వైసీపీ అధినేత జగన్ నిన్న తాడేపల్లి ప్యాలస్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఎప్పటిలాగే తన నీతి నిజాయితీ, తన పాలన గొప్పదనం, సంక్షేమ పధకాల గురించి డబ్బా కొట్టుకున్నారు.
Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!
ఆరు నెలలుగా ప్యాలస్‌లో నుంచి బయట అడుగు పెట్టని జగన్, సంక్షేమ పధకాల గురించి ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని కనిపెట్టి చెప్పారు. చంద్రబాబు నాయుడు హామీలు అమలుచేయలేక, పాలన చేతకాక నెలకో సమస్యని తెరపైకి తెస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
నిజానికి ఈ సమావేశం ప్రధానోదేశ్యం పార్టీ భవిష్య కార్యాచరణ, నేతలకు దిశా నిర్దేశం చేయడం. అందుకే వైసీపీ నేతలు అన్ని పనులు మానుకొని జగన్ సమావేశానికి వస్తుంటారు. కానీ జగన్ వాటి గురించి మాట్లాడకుండా సొంత డబ్బా కొట్టుకుంటూ తన సమయాన్ని, నేతల సమయాన్ని కూడా వృధా చేస్తుంటారు.
Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?
“ఏదో ఒకసారి డబ్బా చప్పుడు వినిబడితే ఎవరైనా భరించగలరు. కానీ ప్రతీ సమావేశంలో ఇదే డబ్బా చప్పుళ్ళా? జగన్ చెప్పే ఈ విషయాలన్నీ మాకు తెలియకనే సమావేశానికి వచ్చామా?” అని వైసీపీ నేతలే విసుక్కుంటున్నారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘బాదుడే బాదుడు’, ‘యువగళం’ వంటి అనేక కార్యక్రమాలతో పార్టీ కార్యాచరణ ఏవిదంగా ఉండాలో తెలియజెప్పింది. జనసేన, బీజేపిలతో పొత్తులు, సమైక్య కార్యాచరణ ఏవిదంగా సాగి ఎన్నికలలో విజయం సాధించారో అందరూ చూశారు.
Also Read – డాకూ మహరాజ్: గుర్రం దిగక్కరలేదు!
నాడు వైసీపీ వేధింపులతో సతమతమవుతున్న పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు చేసింది ‘దిశానిర్దేశం.’ వైసీపీ కేసులు, వేధింపులకు మరొకరైతే భయపడి పారిపోయేవారు. మరో పార్టీ అయితే చెల్లాచెదురు అయిపోయేదే. కానీ చంద్రబాబు నాయుడు చేసిన దిశానిర్దేశం, ఆయన కల్పించిన నమ్మకంతో అందరూ కలిసికట్టుగా పోరాడారు. అంతేకాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకుంది కూడా.
మనం 175 సీట్లు గెలుచుకొని మరో 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్ ఆత్మవంచన చేసుకుంటూ, పార్టీలో అందరి కళ్ళకు గంతలు కడుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పార్టీని ముందుకు నడిపిస్తూ, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ 175/30 ని గద్దె దించారు కదా?
చంద్రబాబు నాయుడుని, టీడీపీని చూసి పోరాడటం నేర్చుకోమని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌కి చెప్పారంటే ఓ రాజకీయ పార్టీ, దాని అధినేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవిదంగా ముందుకు సాగాలో అర్దమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడుని చూసే నేర్చుకునేందుకు జగన్‌కు అహం అడ్డొస్తోంది. అదే వైసీపీకి శాపం, కూటమి ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా నిలువబోతోంది.