Pawan Kalyan TN, Pawan Tamil Nadu politics, Pawan AIADMK alliance, Pawan BJP Tamil Nadu, Pawan Kalyan NDA, Jana Sena Tamil Nadu

తెలంగాణలో కూడా జనసేన ఉంది. అక్కడ ఎన్నికలలో పోటీ చేసింది కూడా. కనుక ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరూ ఆశ్చర్యపోరు. కానీ ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల గురించి తరచూ మాట్లాడుతుండటమే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ దానికి బలమైన కారణమే కనిపిస్తోంది.

Also Read – భారత్‌ పాలిట కరోనాలా పాక్.. టీకాలు తప్పవు

తమిళనాడులో అధికారంలోకి రావాలని బీజేపి చాలా కాలంగా తహతహలాడుతోంది. జయలలిత ఆకస్మిక మరణంతో తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతని అవకాశంగా మలుచుకోవాలని బీజేపి అధిష్టానం భావించింది. ఆ తర్వాత అధికార అన్నాడీఎంకేని కేంద్రం మెల్లగా తన అధీనంలో తెచ్చుకోగలిగింది. కానీ 2021లో ఎన్నికలలో బీజేపి ఓడిపోయింది.

తమిళనాడు రాజకీయాలలో బీజేపికి సాయపడేందుకు రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ ఇష్టపడలేదు. కనుక ఆ రాష్ట్రంలో ప్రభావం చూపగల బలమైన నాయకుడు కావాలని బీజేపి అధిష్టానం భావించడం సహజం.

Also Read – ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత

అందుకు సినీ, రాజకీయాలలో రాణిస్తూ, బీజేపి రాజకీయాలకు పునాది వంటి హిందూమతం పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగిన పవన్ కళ్యాణ్‌ సరైన వ్యక్తి అని భావించి, ఆయనకు ఈ బాధ్యత అప్పగించి ఉండొచ్చు. బహుశః అందుకే పవన్ కళ్యాణ్‌ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని భావించవచ్చు.

పవన్ కళ్యాణ్‌ తాజా ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడిన మాటలు వింటే, ఆయన భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చింది.

Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?

తాను 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నానని కనుక తనకు తమిళనాడు ప్రజలతో, తమిళ సంస్కృతీ సంప్రదాయాలతో, తమిళ్ భాష, సినిమాలు, సాహిత్యంతో, రాజకీయాలతో బలమైన అనుబంధం ఉందని పవన్ కళ్యాణ్‌ చెప్పారు.

తాను కూడా ఎంజీఆర్‌, అన్నాదురై, శివాజీ గణేశన్ అభిమానినని, వారి సినిమాలు, రాజకీయాలు తనకు ఎంతో స్పూర్తినిచ్చేయన్నారు.

కోలీవుడ్‌ హీరో విజయ్ సొంత పార్టీ పెట్టుకొని రాజకీయాలలోకి రావడాన్ని పవన్ కళ్యాణ్‌ స్వాగతించారు. కానీ ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేసినా గెలిచి ముఖ్యమంత్రి కాలేకపోవచ్చునని, ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేతో పొత్తులు పెట్టుకుంటే మంచిదేనని పవన్ కళ్యాణ్‌ అన్నారు.

గతంలో ఎన్డీఏలో అన్నాడీఎంకే ఉండేదని మళ్ళీ వస్తే మంచిదేనన్నారు. తమిళనాడు ప్రజల అభీష్టం మేరకు ఆ రాష్ట్రంలో విస్తరించేందుకు జనసేన సిద్దంగానే ఉందని భవిష్యత్‌లో జనసేన, అన్నాడీఎంకేతో పొత్తులు పెట్టుకునే అవకాశం కూడా ఉందన్నారు పవన్ కళ్యాణ్‌.

ఈ లెక్కన అన్నాడీఎంకే ఎన్డీఏలో చేరితే దాంతో జనసేన, బీజేపిలు పొత్తులు పెట్టుకోబోతున్నాయని పవన్ కళ్యాణ్‌ సూచన ప్రాయంగా చెప్పేశారు.

బహుశః ఈ పధకంలో భాగంగానే విజయ్ చేత బీజేపి అధిష్టానం రాజకీయ ప్రవేశం చేయించి ఉండొచ్చు. ఆయన కూడా అవసరమైతే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడమో లేదా వేరేగా పోటీ చేసి ఓట్లు చీల్చి అధికార డీఎంకేని దెబ్బ తీసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడటమో చేయబోతున్నారని పవన్ కళ్యాణ్‌ మాటలతో స్పష్టమవుతోంది. కనుక పవన్ కళ్యాణ్‌ తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించడం ఖాయమనే భావించవచ్చు.