Sekhar Kammula Made it Possible Which Shankar Couldn't

గత కొన్ని నెలల నుంచి సరైన బాక్స్ ఆఫీస్ విజయం కోసం టాలీవుడ్ ఆతృతగా ఎదురు చూస్తుంది. థియేటర్లలోకి వచ్చిన సినిమాలు వచ్చినట్టే ఓటిటీ బాట పట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన శేఖర్ కమ్ముల కుబేర నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.

శేఖర్ పాన్ ఇండియా దర్శకుడు కాదు, అలాగని టాలీవుడ్ కమర్షియల్ దర్శకుడు కాదు, ఒక మంచి కాఫీ లాంటి సినిమాలు తీసే తెలుగు దర్శకుడిగా శేఖర్ కమ్ములకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న మాట వాస్తవం. అయితే శేఖర్ సాధించిన ఈ విజయంతో ఇప్పుడు మరో అంశం చర్చకొస్తుంది.

Also Read – ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పవన్‌ కళ్యాణ్‌

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన శంకర్, చెర్రీ గేమ్ ఛేంజర్ ఎన్నో అంచనాల మధ్య విడులయ్యి చివరికి ఓటిటీ లో కూడా ఆదరణ దక్కించుకోలేకపోయింది. అయితే తమిళ దిగ్గజ దర్శకులలో ఒకరైన శంకర్ జెంటిల్ మాన్, జీన్స్, ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడు, రోబో, భారతీయుడు – 2 వంటి బహు భాషా చిత్రాలను రూపొందించారు.

అలాగే భారీ బడ్జెట్ సినిమాలకు, బ్రాండ్ అంబాజిడర్ గా కూడా పేరు గడించారు.ఇక స్టార్ హీరోలను దర్శకత్వం చేసిన అనుభవం శంకర్ కు మెండుగా ఉంది. అటువంటి దర్శకుడు టాలీవుడ్ అగ్రహీరోలతో ఒకరైన రామ్ చరణ్ తో కలిసి మూవీ తెరకెక్కిస్తున్నారు అంటే బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో, అభిమనుల అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి.

Also Read – చీకట్లో వేసేసి పగలు పరామర్శించాలట!

అయితే ఒక్కసారి వెండితెర మీద గేమ్ ఛేంజర్ బొమ్మ పడగానే అభిమానుల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. జరగండి..జరగండి అనే ఒక్క పాట చిత్రీకరణకే శంకర్ 20 కోట్లు ఖర్చు చేసినప్పటికీ శంకర్ తన బడ్జెట్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిచలేకపోయారు. అయితే సినిమా విషయానికొస్తే సుమారు 450 కోట్లు వెచ్చించినట్టు ప్రచారం జరిగింది.

అయితే ఈ స్థాయి బడ్జెట్, గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ ఛరిష్మా, బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా గ్లామర్ కలిసి కూడా ఈ పాన్ ఇండియా దర్శకుడికి విజయాన్ని కట్టబెట్టలేకపోయాయి.పేలవమైన కథ, ఎమోషన్ పలకలేని కథనం, దర్శకత్వంలో ఎటువంటి అబ్బురపరిచే అంశాలు లేకపోవడంతో గేమ్ ఛేంజర్ విజయ తీరాలు దాటలేకపోయింది.

Also Read – తెలంగాణలో గోదావరి నీళ్ళని వాడుకోలేరు కానీ..

దీనితో ఈ గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ మొత్తం కూడా శంకర్ ఖాతాలోకే వెళ్ళిపోయింది. అలాగే గతంలో కమలహాసన్ తో తీసిన భారతీయుడు – 2 కూడా పూర్తిగా ప్రేక్షుకులను నిరాశ పరిచడంతో శంకర్ దర్శకత్వం మీద విమర్శలు కూడా ఆయన మూవీ బడ్జెట్ మాదిరి భారీ స్థాయిలోనే వెల్లువెత్తాయి.

ఇక శేఖర్ విషయానికొస్తే, ఆయన గత చిత్రాల ట్రాక్ రికార్డు చూస్తే, భారీ బడ్జెట్ లు ఉండవు, భారీ స్టార్ కాస్ట్ కనిపించదు, అయితే కొత్త నటీనటలు, లేకుంటే రానా, నాగ చైతన్య, వరుణ్ తేజ్ వంటి అప్ కమింగ్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తారు. అలాగే శేఖర్ మూవీస్ లో ఎక్కడ హంగు ఆర్భాటాలకు తావుండదు.

VFX, గ్రాఫిక్స్ మాయాజాలం కనిపించదు. కేవలం కథ, కథనం ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తూ, హీరోలకు సమానమైన పాత్రలో హీరోహీన్స్ కు ప్రాధాన్యం ఇస్తూ మంచి కాఫీ లాంటి సినిమాలు తీసే దర్శకుడిగా ఉన్నత గుర్తింపు సంపాధించుకున్నారు శేఖర్.

ఇక తాజా కుబేర చిత్రం తో తనకు అలవాటు లేని పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టిన శేఖర్ అనుకున్న లక్ష్యాన్ని గురి చూసి కొట్టారు. కుబేర విజయం తో శేఖర్ పై ప్రేక్షకుడిలో మరింత గౌరవం పెరిగింది.

లీడర్ మూవీ తో పొలిటికల్ చిత్రాలలో ఒక క్లాసిక్ ను తెరమీదకు తెచ్చారు, హ్యాపీ డేట్స్ మూవీ తో యువతకు ఒక ఫీల్ గుడ్ మూవీ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక ఫిదా లవ్ స్టోరీ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసారు.

కుబేరాలో శేఖర్ తమిళ అగ్రహీరోలతో ఒకరైన ధనుష్ ను ఎంచుకున్నారు. ఒక తెలుగు దర్శకుడిగా ఒక తమిళ హీరో కి పాన్ ఇండియా విజయాన్ని అందించారు శేఖర్, ఇక ఒక పాన్ ఇండియా దర్శకుడిగా, తమిళ అగ్ర దర్శకులలో ఒకరైన శంకర్ టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖాతాలో భారీ డిజాస్టర్ చేర్చారు.




దీనితో శంకర్ కి సాధ్యం కానిది శేఖర్ కు సాధ్యమయ్యింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.