానీ కూటమి ప్రభుత్వం మరో నాలుగున్నరేళ్ళు అధికారంలో ఉండబోతున్నప్పుడు, ఈ సానుభూతి లెక్కలు అవసరమా? అని శ్రేయోభిలాషుల ప్రశ్నకు టీడీపీ నేతలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.