Once Again Foundation Stone Laying For Amaravati

ఇదివరకు అంటే 2014-2019 మద్య సిఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన అనేక పనులను తర్వాత వచ్చిన జగన్‌ కొనసాగించకుండా, 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ శంకుస్థాపనలు చేశారు. అందుకు టీడీపీ నేతలు పదేపదే జగన్‌ని విమర్శించేవారు. కానీ ఇప్పుడు టీడీపీ కూడా అదే చేయబోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అమరావతిని రాజధానిగా ఖరారు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దానికి భూమిపూజ జరిపించిన తర్వాత నిర్మాణ పనులు మొదలుపెట్టారు. జగన్‌ వాటిని కొనసాగించి ఉండి ఉంటే ఈ పాటికి అవన్నీ పూర్తయి వినియోగంలో ఉండేవి.

Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…

కానీ జగన్‌ అమరావతిని 5 ఏళ్ళు పాడుబెట్టేశారు. కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే మళ్ళీ ప్రధాని మోడీని ఆహ్వానించి ఆయన చేత శంకుస్థాపన చేయించాలనుకోవడమే విమర్శలకు తావిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.37,702 కోట్లు విలువగల పనులు చేసేందుకు టెండర్లు ఖరారు చేసి, పనులు మొదలు పెట్టేందుకు సోమవారం వారికి అగ్రిమెంట్ లెటర్స్ కూడా ఇవ్వబోతోంది. అవి చేతికి వచ్చాక నిర్మాణ సంస్థలు యంత్రాలు, వాహనాలు, కార్మికులను అమరావతికి రప్పించి పనులు మొదలుపెట్టవచ్చు.

Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!

కనుక ఏ క్షణంలోనైనా పనులు మొదలవుతాయని అనుకుంటే, ఏప్రిల్ 15-20 తేదీల మద్య ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత పనులు మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోడీ చేత అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేయించడం ద్వారా ఆయనకు కూడా దాని నిర్మాణ బాధ్యతని అప్పగించిన్నట్లవుతుందని, కనుక శంకుస్థాపన చేసిన అమరావతి నిర్మాణానికి ఆయన అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ తోడ్పడతారని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తుండవచ్చు.

Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?

కానీ రెండోసారి శంకుస్థాపన చేసేందుకు బయలుదేరితే మీడియా, విపక్షాలు ఆక్షేపించే అవకాశం కూడా ఉంటుంది. కనుక ప్రధాని మోడీ ఇందుకు అంగీకరిస్తారా లేదా?అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ అంగీకరించి శంకుస్థాపన చేస్తే, అప్పుడు సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించేందుకు వైసీపీకి అవకాశం లభిస్తుంది కదా?