CBN KCR

సుమారు 4 దశబ్దాల అధికార పార్టీని ఎదిరించి పార్టీని స్థాపించిన 9 నెలలోనే అధికార పీఠాన్ని దక్కించుకుని తెలుగు వాడి సత్తా దేశానికీ చాటిన పార్టీ తెలుగు దేశం పార్టీ. సినీ రంగంలో తనకున్న ఛరిష్మాతో, ప్రజా సేవ మీద తనకున్న అంకిత భావంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అనే మోనోపోలీ పార్టీ విధానాలతో విసుగెత్తిన ఎన్టీఆర్ రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీ అవసరాన్ని, ప్రాముఖ్యతను చాటి చెప్పారు.

దశాబ్దాల నుండి రాష్ట్రంలో పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలించి తెలుగు వాడి పౌరుషం, తెలుగు వాడి తెగింపే తెలుగు దేశం పార్టీ అనేలా హస్తినకు పసుపు జెండా పొగరును చూపించారు ఎన్టీఆర్. 1982 మార్చ్ 29 న స్థాపించిన టీడీపీ ఆవిర్భవించిన 9 నెలలకే అధికారాన్ని అందిపుచ్చుకుని దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి వెళ్ళింది. ఎన్టీఆర్ ఆశయాలకు ప్రభావితమై టీడీపీ పార్టీతోనే తన రాజకీయ ప్రవేశం మొదలుపెట్టిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు.

Also Read – అభిమానులూ… పవన్‌ కళ్యాణ్‌కి చెడ్డపేరు తేవద్దు

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కార్యకర్త స్థాయి నుండి నాయకుడి స్థాయికి ఎదిగి చివరికి ఆ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే 2001 ఏప్రిల్ 27 న తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో పార్టీని స్థాపించి పోరాటమే తమ ఆయుధంగా మార్చుకుని 2014 జూన్ 2 న తన పార్టీ లక్ష్యాన్ని అందుకున్నారు కేసీఆర్. అయితే తెలంగాణ ప్రజల కొన్ని దశబ్దాల కల, పోరాటమే తెరాస అనేలా ఆ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించారు.

ఎన్టీఆర్ నుండి టీడీపీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు పార్టీని ఉమ్మడి ఏపీలో రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చి 9 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి హైద్రాబాద్ లో బాబు బ్రాండ్ ను టీడీపీ మార్క్ పాలన ను చూపించారు. ఆ తరువాత రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఏపీకి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న బాబు ఐదేళ్లకే ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.

Also Read – మారాల్సింది ఎవరు? చంద్రబాబా… జగనా?

అలాగే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్న కేసీఆర్ పదేళ్ళపాటు అధికార పగ్గాలు దక్కించుకోగలిగారు. అయితే టీడీపీ, బిఆర్ఎస్ గా మారిన తెరాస రెండు పార్టీలు అధికారాన్ని, ప్రతిపక్షాన్ని చూసిన వారే కానీ ప్రతిపక్షంలోకి వెళ్లిన ప్రతిసారి టీడీపీ మళ్ళీ గోడకు కొట్టిన బంతి మాదిరి అంతే వేగంగా అధికారాన్ని అందిపుచ్చుకుంటుంది. మరి బిఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగానే గాలిపోయిన టైర్ మాదిరి కుప్పకూలిపోయింది.

అలాగే ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు అధికార పార్టీ చేసే కవ్వింపు చర్యలను, రెచ్చకొట్టే వ్యాఖ్యలను, కించపరిచే విమర్శలను, అరెస్టులు, కేసులను తట్టుకుంటూ ఆనాటి వైస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుండి ఈనాటి వైస్ జగన్ మోహన్ రెడ్డి వరకు అధికార పార్టీకి దీటుగా ప్రజల తరుపున ప్రతిపక్ష పార్టీ గొంతు వినిపించింది టీడీపీ. 2019 ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ విజయం రాష్ట్ర పాలన కోసం కాదు టీడీపీ అంతం కోసమే అనేలా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేసింది.

Also Read – కేటీఆర్‌కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆదర్శమట!

ఒక్కో టీడీపీ నాయకుడి మీద కేసులు పెట్టుకుంటూ చివరికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ను సైతం జైలుకు పంపించి పసుపు జెండాను ఏపీలో పాతిపెట్టాలని చూసిన జగన్ ఆలోచనలను 2024 ఎన్నికలలో అంతే బలంగా తిప్పికొట్టారు టీడీపీ క్యాడర్. పార్టీ పని అయిపొయింది అనే స్థాయి నుంచి పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే స్థాయికి చేరుకుంది టీడీపీ. ఐదేళ్ల వైసీపీ అణివేతను తట్టుకుని మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి ప్రతి ఒక్కరు ఒక సైన్యంలా పనిచేసి టీడీపీ జెండా తెగింపును మరోసారి చాటి చెప్పారు.

అయితే పదేళ్ల అధికారం చేజారగానే ఒక్క్కొక్కరు బిఆర్ఎస్ పార్టీని వీడి అధికార పార్టీ నీడను వెతుకుతున్నారు. పోరాటాలతో పుట్టిన పార్టీని కుటుంబ పార్టీగా మార్చి తెలంగాణ కోసం కాదు పక్క పార్టీల అంతం కోసమే అన్నట్లు పని చేసి అన్ని పార్టీల నాయకులతో అధికారం అనే తన కారును నింపింది బిఆర్ఎస్. ఒక్కసారి ఆ అధికారం దూరమవ్వగానే ఏ గూటి పక్షి ఆగూటికి వెళ్ళిపోయినట్లు బిఆర్ఎస్ కారు ఖాళీ అయ్యింది. పోరాటాలతో అధికారాన్ని అందుకున్న బిఆర్ఎస్ ఇపుడు తనతో తానె పోరాటం చేసుకునే స్థితికి చేరుకుంది.

ప్రతిపక్షంలోకి వచ్చి కనీసం ఆరు మాసాలు గడవక ముందే పార్టీ అస్తిత్వం మీదే అనుమానాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ఫలితాల తరువాత బిఆర్ఎస్ పరిస్థితి ఇంకాస్త సన్నగిల్లడం ఖాయమనే వార్తలు తెలంగాణ అంతటా విస్తరించాయి. అధికారంలో ఉన్నప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నపుడే ఆ ఆపార్టీ బలం, బలహీనత, తెగువ , తెగింపు, పోరాటం అన్ని వాస్తవ రూపంలో కనిపిస్తాయి.

తానూ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో టీడీపీ ని భూస్థాపితం చేయగలిగాము అని విర్రవీగిన కేసీఆర్ కు ఇప్పుడు సొంత రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలే సమాధి కట్టే పరిస్థితికి వచ్చారు. రాజకీయ పార్టీలు అధికారం ఉన్నంత కాలం సొంత ప్రయోజనాలు చూసుకుంటూ పక్క పార్టీల విలీననానికి, విధ్వంసానికి ప్రయత్నాలు చేస్తే ‘గొడ్డలితో మొదలైన రాజకీయం గొడ్డలితోనే ముగిస్తుంది’ అనే సామెత మాదిరి పార్టీల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.