ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడెక్కడ శాంతి భద్రతలకు భంగం కలుగుతోందో ఆ ప్రాంతాలలో పర్యటించి ఉండాలి. తద్వారా ఢిల్లీలో ధర్నాకు మరే కారణం లేదని నిరూపించుకున్నట్లు అయ్యేది.
కానీ జగన్ తాడేపల్లి ప్యాలస్-బెంగళూరు ప్యాలస్‌లలో కాలక్షేపం చేస్తున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయన్న మాట!
Also Read – కేసీఆర్ ఊసుపోక యాగాలు చేయలేదు స్మీ!
జగన్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షాలను ఆహ్వానించగా వారు వచ్చి సంఘీభావం తెలిపారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు వారి ద్వారా జగన్ కాంగ్రెస్‌తో రాయబారం నడిపించారని ఊహాగానాలు వినిపించాయి.
జగన్ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే మళ్ళీ హడావుడిగా బెంగళూరుకి వెళ్ళిపోవడంతో, కాంగ్రెస్ అధిష్టానం బహుశః అక్కడ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె శివ కుమార్ ద్వారా జగన్‌కు సందేశం పంపించి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read – తెలీని విషయాలు మాట్లాడి నవ్వులపాలవడం దేనికి?
అయితే జగన్ ఢిల్లీ ధర్నా తర్వాత విజయసాయి రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని రెండుసార్లు కలవడం గమనార్హం. అంటే ఆయన జగన్ తరపున కేంద్రంతో ఏదో రాయబారం చేస్తున్నారన్న మాట!
మరి ఓ పక్క కాంగ్రెస్ మిత్రపక్షాలతో భేటీ, కాంగ్రెస్‌లో చేరుతారంటూ మీడియాకు లీకులు ఇస్తూ, బెంగళూరు పర్యటనలు ఎందుకంటే, ఒకవేళ కేంద్రం తమని ఆదరించకపోతే కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి తాము సిద్దంగా ఉన్నామని, కాంగ్రెస్ కూడా సిద్దంగా ఉందని సంకేతాలు పంపించడానికే కావచ్చు. అంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలని అనుకోవచ్చు.
Also Read – వరద కష్టాలతో ప్రభుత్వానికి కొత్త పాఠాలు… నేర్చుకోవలసిందే!
అయితే అధికారం కోల్పోయిన జగన్ బెదిరింపులకు కేంద్రం భయపడదని అందరికీ తెలిసిందే. కానీ విజయసాయి రెడ్డి అడిగిన వెంటనే అమిత్ షా ఎందుకు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు?అంటే, జగన్ వద్ద ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల కోసమే అని భావించాల్సి ఉంటుంది.
ఎన్డీయే కూటమికి రాజ్యసభలో బలం లేదు కనుక అక్కడ బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. జగన్, కేసీఆర్ ఇద్దరూ ఇది గ్రహించారు. కనుకనే తమ రాజ్యసభ సభ్యులని బీజేపీకి అప్పగించేసి, బదులుగా తమ కేసుల నుంచి ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.
జగన్ బహుశః ‘కాంగ్రెస్ బూచి’ని చూపిస్తూ కేంద్రంతో బేరసారాలు చేసుకుంటుండగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో తాము అలుపెరుగని పోరాటాలు చేస్తున్నామని చూపించుకుంటూ, కేసీఆర్ బీజేపీతో రాజీకి ప్రయత్నిస్తున్నట్లున్నారు.
కనుక ‘ఊరక రారు మహాత్ములు’ అన్నట్లు జగన్ ఢిల్లీ ధర్నా వెనుక పెద్ద కధే ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేది కేవలం డానికి ట్యాగ్ లైన్ మాత్రమే.