
తెలుగు దేశం పార్టీ స్థాపించి ఈ ఏడాది మార్చ్ నాటికి 43 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. 29 మార్చ్ 1982 లో నందమూరి తారక రామారావు చేత స్థాపించబడిన టీడీపీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు మరో తరం నాయకత్వ పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది.
ఎన్టీఆర్ మనవడిగా, నారా చంద్రబాబు తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నారా లోకేష్ 2019 లో ఓటమితో కాస్త తడబడినా, వెంటనే తేరుకుని తన ఓటమికి గల కారణాలను అన్వేషించారు, అలాగే కొన్ని దశాబ్దాలుగా మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేలకపోవడానికి గల వాస్తవాలను శోధించారు.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
ఇక 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అత్యంత గడ్డుకాలం చూసింది. పార్టీ కార్యకర్తలే కాదు పార్టీ ముఖ్య నాయకులు కూడా స్వేచ్ఛగా, ప్రజా స్వామ్య బద్దంగా రాష్ట్రంలో రాజకీయం చేసే పరిస్థితి లేకపోయింది.
పార్టీ నాయకుల మీద కేసులు, అరెస్టులు, పార్టీ కార్యాలయాల మీద దాడులు, నడి రోడ్ల మీద టీడీపీ నేతల మీద వైసీపీ మూకల అరాచకాలు అన్ని కలిసి నాలుగు దశబ్దాల రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ పార్టీని ఆలోచనలో పడేసేలా చేసాయి.
Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?
అటువంటి కీలక సమయంలో ‘యువగళం’ పాదయాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన నారా లోకేష్ తనను తానూ తెలుసుకుంటూ, ప్రజలకు పార్టీ క్యాడర్ కు దగ్గరవుతూ, పార్టీ నాయకులలో వైసీపీ పై పోరాటానికి ఒక ఆత్మ స్తైర్యాన్ని నింపారు.
ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు తో టీడీపీ పార్టీని నిర్వీర్యం చేయడానికి వైసీపీ, టీడీపీ పై సమాధానదండోపాయాలను ప్రయోగించింది. అటు వంటి విపత్కర పరిస్థితులను సైతం తట్టుకుని అటు కుటుంబానికి, ఇటు పార్టీకి పెద్దదిక్కుగా నిలిచి ‘నేనున్నాను’ అనే మనోధైర్యాన్ని తెలుగు తమ్ముళ్లలో నింపారు లోకేష్.
Also Read – కేసులు, నోటీసులా? డోంట్ వర్రీ.. వాటినీ వాడేసుకుందాం!
ఇటు రాష్ట్రంలో కలిసి వచ్చిన జనసేన పార్టీని కలుపుకుంటూ, అటు తండ్రిని బయటకు తీసుకురావడానికి హస్తినలో చక్కబెట్టాల్సిన పరిస్థితులన్నిటిని ఒంటి చేతిమీద లాక్కొచ్చి వైసీపీ కుట్ర రాజకీయాలను భగ్నం చేసి ఓడిన చోటే సుమారు 90 వేలపైచిలుకు ఓట్లతో బారి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
పాదయాత్రతో తనను తానూ ఒక నాయకుడిగా మలచుకున్న లోకేష్, బాబు అరెస్టు తో పార్టీ భవిష్యత్ నాయకుడిగా టీడీపీ శ్రేణుల నమ్మకాన్ని పొందారు. ఇక 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తన తల్లికి జరిగిన పరాభవానికి, తన తండ్రికి జరిగిన అవమానానికి, పార్టీ క్యాడర్ కు జరిగిన అన్యాయానికి, నాయకులకు జరగవలసిన న్యాయానికి సరైన నిర్వచనం చెప్పేలా ‘రెడ్ బుక్’ తో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు దిక్సూచి గా నిలిచారు.
అయితే ఈనెల కడపలో 27 నుంచి 29 వరకు జరగబోయే టీడీపీ మహానాడు వేడుకలో పార్టీలో నారా లోకేష్ పదవోన్నతి పైనే అందరి ద్రుష్టి కేంద్రీకృతమయ్యింది. ఇప్పటికే టీడీపీ నాయకులు, క్యాడర్ టీడీపీ కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేష్ అంటూ బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ మహానాడు లో పార్టీ అధినేతగా చంద్రబాబు, లోకేష్ కు ఎటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.