Visakhapatnam Vijayawada Metro Funding Risks

విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ కారిడార్ నిర్మాణానికి అవసరమైన నిధులు (అప్పు) ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్‌తో సహా ఆరు విదేశీ బ్యాంకులు ముందుకు వచ్చాయి. వాటితో మెట్రో కార్పొరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డి నేడు సమావేశమయ్యారు.

Also Read – సంక్షేమ పధకాలకు ఇంత తొందర ఎందుకు?

రాజధాని అమరావతితో సహా రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధిపనులు, ఏర్పాటవుతున్న పరిశ్రమలు, విశాఖ, విజయవాడలో ప్రస్తుత జనాభా, రాబోయే 5-6 ఏళ్ళలో పెరగబోయే జనాభా, మెట్రో కారిడర్స్ ఏర్పాటుకి ఎంచుకున్న మార్గాలు తదితర అంశాలను వివరించారు. తర్వాత అందరూ కలిసి వెళ్ళి విజయవాడలో మెట్రో కారిడార్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్లు కలిపి మొత్తం రూ.12,000 కోట్లు విదేశీ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో రుణం తీసుకోవాలని నిర్ణయించామని మెట్రో కార్పొరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డి తెలిపారు. విదేశీ బ్యాంక్ ప్రతినిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?

గత ఏడాది ఆగస్ట్-నవంబర్‌ మద్య సిద్దం చేసిన డీపీఆర్‌ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ప్రకారం విశాఖ మెట్రోకి రూ. 17,232 కోట్లు, విజయవాడ మెట్రోకి రూ.25,130 కోట్లు కలిపి మొత్తం రూ.42,362 కోట్లు అవసరమని తేల్చారు. ఆ డీపీఆర్‌ని కేంద్రానికి పంపించి 100 శాతం నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదని దీంతో స్పష్టమైంది.

మరో విషయం ఏమిటంటే, ఆ డీపీఆర్ ప్రకారం మొత్తం రూ.42,362 కోట్లు అవసరం కాగా ఇప్పుడు విదేశీ బ్యాంకుల నుంచి రూ.12,000 కోట్లు మాత్రమే తీసుకోబోతునట్లు అర్దమవుతోంది. కనుక మిగిలిన రూ.30,362 కోట్లు ఇస్తానని కేంద్రం హామీ ఇచ్చిందా లేక రాష్ట్ర ప్రభుత్వమే దానిని మరో విదంగా సమకూర్చుకోబోతోందా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read – కేసుల వలయంలో కేసీఆర్ కుటుంబం..!

దాదాపు పదేళ్ళ క్రితం ఎల్ & టి సంస్థ దేశీయ బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని హైదరాబాద్‌ మెట్రో నిర్మించి విజయవంతంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ మెట్రోలో అన్నీ మార్గాలలో కలిపి రోజుకి సుమారు 4.50-5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తుంటారు.

హైదరాబాద్‌ మెట్రో అప్పులు, వడ్డీలు, మెట్రో నిర్వహణ, ఉద్యోగుల జీతాలకు ఏడాదికి రూ.2,000 కోట్లు అవసరం కాగా, ఆదాయం రూ.1,500 కోట్లు మాత్రమే వస్తుండటంతో ఏటా రూ.500 కోట్లు నష్టపోతున్నామని ఎల్&టి సంస్థ చెపుతోంది. కనుక టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.

విశాఖ మెట్రో ఏర్పాటు అయ్యేసరికి దానిలో రోజుకి 15,000 మంది ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేశారు. రోజుకి 5 లక్షల మందితో హైదరాబాద్‌ మెట్రో రైళ్ళు కిటకిటలాడుతున్నా ఏడాదికి రూ.500 కోట్లు నష్టపోతున్నామని ఎల్&టి సంస్థ చెపుతున్నప్పుడు, విశాఖ, విజయవాడ నగరాలలో రోజుకి కనీసం లక్ష మంది కూడా ప్రయాణించకపోతే మెట్రో లాభసాటి అవుతుందా?

భవిష్యత్‌లో జనాభా పెరగడం ఖాయమే కానీ అంతవరకు మెట్రో నిర్వహణ వ్యయం ఎవరు భరిస్తారు?మెట్రో ఆదాయం కంటే నిర్వహణ ఖర్చులు, అప్పులు, వడ్డీలు ఎక్కువైతే అప్పుడు ఏపీ మెట్రో పరిస్థితి ఏమిటి?అనే ప్రశ్నలకు మెట్రో కార్పొరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డి వద్ద సంతృప్తికరమైన సమాధానాలు ఉంటే సంతోషమే.