Posani Krishna Murali Case: Media Leaks Raise Questions

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అరెస్టు విషయంలో జగన్‌, వైసీపీ నేతలు, వారి సొంత మీడియా ఎక్కువగా స్పందించాలి. కానీ జగన్‌ మొక్కుబడిగా ఖండించగా, వైసీపీ నేతలు కూడా మొక్కుబడిగా తలో ప్రెస్‌మీట్‌ పెట్టి, నాలుగు ట్వీట్లు వేసి చేతులు దులుపుకున్నారు. వారి సొంత మీడియాకు బాధ్యత ఉంటుంది కనుక పోసాని కేసుని బాగానే కవర్ చేస్తోంది.

Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?

పోసాని కేసు విషయంలో కూటమి నేతలు కూడా స్పందించాలి కానీ వారు అసలు ఆయన అరెస్ట్‌ అయిన విషయం తమకు తెలియదన్నట్లు మౌనంగా ఉంటూ చాలా సంయమనం పాటిస్తున్నారు. పోసాని విషయంలో అధికార కూటమి నేతలు, వైసీపీ నేతలు అందరూ సంయమనం పాటిస్తుండగా, మీడియా మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

పోసానికి మద్దతుగా వైసీపీ సొంత మీడియా కధలు చెప్పడం సహజమే కానీ ఆయన పోలీసుల విచారణలో ఏమేమి చెప్పారో ప్రత్యక్ష సాక్షిలా మీడియాలో వార్తలు వస్తుండటం అత్యుత్సాహమే కదా?

Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?

‘సాక్షి మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారమే ప్రెస్‌మీట్‌లో మాట్లాడేవాడినని, ఆ సమాచారం సాక్షి మీడియా స్వయంగా ఇచ్చినందున అది పూర్తిగా వాస్తవమే అని నమ్మి ఆ ప్రకారం మాట్లాడేవాడినని’ పోసాని పోలీసులకు చెప్పిన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

పోలీస్ విచారణలో ఏం జరుగుతోంది? పోసాని ఏమేమి చెపుతున్నారు?వంటి విషయాలు చాలా గోప్యంగా ఉంచాలి. కానీ ఈ విషయాలు మీడియాకు లీక్ అవుతున్నాయంటే, పోసానిపై కేవలం రాజకీయ దురుదేశ్యంతోనే ఈ కేసు నమోదు చేశారనే వైసీపీ వాదనాలకు బలం చేకూరుతుంది కదా?

Also Read – ప్రమోషన్స్‌ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!

ఇదివరకు కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ముగ్గురు బీజేపి ప్రతినిధులు హైదరాబాద్‌ వచ్చారు. అప్పుడు కేసీఆర్‌ వారిని చాలా తెలివిగా వల వేసి పట్టుకున్నారు.

కానీ కేసీఆర్‌ అత్యుత్సాహంతో ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపి ప్రతినిధులను తెలంగాణ పోలీసులు, ఏసీబీ ఏవిదంగా వల వేసి పట్టుకున్నారో వివరించి, వారి ఫోటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేశారు.

అక్కడితో ఆగకుండా వాటిని పెన్ డ్రైవ్‌లో ఎక్కించి హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, దేశంలో బీజేపియేతర పార్టీల అధినేతలకు, ముఖ్యమంత్రులకు పంపించారు.

ఒకవేళ కేసీఆర్‌ ఆవిదంగా అత్యుత్సాహం ప్రదర్శించకుండా సంయమనం పాటించి ఉండి ఉంటే, ఆ కేసు నుంచి బీజేపి ప్రతినిధులను కాపాడటం కేంద్రానికి కూడా చాలా కష్టమయ్యేది.

కానీ పోలీసుల విచారణలో ఉన్న కేసు గురించి ప్రెస్‌మీట్‌ పెట్టి కేసీఆర్‌ స్వయంగా మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఆయన రాజకీయ కక్ష, రాజకీయ దురుదేశ్యంతోనే ఈ కేసులో వారిని ఇరికించారని మొదట హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు ఆ ముగ్గురికీ ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది.

అదేవిదంగా ఇప్పుడు పోలీస్ విచారణలో పోసాని ఏమేమి చెప్పారో మీడియాకు వార్తలు లీక్ అవుతుంటే రేపు ఆయన కూడా దర్జాగా బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది కదా?అయినా పోసాని కేసు విషయంలో సిఎం చంద్రబాబు నాయుడుతో సహా కూటమిలో అందరూ చాలా సంయమనం పాటిస్తున్నప్పుడు, మీడియాకు ఎందుకు ఈ అత్యుత్సాహం?పోలీస్ విచారణ గురించి మీడియాకు ఎవరు లీకులు ఇస్తున్నారు?ఇచ్చినా వాటిని ప్రచురించడం అవసరమా?