Village_Volunteers

వైసీపి ఓటు బ్యాంక్ బలోపేతం చేసుకోవడానికి సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు, వాటి పంపిణీ పేరుతో ప్రజలపై నిఘా పెట్టి వారిని వైసీపికి కట్టిపడేయడానికి వాలంటీర్ల సైన్యాన్ని జగన్‌ సృష్టించుకుని 5 ఏళ్ళు వారి సేవలను విచ్చలవిడిగా వాడుకున్నారు. 2024 ఎన్నికలలో వాలంటీర్లు గేమ్ ఛేంజర్‌ అవుతారని జగన్‌ అనుకున్నారు. కానీ ఈసీ వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఆదేశించడంతో వైసీపి నేతలు వారిచేత బలవంతంగా రాజీనామాలు చేయించి మరీ వారి సేవలు వాడుకున్నారు. ఇంతగా వాడుకుంటున్నప్పుడు వారి సర్వీసులు రెన్యూవల్ చేయాలి కదా? కానీ 2023, ఆగస్ట్ 15 నుంచి వారి సర్వీసులు రెన్యూవల్ చేయకుండానే వారిని జగన్, వైసీపి నేతలు వాడుకున్నారు. అంటే ఎన్నికలలో ఓడిపోతామని జగన్‌ అప్పటికే గ్రహించారా?అనే సందేహం కలుగుతుంది. అయితే వారిని సృష్టించి, నామ మాత్రపు జీతాలతో వైసీపి కోసం విచ్చలవిడిగా వాడుకుంటున్నప్పుడు, కనీసం వారి సర్వీసులను రెన్యూవల్ చేసి ఉంటే జగన్‌కి, వైసీపికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ చేయలేదు. అదే వారిపాలిట ఇప్పుడు శాపంగా మారింది.

Also Read – కిల్ బిల్ పాండ్య’..!

నిన్న సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2023 నుంచి 2024ఆగస్ట్ వరకు వారి సర్వీసులు రెన్యూవల్ చేసే ప్రతిపాదనని మంత్రిమండలి తిరస్కరించింది. మరోవిదంగా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసిన్నట్లే భావించవచ్చు.

అయితే టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి సేవలని ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చినందున వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రభుత్వ శాఖలలో విలీనం చేసేందుకు విధివిధానాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత టిడిపి కూటమి ప్రభుత్వం వాలంటీర్ల సేవలను ఏవిదంగా వినియోగించుకుంటుందనే విషయంపై స్పష్టత వస్తుంది. అంతవరకు వాలంటీర్లు వేరే దారి చూసుకోవలసిందే.

Also Read – ఐఏఎస్, ఐపీఎస్‌లకి ఆంధ్రా వద్దు.. తెలంగాణ ముద్దు!


జగన్‌ సొంత పత్రిక సాక్షి అమ్మకాలు పెంచేందుకు వాలంటీర్లు, సచివాలయాలు సాక్షి పేపర్ కొనుగోలు చేసేందుకు నెలకు రూ.200 చొప్పున ఇచ్చేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కూడా ఉపసంహరించాలని మంత్రిమండలి నిర్ణయించింది. దీని కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.204 కోట్లతో సాక్షి పత్రిక లబ్ధి పొందిందా లేదా? విచారణ జరపాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.