YS Jagan Swearing Vizag

సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదే రోజున జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కనుక చాలా గర్వంగా, సంతోషంగా చెప్పుకోవలసిన ఈ విషయాన్ని వైసీపి నేతలు ఓటమి భయాన్ని, ఆందోళనని మొహంలో కనపడకుండా దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ‘ఇదో చారిత్రికమైన రోజని’ చాలా గంభీరంగా చెప్పుకోవడం చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది.

ఐదేళ్ళ సుపరిపాలన, రామరాజ్యం, సంక్షేమ రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో తృప్తిగా జీవించారని, కనుక మరో 5 ఏళ్ళు జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ వైసీపిని భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొని ప్రజలకు ముందుగానే కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసు: కేటీఆర్‌ అనుకుంటే హరీష్ రావుతో బోణీ?

అయితే ఈ 5 ఏళ్ళలో జరిగిన అరాచక పాలన, అన్ని రంగాలలో విధ్వంసం, వైసీపి నేతల భూకబ్జాలు, ఇసుక, మట్టి దోపిడీలు, మాఫీయాలను కళ్ళారా చూసిన ప్రజలు భయం భయంగానే జీవించారు. కనుక వైసీపికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని వైసీపి నేతలు కూడా గ్రహించారు. ఈ విషయాన్ని వారే తమ మాటల ద్వారా బయటపెట్టుకుంటున్నారు కూడా.

రాష్ట్ర విభజన వలన జరిగిన నష్టం కంటే ఈ 5 ఏళ్ళ జగన్‌ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువ అని చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతుంటారు.

Also Read – కేసీఆర్‌, కేటీఆర్‌ మద్యలో కవిత… ఏమిటో ఈ రాజకీయాలు?

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడంతో సహా టిడిపి ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించాలనే మూర్ఖపు ఆలోచనలనే ప్రభుత్వం విధానంగా మార్చేసుకోవడం వలన ఈ 5 ఏళ్ళలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు కొన్ని మూతపడ్డాయి. కొన్ని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఏపీకి రావాలనుకున్నవి రాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.

అయినా వైసీపిలో ఎవరికీ తప్పుగా, అవమానంగా కనీసం చీమ కుట్టిన్నట్లు కూడా అనిపించలేదు. పైగా రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు అవసరం లేదు… సంక్షేమ పధకాలు చాలు… అన్నట్లు మాట్లాడుతున్నారు.

Also Read – షిప్ సీజ్ అయ్యింది…ఇక అసలు కథ మొదలయ్యింది…!

ప్రజలు తమని, తమ అసమర్ధ ప్రభుత్వాన్ని, తమ అరాచకాలను చూసి అసహ్యించుకుంటున్నారనే విషయం గడప గడపకి కార్యక్రమంలో వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కనుకనే ఆ కార్యక్రమాలకు వెళ్ళకుండా తప్పించుకునేవారు. అప్పుడు జగన్‌ వారికి టికెట్స్ ఇవ్వనంటూ బెదిరించడం అందరికీ తెలుసు.




తమ గురించి ఆంధ్రా ప్రజలు ఏమనుకుంటున్నారో జగన్‌తో సహా వైసీపిలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినా తెలియన్నట్లు నటిస్తూ, ప్రజలు మళ్ళీ జగన్మోహన్‌ రెడ్డినే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని నిసిగ్గుగా చెప్పుకోవడం వైసీపి నేతలకు మాత్రమే సాధ్యం కదా?