kcr-phone-tapping

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు, విచారణని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తేలికగా కొట్టిపడేస్తున్నప్పటికీ, అది కేసీఆర్‌ మెడకు చుట్టుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఈ కేసులో ఏ-1గా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్‌ తిరిగి వచ్చి విచారణకు హాజరవడంతో ఈ కేసు కొలిక్కి వచ్చేసినట్లే అనిపించింది. కానీ ఆయన విచారణకు సహకరించకుండా మొండికేస్తుండటంతో కధ మళ్ళీ మొదటికొచ్చింది. సరిగ్గా ఇక్కడ సిట్ అధికారులు ఈ కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

Also Read – హిందీ భాష పై బాబు స్పందన…

తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపిలలో ఫోన్ ట్యాపింగ్ బాధిత నేతలని విచారణకి పిలిచి ప్రశ్నించి వారి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని నిర్ధారించుకుంటున్నారు.

ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌తో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పిలిచి వాంగ్మూలాలు తీసుకున్నారు.

Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!

సంచలన వ్యాఖ్యలు, వివాదాలకు పేరొందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావుని కూడా నేడు సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్‌ తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఫోన్‌తో సహా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు వంటి పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేయించారని చెప్పారు.

గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని, ఆ తర్వాత ముగ్గురు బీజేపి ప్రతినిధులను ఆవిదంగానే వలవేసి పట్టుకున్నారని గోనె ప్రకాష్ రావు అన్నారు.

Also Read – జగన్‌ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?

కేంద్ర సహాయ మంత్రి, బీజేపి ఎంపీ బండి సంజయ్‌ తన ఫోన్‌ కూడా కేసీఆర్‌ ట్యాపింగ్ చేయించారని ఇదివరకు ఆరోపణలు చేశారు. కనుక ఆయనకి అత్యంత సన్నిహితుడైన ప్రవీణ్ రావుని వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు.

ఇక ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తమ ఫోన్లు కేసీఆర్‌ ట్యాపింగ్ చేయించి, తమ రహస్యాలను తన అన్న జగన్మోహన్ రెడ్డికి పంపించేవారని చెప్పారు. సిట్ అధికారులు పిలిస్తే వెళ్ళి వాంగ్మూలం ఇస్తానని చెప్పారు.

ఇప్పుడు ఈ కేసులో ఇంత మంది బాధితులు ముందుకు వచ్చి ఇస్తున్న వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలతో సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణని మరో మలుపు తిప్పారని చెప్పక తప్పదు. ఇది కేసీఆర్‌, కేటీఆర్‌ ఊహించని ట్విస్ట్ అని చెప్పొచ్చు.

ఇప్పటికీ ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోతే ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు ముందుంచి ఆయనని అరెస్ట్‌ చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అరెస్టుకి భయపడే ఆయన ఇంతకాలం అమెరికాలో దాక్కున్నారు. కనుక అరెస్ట్‌ అంటే ఇప్పుడు ఆయన నోరు విప్పడం ఖాయమే.

ఒకవేళ విప్పకపోయినా ఇంతవరకు సేకరించిన ఈ సాక్ష్యాధారాలతో సిట్ అధికారులు కేసీఆర్‌పై కేసు నమోదు చేసి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది.




కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ చిక్కుకుంటే ఇక బిఆర్ఎస్ పార్టీ బీజేపిలో విలీనం కాకుండా ఎవరూ ఆపలేకపోవచ్చు. కనుక రాబోయే నెలరోజుల్లో తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ఏదైనా పెను మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.