Pawan Kalyan Emerges From the Ruins

పవన్‌ కళ్యాణ్‌కు మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించకపోయి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేవారు కారేమో? అనిపిస్తుంది. చిరంజీవి పార్టీ పెట్టిన ఏడాదిలోనే చెయ్యి కాల్చుకొని మళ్ళీ సినీ పరిశ్రమకు తిరిగి వచ్చేసినప్పుడు మరొకరైతే రాజకీయాలవైపు తొంగి చూసేవారు కూడా కాదేమో?

కానీ ప్రజారాజ్యం కోసం ప్రజల మద్య తిరగడంతో పవన్‌ కళ్యాణ్‌కు ప్రజల కష్టాలు, కన్నీళ్ళు, అవసరాలు అన్నీ స్వయంగా చూశారు. అందుకే ప్రజారాజ్యం శిధిలాల నుంచే జనసేన ఆవిర్భించింది.

Also Read – భయపడ్డారా.? భయపెడుతున్నారా.?

అయితే అప్పటికే ప్రజా రాజ్యం విఫల ప్రయోగం చూసిన ప్రజలు, ముఖ్యంగా కాపు సామాజికవర్గం జనసేనని, పవన్‌ కళ్యాణ్‌ని పెద్దగా పట్టించుకోలేదు. బహుశః ఈ విషయం పవన్‌ కళ్యాణ్‌ కూడా పసిగట్టారేమో తెలీదు కానీ 2014 ఎన్నికలలో టిడిపి, బీజేపీలకు మద్దతు పలికి ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు.

ఆనాడు జనసేన, పవన్‌ కళ్యాణ్‌లని పట్టించుకోని జనమూ, రాజకీయ విశ్లేషకులే ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి మళ్ళీ వెనకడుగు వేశారంటూ ఎద్దేవా చేశారు.

Also Read – ఇంతకీ ఆ కేసులో కేసీఆర్‌ ఓడారా… గెలిచారా?

కానీ పవన్‌ కళ్యాణ్‌ వాటిని పట్టించుకోకుండా తన సినీ ఇమేజ్‌తో టిడిపి, బీజేపీలకి ఉడతాభక్తిగా తోడ్పడి వాటి గెలుపుకు తోడ్పడి వచ్చిన పని అయిపోగానే సినీ పరిశ్రమకు వెళ్ళిపోయారు. అందుకు కూడా అందరూ మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌ని ‘పార్ట్-టైమ్ పొలిటీషియన్’ అంటూ విమర్శించారు. ఆ విమర్శలను కూడా పవన్‌ కళ్యాణ్‌ పట్టించుకోలేదు.

రాజకీయాలలో 5 ఏళ్ళు నలిగిన తర్వాత 2019 ఎన్నికలలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన రాజకీయ ప్రయోగం విఫలమైంది. పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోగా రాష్ట్రంలో జనసేన ఒకే ఒక్క సీటు గెలుచుకోగలిగింది. అది కూడా ఆ తర్వాత చేజారి వైసీపికి వెళ్ళిపోయింది.

Also Read – చంద్రబాబు పాలనకు జీరో మార్కులట మరి…

ఖరీదైన ఈ రాజకీయ ప్రయోగం నుంచి పవన్‌ కళ్యాణ్‌ చాలా విషయాలే నేర్చుకున్నారు. రాష్ట్రంలో కులసమీకరణాల విలువ, ముఖ్యంగా కాపు సామాజికవర్గం అండదండలు చాలా అవసరమని గుర్తించారు.

అలాగే జగన్మోహన్‌ రెడ్డి వంటి వారిని ఒంటరిగా ఎదుర్కోవడమంటే బలిదానాలకి సిద్దపడిన్నట్లే అని గ్రహించారు. కనుక పొత్తులు అనివార్యమని, ఢిల్లీ పెద్దల ఆశీర్వాదాలు కూడా అవసరమని పవన్‌ కళ్యాణ్‌ బాగానే గ్రహించారు.

అన్నీ ఉన్నా ఎన్నికలలో డబ్బుదే కీలకపాత్ర అని గ్రహించారు. పార్టీ నడిపించడం అంటే అభిమానులతో మీటింగ్ కాదని, పార్టీ నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారమని కూడా పవన్‌ కళ్యాణ్‌ గ్రహించారు.

ముఖ్యంగా సామాన్య ప్రజల నమ్మకం సంపాదించుకోవడం చాలా అవసరమని గుర్తించారు. కనుక 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఈ లోపాలన్నిటినీ సరిదిద్దుకొని, సర్వశక్తులు కూడగట్టుకొని యుద్ధానికి సిద్దపడ్డారు.

జగన్‌ తనని తాను ఓడించుకొని, తన నమ్ముకున్న వారందరి నమ్మకాలు వమ్ము చేసి వారు కూడా ఓడిపోయేలా చేయగా, పవన్‌ కళ్యాణ్‌ అందరినీ కలుపుతూ అందరితో కలిసి సాగుతూ తాను గెలిచి తన వారందరినీ గెలిపించుకున్నారు.

శిధిలాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగే క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ ఎదుర్కొన్న విమర్శలు, అవమానాలు, అవహేళనలు అన్నీ ఇన్నీ కావు. మరొకరైతే దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయేవారే. కానీ ఎదురు దెబ్బలు తింటూ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకే సాగుతానని పవన్‌ కళ్యాణ్‌ పదేపదే చెప్పేవారు.

అదే మాటకు కట్టుబడి నిబ్బరంగా ముందుకు సాగి చివరకి పవర్ స్టార్ నుంచి పవర్ ఫుల్ పోలిటికల్ స్టార్, రియల్ లైఫ్ స్టార్ అనిపించుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు కేవలం వినోదం పంచితే, ఈ రాజకీయ ప్రస్థానం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పవచ్చు.