
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలలో భాగమైన త్రిభాషా విధానం, డీలిమిటేషన్ నినాదం పై తమిళనాట జరుగుతున్న రాజకీయం రసవత్తరంగా మారింది. దక్షిణాది పై ఉత్తరాది ఆధిపత్యం అంటూ స్టాలిన్ తీసుకున్న ఈ ఉద్యమ పోరుకి తెలంగాణ నాయకులూ కూడా గొంతు కలిపినమాట తెలిసిందే.
అయితే జనసేన 12 వ ఆవిర్భావ సందర్భంగా జరిగిన సభలో త్రిభాషా విధానం పై తన స్టాండ్ చెప్పిన పవన్ ప్రత్యర్థి నోటికి చిక్కి అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే వాటన్నింటికి సరైన వివరణ ఇచ్చే క్రమంలో ఓ తమిళ టీవీ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో తన మనోగతాన్ని వివరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Also Read – అభిమానుల కలల సీజన్ ఇదేనా..?
త్రిభాషా విధానం తో కేవలం హిందీ మాత్రమే నేర్చుకోవాలని ఎవరు నిర్దారించలేదని, బలవంతపు భాష విధానానికి తానూ కూడా వ్యతిరేకినేనని వెల్లడించారు. బ్రిటిషర్లు అలవాటు చేసిన ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న మనం, మన భారతీయ బాషలలో ఒకటైన హిందీ నేర్చుకోవడంలో ఎందుకు భయపడుతున్నాం, ఇంగ్లీష్ భాష పట్ల లేని అభ్యంతరం, భయాందోళన హిందీ భాష పట్ల ఎందుకు అంటూ ప్రశ్నించారు.
ఇంగ్లీష్, హిందీ నేర్చుకున్నంత మాత్రానా మాతృభాషను తక్కువ చేసిచూపినట్టు కాదుకదా. త్రిభాష విధానాన్ని వ్యతిరేకిస్తున్న చాలామంది నాయకులు హిందీ భాషలో అనర్గళంగా మాట్లాడగలరు, అంతమాత్రానా వారు వారి మాతృభాషకు దూరమయ్యారా.? అంటూ తన భావాన్ని వ్యక్తపరిచారు. అలాగే డీలిమిటేషన్ తో పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల బలం తగ్గిపోతుంది అంటూ కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న విమర్శల పై కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు పవన్.
Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మీద కూడా ముందు లోక్ సభలో మాట్లాడి ఆ తరువాత ఫలితాలు రాకుంటే పోరాటాలకు దిగాలి కానీ ఇలా ముందుకు ముందే పోరాటాలు అంటూ రోడ్ల మీదకు రావడం, ప్రజలను రెచ్చకొట్టడం సరికాదన్నారు. డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే అభిప్రాయాన్ని తానూ ఏకీభవించను అంటూ కుండబద్దలు కొట్టారు పవన్.
గతంలో హిందీ భాష పై పవన్ చేసిన వ్యాఖ్యలు, దక్షిణాది పై ఉత్తరాది ఆధిపత్యం అంటూ ఆయన చేసిన విమర్శలను వైసీపీ, డిఎమ్కె పార్టీల నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పవన్ రోజుకో మాట, పూటకో విధానంతో ముందుకెళ్తారు అంటూ పవన్ ఆవిర్భావ ప్రసంగానికి కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ ఇంటర్ వ్యూ తో పవన్ ఆ విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది.
Also Read – బిఆర్ఎస్..కాంగ్రెస్ కుర్చీల ఆటలో బీజేపీ అరటిపండా.?
బలవంతపు భాష విధానానికి వ్యతిరేకిని కానీ ఇష్టానుసారం నేర్చుకునే భాషా విధానాన్ని స్వాగతిస్తాను , ఈ విషయంలో ఎప్పుడు ఒకే విధానం తో జనసేన ముందుకెళుతోంది అనే విషయాన్ని స్పష్టం చేసారు పవన్. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధానాలపై ప్రశ్నించడానికి జనసేన ముందుంటుంది అని స్పష్టం చేసారు.
త్రిభాష, డీలిమిటేషన్ వ్యతిరేక పోరుతో ఇటు తమిళనాడు, అటు తెలంగాణ బీజేపీ పై యుద్దానికి సిద్దమై ఆయా రాష్ట్ర ప్రజలలో భావోద్వేగాలను రెచ్చకొట్టి తద్వారా తమ పార్టీలకు రాజకీయ లబ్ది చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న జనసేన ఇలా తనకు, తన పార్టీకి అవసరం లేని పాలసీల మీద అతిగా స్పందిస్తూ అనవసర విభేదాలతో చిక్కుకోవడం ముమ్మాటికీ పవన్ అనాలోచిత చర్యగానే భావించాలి.
ఇప్పటికే సనాతన ధర్మం పేరిట పవన్ వేస్తున్న అడుగులు, ఆయన చేస్తున్న ప్రసంగాలు జనసేనకు ఏ మేరకు లబ్ది చేకూరుస్తాయో చెప్పలేని పరిస్థితి. కానీ ప్రత్యర్థి వైసీపీ పార్టీకి మాత్రం ఇవి మంచి అస్త్రాలుగా మారుతున్నాయి. దానితో సమయం, సందర్భం దొరికినప్పుడల్లా సనాతన ధర్మ పరిరక్షకుడు ఎక్కడ అంటూ పవన్ పై కౌంటర్లు వేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు హిందీ భాష, డీలిమిటేషన్ పై బీజేపీ కి బలం చేకూర్చేలా పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి లేనిపోని చిక్కులు తెచ్చేపెట్టే ప్రమాదం లేకపోలేదు.