
వైస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు న్యాయం కావాలంటూ గత ఆరేళ్లుగా కోర్టుల చుట్టు తిరుగుతూ న్యాయ పోరాటం చేస్తున్నారు సునీత. వివేకా హత్య సమయంలో ఏపీలో ప్రభుత్వంలో ఉంది టీడీపీ, ఆ తరువాత ఐదేళ్లు వైసీపీ రాజ్యమేలింది, ఇక ఇప్పుడు టీడీపీ కూటమి అధికారాన్ని అంది పుచ్చుకుంది.
ఇలా వివేకా హత్య నుండి ఇప్పటివరకు అధికారం పార్టీల మధ్య చేతులు మారింది, కానీ వివేకా కుటుంబానికి గాని సునీత పోరాటానికి కానీ న్యాయం దక్కలేదు. నాటి నుంచి నేటి వరకు ఆమె ప్రభుత్వాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు కానీ కేసు తాలూకా విచారణ మాత్రం అడుగు కూడా ముందుకు పడడం లేదు.
Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!
ఇక ఆ కేసు తాలూకా ఉన్న ముఖ్య సాక్ష్యులు ఒక్కొక్కరుగా మరణించడంతో మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేదేప్పుడు అంటూ మీడియా ముందుకొచ్చారు సునీత. వివేకా కేసులో నిందుల కంటే బాధితులే ఎక్కవ శిక్ష అనుభవిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఇప్పటికి స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేసారు సునీత.
కేసు రాష్ట్ర పరిధిలో లేనప్పటికీ సాక్ష్యులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుందని, సాక్ష్యులు లేకుండా బాధితులకు కేసులో న్యాయం ఎలా జరుగుతుందంటూ ప్రశ్నించారు సునీత. అలాగే కేసులో ఉన్న ముఖ్య సాక్ష్యులు మరణాల పై కూడా తనకు అనుమానాలు ఉన్నాయంటూ ఆరోపించారు.
Also Read – బిఆర్ఎస్..కాంగ్రెస్ కుర్చీల ఆటలో బీజేపీ అరటిపండా.?
అయితే గత వైసీపీ హయాంలో కేసును అటకెక్కించిన అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులకు తన పార్టీ తరపున ఎంపీ టికెట్ ఇచ్చి మరి ప్రోత్సహించారు. ఆ సమయంలో సునీతకు పోరాటానికి అండగా, వైస్ షర్మిల తన మద్దతు ప్రకటించి అన్న జగన్ పై రాజకీయ సమరానికి సై అన్నారు.
నాడు అన్న పై వీరు మోగించిన సమర శంకానికి ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ స్వరం కలిపారు బాబు. అలాగే అధికారం కోసం సొంత చిన్నాన్నను కూడా దారుణంగా హత్య చేయగలిగినవారు ఇక సాధారణ ప్రజల పట్ల కనికరం చూపిస్తారా అంటూ వైసీపీ పై మండిపడ్డారు పవన్. ఇలా వీరిద్దరూ నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సునీత పోరాటానికి న్యాయం జరగాలి అంటూ గళం విప్పారు.
Also Read – ప్రమోషన్స్ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!
అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ప్రభుత్వంలో భాగమయాయ్యి, అలాగే ఇద్దరు అధినేతలు కూడా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు గడుస్తున్నాయి, అయినా కూడా కేసులో ఒక్క పురోగతిని కూడా సాధించలేకపోయారు, వివేకా కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నారు. అటు బీజేపీ కూడా కూటమిలో భాగమైనప్పటికీ ఈ కేసు బాధ్యత నుంచి తప్పుకుని పక్క చూపులు చూస్తుంది.
సిబిఐ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్న ఈ కేసు ను అధికారులు తిరిగి పునర్ సమీక్షించి విచారణ మొదలు పెట్టాలని, అప్పటి వరకు తన ఈ పోరాటం ఆగదు అంటూ స్పష్టం చేసారు సునీత. అయితే ఆమె ఆవేదనను అర్ధం చేసుకుని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సునీతకు న్యాయం జరిపించి తద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే వైసీపీ పాలనకు కూటమి నాయకత్వానికి మధ్య ఎటువంటి తారతమ్యాన్ని ప్రజలు గుర్తించలేరు సుమీ..!