సోషల్ మీడియాలో అంతా మంచే ఉండదు.. అలాగని అంతా చెడే ఉండదు. అక్కడ వడ్డించిన వాటిలో ఎవరికి నచ్చింది వారు తీసుకుంటారు అంతే!
మొదట చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన తప్పిదాలపై, తర్వాత జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై సోషల్ మీడియాలో నిష్కర్షగానే చర్చలు నడుస్తుంటాయి. కానీ వాటిని ప్రభుత్వ వ్యతిరేకతగా భావించేవారే ఎక్కువ.
Also Read – సైఫ్‌కి టాలీవుడ్ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?
జగన్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సాక్షి మీడియా, వైసీపీ సోషల్ మీడియా, కోటరీనే ఎక్కువగా నమ్ముకున్నారు. వారికి జగన్, జగన్‌కి వారు పరస్పరం కళ్ళకు గంతలు కట్టుకుని ఈవీఎంలని తన్నుకొని బోర్లా పడ్డారు.
కనుక అధికారంలో ఉన్నవారు సొంత డప్పు కొట్టుకుంటూ, వినుకుంటూ కాలక్షేపం చేయకూడదని జగన్ నిరూపించి చూపారు. అలాగే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని చూపారు. ఓ రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవిదంగా పోరాటస్పూర్తితో ముందుకు సాగాలో చంద్రబాబు నాయుడు ఒక టెంప్లెట్ తయారుచేసి ఇవ్వగా, అధికారంలో ఉన్నప్పుడు ఏవిదంగా ప్రవర్తించకూడదో జగన్ ఏకంగా ఓ ఎన్‌సైక్లోపీడియా తయారుచేసి ఇచ్చి వెళ్ళారు.
Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!
కనుక టీడీపీ, వైసీపీ రెండూ కూడా భేషజాలు పక్కన పెట్టగలిగితే ఒక దాని నుంచి మరొకటి చాలా విలువైన గుణాపాఠాలు నేర్చుకోవచ్చు.
ముందే చెప్పుకున్నట్లు సోషల్ మీడియాలో టీడీపీ కూటమి పాలన తీరు తెన్నులపై కూడా చాలా లోతైన చర్చలు నడుస్తూనే ఉన్నాయి. వాటిలో కొందరు వీరాభిమానంతో ఇచ్చే సలహాలు కూడా కనిపిస్తుంటాయి.
Also Read – ఈ విందుని జగన్ జీర్ణించుకోలేరేమో?
కూటమి ప్రభుత్వం ఆర్నెల్ల హనీమూన్ పీరియడ్ ముగుస్తున్నా ఇంతవరకు వైసీపీలో ఒక్క తిమింగలాన్ని కూడా వల వేసి పట్టుకోలేకపోయిందని, ఆ ధైర్యంతోనే జగన్ మళ్ళీ జనం మద్యకు బయలుదేరుతున్నారని కొందరు శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు.
కనుక 2014-2019లో చూసిన సినిమాయే మళ్ళీ 2024 లో రీ-రిలీజ్ అయితే చూస్తున్నట్లు ఉందని, కనుక మళ్ళీ అటువంటి క్లైమాక్స్ రాకుండా జాగ్రత్తపడమని శ్రేయోభిలాషులు హితవు చెపుతున్నారు. మరి వారి సూచనలని కూటమి ప్రభుత్వం ఏవిదంగా స్వీకరిస్తుందో?