
వైసీపీ హయాంలో సొంత పార్టీ నేతల మీద వచ్చినన్ని అవినీతి అభియోగాలు, వేధింపుల ఆరోపణలు, అస్లీల అరాచకాలు, హత్యా నేరాలు అన్ని ఇన్ని కావు. అయినా కూడా ఆ పార్టీ అధినేత గా జగన్ వారి పై ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు.
పైగా వైసీపీ ప్రభుత్వంలో అటువంటి వారిలో ఒకరైన అంబటి గంట, అరగంట అంటూ ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ మంత్రిగా ప్రమోషన్ కూడా దక్కింది. ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పై హత్య ఆరోపణలు ఎదురయ్యాయి. ఇక గోరంట్ల మాధవ్ భాగోతం దేశం మొత్తం చూసింది. అయినా వైసీపీ కి చీమకుట్టినట్టు కూడా లేకపోగా అటువంటి వారిని వెనకేసుకొచ్చి నవ్వులపాలయ్యింది.
Also Read – సనాతన మార్గంలో పవన్ ప్రయాణం తమిళనాడుకే
ఇక వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ నేతల అసలు రంగు మీడియాలో ప్రత్యక్షమయింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను, మాధురిల వ్యవహారం కానీ, విజయసాయి, శాంతిల రచ్చ కానీ కొన్ని రోజుల పాటు మీడియా స్పెస్ ను పూర్తిగా తమ వైపు తిప్పుకున్నాయి. అలాగే సోషల్ మీడియాలోను వైరల్ అయ్యాయి. అయినా కూడా వైసీపీ పార్టీ తరుపున కానీ ఆ పార్టీ అధినేతగా జగన్ కానీ ఇటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
కానీ ఇప్పుడు మాత్రం వారి ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేన నాయకుల మీద మాత్రం ఇటువంటి ఆరోపణలు ఏమైనా వస్తే మాత్రం ఆయా పార్టీలను, పార్టీల అధినేతలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం పెట్టేస్తున్నారు. తాజాగా తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మీద వస్తున్న ఆరోపణలు వీడియోలతో సహా మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఇక తమ నోటికి, చేతికి కూడా పని చెపుతున్నారు వైసీపీ శ్రేణులు.
Also Read – వైసీపీ ఇప్పుడే ధర్నాలు చేసుకుంటే మంచిదేమో?
మహిళల భద్రతే నా తొలి ప్రాధాన్యం అంటూ ప్రచారం చేసుకునే పవన్ ఇప్పుడు తన సొంత పార్టీ నేతలే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వారిని మోసం చేసి డబ్బులు కాజేసి, బెదిరిస్తున్న వైనాలు మీద స్పందించరా.? అంటూ కాస్త తొందరపడి పోస్టులు పెట్టేసింది. అయితే ఇటువంటి విషయాలలో నిక్కచ్చిగా ఉండే పవన్, కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించారు.
అలాగే తన పై వచ్చిన ఆరోపణల పై, మీడియాలో ప్రత్యక్షమైన వీడియోల పై సమగ్ర విచారణ జరిగిన తరువాత ఎదురయ్యే పరిణామాల వరకు పార్టీ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ పార్టీ తరపున కిరణ్ కు లేఖ విడుదల చేసింది జనసేన. అలాగే గతంలో కూడా ఆ పార్టీ మద్దతుదారుడిగా, పవన్ కు సన్నిహితుడిగా మెలిగిన డాన్స్ మాస్టర్ జానీ విషయంలో కూడా ఇటువంటి ఆరోపణలే రావడంతో అతనికి కూడా ఇదే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చింది జనసేన.
Also Read – ఒకరిది భాషోద్వేగం..మరొకరిది ప్రాంతీయవాదం..మరి ఏపీ.?
ఇక టీడీపీ అయితే బాధిత మహిళా ఆరోపణతో ఆ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను ఏకంగా పార్టీ నుండే సస్పెండ్ చేసి పార్టీ విధి విధానాలను సమాజానికి చాటిచెప్పింది. ఇలా ఈ రెండు పార్టీలు కూడా తమ నాయకుల తప్పిదాల మీద చర్యలు తీసుకుంటూ తమ పార్టీల రాజకీయ విలువలను, నాయకుల నిబద్ధతను పెంచుకుంటున్నాయి.
కానీ వైసీపీ మాత్రం తమ పార్టీలో నేతల మీద ఆరోపణలు వస్తే అసత్య ప్రచారాలని, మార్ఫింగ్ వీడియోలని, ప్రత్యర్థి పార్టీల రాజకీయ కుట్ర అని తప్పుని తప్పిపుచ్చుకుంటూ, అదే ఇతర పార్టీల నేతల మీద విమర్శలు చేయాల్సి వస్తే సుద్ద పూస కబుర్లు చెపుతూ పత్తిత్తు వేషాలు వేస్తూ సుమతి శతకాలు వల్లెవేస్తున్నారు. అసలు వైసీపీ కి ఆ అర్హత ఉందా.? అన్న కనీస ఆలోచన కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు.
అయితే వైసీపీకి ఆ అర్హత లేకపోయినా తమ నేతల తప్పుల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జనసేన తీసుకుంది. అలాగే తమ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీ అధినేతగా పవన్ పై ఉంటుంది. అయితే గత ఐదేళ్లుగా వైసీపీ నగరి మాజీ ఎమ్మెల్యే రోజాను తన మాటలతో చిత్రహింసలు పెట్టిన కిరణ్ ఇలా మహిళతో అడ్డంగా దొరకడం రోజాకు అవకాశం ఇచ్చినట్లయింది.