Tirupati Laddu

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పాపాల చిట్టా ఒక్క్కొకటిగా బయటపడుతుంటే అణ్డరు నోరెళ్లబెడుతున్నారు. జగన్ అవినీతి, అక్రమాలతో ప్రజలను మోసం చేయడమే కాదు ఏకంగా హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం మీద కూడా వీరు విషం కక్కారు అంటూ సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పేర్కొన్నారు.

అందరూ అత్యంత పవిత్రంగా సేవించే తిరుమల శ్రీ వారి లడ్డు తయారీలో వైసీపీ హయాంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ ఆరోపించారు సీఎం చంద్రబాబు. అయితే ఈ ఆరోపణలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెదద్ ఎత్తున చర్చకు దారి తీశాయి. శ్రీవారికి మన దేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా కోట్లాది సంఖ్యలో భక్తులుంటారు.

Also Read – వైసీపి, టిడిపి… దేని ఉచ్చులో ఏది?

వారంతా కూడా నిన్న సీఎం హోదాలో బాబు చేసిన ఆరోపణలు మీద ఆందోళన చెందుతున్నారు. తప్పు జరిగింది సాక్ష్యాత్తు ఆ ఏడు కొండల వాడి సన్నిధిలో, ఆయన ప్రసాదం లో, ఆరోపించింది ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దీనితో శ్రీవారి భక్తులలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తిరుమల కొండ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చరిత్ర వైస్ కుటుంబానికి ఉంది.

అలాగే గత ఐదేళ్లలో తిరుమల వెంకన్న దర్శనం మొదలు కుని ఆయన ఆర్జిత సేవలు, లడ్డు, అన్న ప్రసాదాల విషయం వరకు అన్నింటి మీద భక్తులు వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడిన ఆనవాళ్లు ఉన్నాయి. గోవిందుడి లడ్డులో, వెంకన్న అన్న ప్రసాదంలో నాణ్యత లోపించింది అంటూ గత ఐదేళ్లుగా శ్రీవారి భక్తులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా అప్పుడు పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.

Also Read – విశాఖ అభివృద్ధిలో మరో అడుగు టీసీఎస్!

చివరకు భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో చెల్లించే మొక్కుబడులు విషయంలో కూడా వైసీపీ టీటీడీ నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. శ్రీ వారి హుండీ ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం చర్చ్ ఫాదర్ లకు ఇస్తుంది అంటూ గతంలో బీజేపీ నేతలు సైతం వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. అలాగే గత ఐదేళ్లు తిరుమల కొండ మీద యథేచ్ఛగా అన్య మత ప్రచారం సాగుతుంది అంటూ బీజేపీ నేత భాను ప్రకాష్ పలు మార్లు మొరపెట్టుకున్నారు.

అయితే శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు,చేప నూనె కలిపారు అంటూ టీడీపీ చేసిన ఆరోపణలకు బలం చేకూరేలా నేడు “నేషనల్ డైరీ బోర్డు” ఈ లడ్డు శాంపిల్స్ పరిశీలించి ఈ ఆరోపణలు వాస్తవమే అని నిర్దారించినట్టు టీడీపీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునేంత చిన్న విషయం అయితే కాదు.

Also Read – కిల్ బిల్ పాండ్య’..!

తప్పు జరిగింది అని రుజువయితే అందుకు కారణమైన వారు ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి వారైనా, వారిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కేవలం టీడీపీ ఆరోపణలకు మాత్రమే పరిమితమైతే ఇది ఒక రాజకీయ విమర్శగానే మిగిలిపోతుంది. అయితే తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు తన ఇంటి ఇలవేల్పైన ఆ ఏడు కొండలవాడిని వాడుకుంటారా అంటే ముమ్మాటికీ ప్రజలు కాదనే అంటారు.

కాకపోతే తప్పు చేసాడు అని చెప్పడం కాదు ఆ తప్పుకి శిక్ష వేయడం న్యాయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీవారి లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదు కొన్ని కోట్ల ప్రజల ఎమోషన్. దాన్ని కూడా రాజకీయ విమర్శలతో సరిపెడితే ఆ దేవదేవుడి భక్తుల మనోభావాలు దెబ్బ తీసినట్లే అవుతుంది.