Jagan Convoy Vehicle Killed Man

రెంటపాళ్ళలో ఆత్మహత్య చేసుకొన్న వైసీపీ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్‌ వెళ్ళినప్పుడు వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు ప్రదర్శించడం, దానిని జగన్‌ వెనకేసుకు రావడం తప్పు.

పరామర్శకు వెళుతూ దారిలో తన కారు కింద సింగయ్య అనే వృద్ధుడు నలిగిపోతే, అతనిని రోడ్డు పక్కన పడేసి ముందుకు సాగడం ఇంకా పెద్ద తప్పు.

Also Read – 2029: ఏపీ vs వైసీపీ..?

పరామర్శ పర్యటన విజయవంతం అయ్యిందని వైసీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు.

మొదట సింగయ్య మృతితో తమకు సంబందం లేదన్నట్లు మాట్లాడిన వైసీపీ నేతలు, వారి మీడియా ఇప్పుడు అది ఓ ప్రమాదమని ఒప్పుకుంటూనే పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పు పడుతున్నారు.

Also Read – టీటీడీలో అన్య మతస్తుల సేవలు తప్పవా?

అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, “ప్రమాదవశాత్తు జరిగిన ఆ ఘటనపై చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, ఐజీ సర్వ శ్రేష్టి త్రిపాఠి ముగ్గురూ కలిసి వివాదంగా మార్చాలని కుట్ర చేస్తున్నారు. అదో ప్రమాదం మాత్రమే. దానికి జగన్‌ని, వైసీపీ నేతలను బాధ్యులను చేసి రాజకీయకక్ష సాధింపుకి ప్రయత్నిస్తున్నారు.

జగన్‌ పర్యటన విజయవంతం అయ్యిందనే అసూయతోనే ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. చేసేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ ప్రమాదాన్ని ‘బలి’ అని అభివర్ణిస్తూ జగన్‌ వ్యక్తిత్వ హననం కుట్ర చేస్తున్నాయి.

Also Read – పేర్ని విధేయత కిట్టుకి బలిపీఠం కానుందా.?

అసలు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలం అయ్యారు,” అని ఆరోపణలు చేశారు.

జగన్‌ వెంట వస్తున్న వేలాదిమందిలో ఏదో వాహనం గుద్దుకోవడం వలన సింగయ్య మృతి చెందారని మొదట అందరూ భావించారు.

కానీ జగన్‌ కాన్వాయ్‌లోనే కారు కింద నలిగి చనిపోయిన సింగయ్య వీడియో రిలీజ్‌ చేయడంతో నిర్లక్ష్యం కారణంగానే సింగయ్య చనిపోయారని స్పష్టమయ్యింది.

అప్పుడే జగన్‌ స్పందించి వెంటనే ఆయనని హాస్పిటల్‌ తరలించి చికిత్స అందించి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించి ఉండాలి. లేదా అప్పుడే పోలీసులకు ఈ ప్రమాద సమాచారం ఇచ్చి ఉండాలి. కానీ రెండూ చేయలేదు!కారు కింద నలిగి తీవ్రంగా గాయపడిన సింగయ్యని ఈడ్చి రోడ్డు పక్కన పడేయించి ముందుకు సాగిపోయారు!

ఏడాది క్రితం చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరమర్శించడానికి వెళుతున్నప్పుడు, తన కారు కింద ఓ వృద్ధుడు పడి ప్రాణం పోతున్నప్పుడు పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. పరామర్శకు వెళుతూ మరొకరి ప్రాణం బలి తీసుకున్నందుకు జగన్‌కు అసలేమీ అనిపించకపోవడం చూస్తే మానవ్యత్వమనేది ఉందా లేదా?అనిపిస్తుంది.

అయినా పోలీసులు వారిస్తున్నా వినకుండా వేలాదిమందిని పోగేసుకొని ఊరేగింపుగా వెళ్ళి, పరామర్శ యాత్రని బలప్రదర్శన యాత్రగా మార్చినప్పుడే జగన్‌ రాజకీయ దురాలోచనతో ఈ పర్యటన చేశారని అర్దమవుతూనే ఉంది. దానికి వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీ బ్యానర్లు నిదర్శనం.

ఇన్ని తప్పులు, కుట్రలు చేస్తూ మళ్ళీ ప్రభుత్వం, పోలీసులపై ఈవిదంగా ఎదురు దాడి చేస్తుండటం వైసీపీ అరాచక, దుర్మార్గపు వైఖరికి పరాకాష్ట అని చెప్పక తప్పదు. తన కారు కింద ఓ వృద్ధుడు నలిగి చనిపోతే స్పందించని జగన్‌, వైసీపీ నేతలు మానవత్వం గురించి మాట్లాడుతుండటం సిగ్గుచేటు.. కాదా?