రాజకీయాలలో గెలుపోటములు సర్వ సాధారణమైన విషయం. అయితే గెలిస్తే ప్రజల కోసం వ్యవస్థలతో పని చేయించగలగాలి, ఓడితే ప్రజల కోసం ప్రభుత్వం తో పోరాడాలి. కానీ నేటి రాజకీయ పార్టీలు కేవలం గెలుపు మాత్రమే ఆస్వాదిస్తున్నాయి కానీ ఓటమిని స్వీకరించలేకపోతున్నాయి.
151 సీట్లతో గత ఐదేళ్లు అందలమెక్కిన వైసీపీ పార్టీ, వై నాట్ 175 అంటూ రాష్ట్రంలో విపక్షమనేదే ఉండకూడదని, అసెంబ్లీ లో ప్రతిపక్షం గొంతు వినిపించకూడదని ఎన్నో నినాదాలు చేసారు మరెన్నో వ్యూహాలు పన్నారు.
Also Read – బియ్యం అక్రమ రవాణా: ప్రభుత్వ వైఫల్యమా.. వైసీపీ సమర్దతా?
అయితే గత ఐదేళ్లు అధికారం ఉందనే అహంతో వయస్సుకి విలువనివ్వకుండా, అనుభవానికి గౌరవం దక్కకుండా రాజకీయాలలో సభ్యత మరిచి, చట్ట సభలలో మహిళల మీద అసభ్యకర పదజాలంతో విరుచుకుపడి గౌరవ సభను కౌరవ సభగా మార్చిన పాపం వైసీపీ ని 11 గా వెంటాడుతుందా అన్నట్టుగా సందర్భాలు సాక్ష్యాత్కారమవుతున్నాయి.
2024 లో వైసీపీ కి వచ్చిన స్థానాలు 11 ….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా నేడు తొలిసారిగా శాసన సభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నది. అయితే ఇక్కడ కూడా వైసీపీ ని 11 వెంటాడుతుంది అనే చెప్పాలి. 11 వ నెల 11 వ తేదీ ఉదయం 11 గంటలకు రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వ తొలి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
Also Read – ఎప్పుడు దొరికిపోయినా ఎదురుదాడే వైసీపీ ఫార్ములా?
దీనితో 11 మళ్ళీ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. గత ఐదేళ్లు టీడీపీ ఓటమిని ఆ పార్టీకి వచ్చిన సీట్లను దేవుని స్క్రిప్ట్ గా అభివర్ణించి పైశాచిక ఆనందం పొందిన జగన్ అండ్ కో ఇప్పుడు ఈ 11 ని ఎవరి స్క్రిప్ట్ గా సమర్ధించుకుంటారో చెప్పగలరా.? కూటమి ప్రభుత్వం తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదని, అలాగే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని కుంటి సాకులు చెప్పుకుంటూ అసెంబ్లీకి డుమ్మా కొట్టి జగన్ గతాన్ని మరిచినట్టున్నారు.
2014 ఎన్నికలలో వైసీపీ పార్టీకి 64 సీట్లు కట్టపెట్టి ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు తీర్పునిస్తే జగన్ అప్పుడు కూడా ఆ ప్రజా తీర్పుని గౌరవించకుండా అసెంబ్లీకి సెలవు చెప్పి పాదయాత్రకు బయలుదేరారు. అప్పుడు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష పార్టీ గా గుర్తింపు ఉంది, జగన్ కు ప్రతిపక్ష నేత గా హోదా ఉంది అయినా జగన్ మాత్రం విపక్ష నేతగా అసెంబ్లీ కి వెళ్లి ప్రజా గళం వినిపించలేదు.
Also Read – తప్పులు ప్రభుత్వాలు చేస్తే మూల్యం ప్రజలు చెల్లించాలా?
అప్పుడు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తే సద్వినియోగ పరుచుకోలేదు, 2019 లో అధికార పక్షంగా అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం తనకు హోదా లేదు, తన పార్టీకి గుర్తింపు రాదని అందుకే అసెంబ్లీ వెళ్ళను అంటూ అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ఓటమిని అంగీకరించలేని నేతగా చరిత్రలో మిగిలిపోతున్నారు.
రాజకీయం అంటే అధికారమే, నాయకుడంటే పదవులే, ప్రజల గురించి ఆలోచించాలి అంటే అధికార పక్షమే అన్నట్టుగా జగన్ ఆలోచన శైలి కనిపిస్తుంది. అధికారంలో ఉంటేనే చట్ట సభలు వెళ్తాను, ప్రతిపక్షంలో ఉంటేనే ప్యాలస్ గేటు దాటతాను అంటూ మారం చేయడానికి జగన్ 11 ఏళ్ళ బాలుడు కాదు 11 సీట్లు గెలుచుకున్న ఒక పార్టీ అధినేత.