perni-nani-kesineni-nani-kodali-nani

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవులతో ఒక వెలుగు వెలిగిన నానీలంతా కూడా ఇప్పుడు ఓటమి అనే చీకటిలో, భయం గుప్పెట్లో బతుకు సాగిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి ‘నాని’, రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని ‘నాని’, ఇక ఆళ్ల ‘నాని’ ఏపీ ఉపముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవులు అనుభవించారు, అలాగే ప్రజల మీద, ప్రతిపక్షాల మీద పెత్తనం చేసారు.

Also Read – పేరు మార్పులతో ఒరిగేది ఏమిటి?

అయితే గత ఐదేళ్లు వచ్చిన మంత్రి పదవి అవకాశాన్ని ప్రజల కోసం కాకుండా పార్టీ కోసం వెచ్చించి చివరికి పార్టీ ఓటమితో పాటుగా తమ ఓటమిని కూడా చవిచూశారు ఈ నానీలు. గత ఐదేళ్లు బాబుని దూషించడానికి, లోకేష్ ను విమర్శించడానికి, పవన్ తిట్టడానికే అన్నట్టుగా సాగిన వీరి రాజకీయ ప్రయాణం ఇప్పుడు అనూహ్య మలుపులు తీసుకుంటూ పయనిస్తుంది.

ముందుగా ఆళ్ల నాని విషయానికి వస్తే మిగతా నానీలతో పోలిస్తే గత ఐదేళ్లు ఈ నాని చేసిన హడావుడి కాస్త తక్కువనే చెప్పాలి. దాని ఫలితమే ఈయన గారికి టీడీపీ పార్టీలోకి ఎంట్రీ సులభమయ్యింది. ఆళ్ళ ఎంట్రీకి పార్టీ క్యాడర్ నుంచి తిరస్కరణ ఎదురైనప్పటికి పార్టీ అధిష్టానం మాత్రం ఆళ్ల కు వెల్కమ్ బోర్డు చూపింది. దీనితో వైసీపీ నుండి ఒక నాని జగన్ ప్రత్యర్థి పార్టీలోకి చేరుకున్నారు.

Also Read – పోసాని కి దక్కని జగన్ ఓదార్పు…వై.?

ఇక కొడాలి నాని విషయానికి వస్తే గత ఐదేళ్లు ఈయన గారు మీడియాలో చేసిన రచ్చ చూసిన ప్రతి ఒక్కరు నాని ఓటమిని కాంక్షించారు, అలాగే ఆయన చేసిన పాపాలకు తగ్గ శిక్ష పడాలని ప్రార్ధించారు. ఇక ఇప్పుడు పార్టీ ఓటమితో పాటుగా తనకు కంచుకోటగా భావించే గుడివాడలో కూడా కొడాలికి తిరస్కరణే ఎదురవడంతో కొడాలి నోటికి తాళం పడింది.

దీనితో ఇన్నాళ్లు తొడలు కొట్టి మీసాలు మెలేసిన ఈ మొనగాడు ఇప్పుడు ఓటమి భయంతో బయట తిరగలేని పరిస్థితిలో అజ్ఞాత జీవితం అనుభవిస్తున్నారు. తన ప్రాణ స్నేహితుడుగా తన పాపాలలో వాటా ఉన్న వల్లభనేని వంశీ అరెస్టు తో ఇక ఈ అరెస్టుల పర్వం తనదాకా వస్తుందనే భయం గుప్పెట్లో కొడాలి నాని కాలం వెల్లదీస్తున్నారు.

Also Read – 17 ఏళ్ళ పోరు…ప్రతీకారం తీర్చుకుంటారా.?

ఇక జగన్ పై తనకున్న విధేయతను ప్రదర్శించడానికి తనకులాన్నైనా తగ్గించగలిగే పేర్ని నాని పవన్ ను తిట్టడానికి, కాపు సామాజికవర్గాన్ని రెచ్చకొట్టడానికే రాజకీయం చేసారు, పదవులు అనుభవించారు. అయితే జగన్ ను మెప్పించడానికి ఎంతకైనా దిగజారగలిగిన ఈ నాని ఇప్పుడు తన భార్యను ఇరకాటంలో పెట్టి తన పై వచ్చిన అవినీతి మరకలను తుడవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా ఈ ముగ్గురు వైసీపీ నానీలు ప్రస్తుతానికి వైసీపీ కి భారంగా జగన్ కు గండంగా మారారు. ఇందులో ఆళ్ల నాని వైసీపీ గుడ్ బై చెప్పి జగన్ కు హ్యాండ్ ఇస్తే, ఇక పేర్ని, కొడాలి నానీలు తమ అవినీతి, అక్రమాలతో ప్రభుత్వానికి అడ్డంగా దొరికి జగన్ కు కనిపించకుండా, వైసీపీ పేరు వినిపించకుండా అరెస్టు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

ఇక వైసీపీలో ఉన్న నానీలు సరిపోరు అనేలా ఎన్నికల చివరి అంకంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి తన రాజకీయ జీవితాన్ని తానే సమాధి చేసుకున్న మరో నాని కేశినేని ‘నాని’. ఈయన గారు తన పదేళ్ల ఎంపీ పదవిని జగన్ ఫ్యాన్ కింద పెట్టడంతో ఈసారి విజయవాడ ప్రజలు ఈ నానిని కేశినేని బస్సెక్కించి ఇంటికి పంపించారు.




చివరికి తన సొంత తమ్ముడు చేతిలో ఘోర ఓటమిని మూటకట్టుకుని ఏకంగా రాజకీయాల నుండే నిష్క్రమించారు కేశినేని నాని. ఇలా జగన్ ను నమ్మిన ఈ నలుగురు నానీలలో ఏ ఒక్క నాని కూడా ప్రస్తుతానికి వైసీపీ గళం వినిపించే పరిస్థితులలో లేకపోవడం ఇక్కడ కొస మెరుపు. ఒకరు పార్టీ నుంచి తప్పుకుంటే మరొకరు రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఇక మరొకరు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బైళ్ల కోసం పోరాటాలు చేస్తుంటే ఇక తన ఐదేళ్ల పాపాల నుండి ఎలా తప్పించుకోవాలి అని తెలియక ఆరాటపడుతున్నారు మరొకరు.