
జనసేన పార్టీ జీరో నుంచి ఈ స్థాయికి ఎదిగినందున పిఠాపురంలో నిన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ పార్టీకి నిజంగా చారిత్రాత్మకమే. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం చాలా సాహసోపేతమైన నిర్ణయమే.
ఆ నేపధ్యంతో మొదలైన జనసేన తొలిసారి ఎన్నికలకు దూరంగా ఉండిపోవడం మొదలు టీడీపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావడానికి మద్య పవన్ కళ్యాణ్ అనేక సమస్యలు, సవాళ్ళు, అవమానాలు, అగ్నిపరీక్షలు ఎదుర్కోవలసి వచ్చింది.
Also Read – గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!
వాటన్నిటినీ చాలా నిబ్బరంగా ఎదుర్కొని ఓ సమర్ధుడైన రాజకీయ నాయకుడుగా ఎదిగారు. తాను గెలిచి, పార్టీని గెలిపించుకున్నారు. తొలిసారిగా అధికారంలోకి వచ్చారు. అన్న నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇప్పించుకున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ పార్టీకి నిజంగా చారిత్రాత్మకమే.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంతో, ఉద్వేగంతో చేసిన ప్రసంగంలో మంచీ ఉంది.. చెడూ ఉంది. కేసీఆర్ నేటికీ ఓ ప్రాంతీయ పార్టీ అధినేతగా మిగిలిపోయి ప్రాంతీయవాదంతోనే రాజకీయాలు చేస్తుంటే, తొలిసారిగా అధికారంలోకి వచ్చిన జాతీయ స్పూర్తితో మాట్లాడారు.
Also Read – అందరి తాపత్రయం మైలేజ్ కోసమే?
తమిళనాడులో పార్టీలు రాజకీయాల కోసం హిందీని వ్యతిరేకిస్తుండటాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. కుల మతాలు, భాషలు, ప్రాంతాల పేరుతో ప్రజలను విడదీసి దేశ సమగ్రతకు భంగం కలిగించడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు తీరని అపకారం, ద్రోహం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ప్రయత్నంలో తనకు ఎదురైన అవమానాలు, అవహేళనలు, కేసులు, అణచివేతలను ప్రస్తావిస్తూ, జనసేనను కాపాడుకోవడమే కాకుండా నాలుగు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీడీపీని కాపాడామని ఇటువంటి సభలో పవన్ కళ్యాణ్ చెప్పడం సబబు కాదు. ఆయన మాటలు టీడీపీని కించపరిచిన్నట్లనిపిస్తుంది.
Also Read – పిఠాపురం పంచాయితీ తీరినట్టేనా.?
ఒకవేళ ఆయనకే అంత శక్తి ఉండి ఉంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉన్నసీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తులు పెట్టుకొని వాటిని గెలిపించి, జనసేనని గెలిపించుకొని ఉండొచ్చు కదా?
2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు జనసేన ఎందుకు ఓడిపోయింది? పవన్ కళ్యాణ్ స్వయంగా ఎందుకు ఓడిపోయారు?
తెలంగాణ ఎన్నికలలో బీజేపితో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా జనసేన పోటీ చేసిన 8 స్థానాలలో కనీసం డిపాజిట్లు రాలేదు? ఆ ఓటమిని పవన్ కళ్యాణ్ అప్పుడే మరిచిపోయారా?
టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక ఎలా గెలిచారు? టీడీపీతో పొత్తులు పెట్టుకున్నందుకు జనసేన కూడా లాభపడింది కదా?
ఏపీలో జై తెలంగాణ అని గట్టిగా నినాదం చేసిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో జై ఆంధ్రా అని నినాదం చేయగలరా? దేశానికి వంద మంది మెరికల్లాంటి యువ నాయకులను అందిస్తాననే పవన్ కళ్యాణ్ మాటలు సినిమా డైలాగులా వినడానికి చాలా బాగున్నాయి. కానీ ఆచరణ సాధ్యమా? పవన్ కళ్యాణ్ ప్రసంగం టీడీపీతో బందం మరింత బలపడేందుకు దోహదపడాల్సి ఉండగా దూరం పెంచేదిగా ఉంది.
తద్వారా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న వైసీపీకి పవన్ కళ్యాణ్ స్వయంగా అవకాశం కల్పించిన్నట్లయింది కదా? ఏది ఏమైనప్పటికీ టీడీపీతో పొత్తు గురించి పవన్ కళ్యాణ్ హుందాగా మాట్లాడి ఉంటే అందరూ హర్షించేవారు.