YSRCP-Social-Media

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఖండిస్తూ ఆ పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ఇది భావ ప్రకటన స్వేచ్చకు ఆటంకం, వారి హక్కులను కూటమి ప్రభుత్వం సంకెళ్లతో బంధిస్తుంది, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వారికి అండగా వైసీపీ పార్టీ నిలబడుతుంది, వచ్చేది మేమే, అప్పుడు మీ అంతు చూస్తాం అంటూ ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థను బెదిరించే ప్రయత్నం చేసారు.

Also Read – వర్మ సినిమాలకు జగన్‌ పెట్టుబడి: క్విడ్ ప్రోయే కదా?

అయితే అసలు భావ ప్రకటన హక్కు అంటే ఏంటి.? దాని స్వేచ్ఛను హరించింది ఎవరు అన్నది ఒక్కసారి చర్చించుకుంటే.., భావప్రకటన హక్కు అంటే ప్రభుత్వం పని తీరును విశ్లేషణాత్మకంగా విమర్శించడం, ఆయా పార్టీల నేతల మీద రాజకీయ విమర్శలు చెయ్యడం, ప్రజల తరుపున బలంగా తమ గొంతు వినిపించడం…అయితే రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును జగన్ తనకు అనువుగా మార్చుకున్నారు.

భావ ప్రకటన హక్కు అంటే తమ రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, వారి కుటుంబంలోని మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా వారి పై అస్లీల పోస్టులు పెట్టడం, తమను, తమ పార్టీ నిర్ణయాలను తప్పుపట్టిన వారిని మీడియాకెక్కి బూతులు తిట్టడం, వారి కుటుబంలోని మహిళను రేపులు చేస్తామంటూ బెదిరించడం ఇలా హక్కును అరాచకంగా మార్చేశారు.

Also Read – జగన్‌ దెబ్బకి రేషన్ బియ్యం నిలిచిపోయేలా ఉందే!

ఇక భావ ప్రకటన స్వేచ్ఛ విషయానికి వస్తే.., గత వైసీపీ హయాంలో సామాన్యుడి నుండి సెలబ్రెటీ వరకు ఎవ్వరికి ఏపీలో ఈ భావప్రకటన స్వేచ్ఛ లేదనేది జగమెరిగిన సత్యమే. ఉదాహరణకు కరోనా సమయంలో రోగులకు వైద్యం చేయడానికి మాస్కులు లేవని అడిగిన పాపానికి ఒక డాక్టర్ ను పిచ్చి వాడిగా చిత్రీకరించి ఒక తల్లి కడుపు కోతకు కారణమయ్యింది ఎవరు.? వారి స్వేచ్ఛను హరించింది ఎవరు.?

ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు అప్పగించిన అమరావతి రైతులు మా త్యాగానికి న్యాయం చేయండి అని అడిగినందుకు, వైసీపీ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతుంది అంటూ గొంతెత్తినందుకు వారి పై లాఠీ దెబ్బలకు ఆదేశించిందెవరు.? వారి స్వేచ్చకు రక్తపు మరకలు అంటించిందెవరు.? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేస్తుంటే వారిని నిర్బంధించిన సంకెళ్లకు స్వేచ్ఛనిచ్చిందెవరు.?

Also Read – బీసీల పరిస్థితి మారలేదు కానీ.. కృష్ణయ్యది మారిందిగా!

రాజకీయాలకు సంబంధం లేని సినీ తారలు తనకు నచ్చిన నాయకుడి గురించి, తానూ అభిమానించే తన స్నేహితుడి గురించి స్వేచ్ఛగా బహిరంగ వేదిక మీద తన భావాన్ని ప్రకటించిన నేరానికి రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ కు సైతం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపుతూనే ఉంది. ఇక టాలీవుడ్ పెద్దన్నగా చెప్పుకునే చిరు సైతం తన తమ్ముడి రాజకీయ భవిష్యత్ కు ఆశీస్సులు ఇవ్వకూడదు అనేలా వైసీపీ చేసిన వ్యాఖ్యలు భావప్రకటన స్వేచ్చకు సంకెళ్లు కావా.?

తన రాజకీయ జీవితాన్ని తానూ నిర్దారించుకునే హక్కు లేదంటూ, తన అభిప్రాయాన్ని తానూ పంచుకునే స్వేచ్ఛ లేదంటూ సొంత చెల్లి షర్మిల మీద జగన్ చేసిందేమిటి.? ఆమె హక్కులను అణిచివేయడానికి, ఆమె స్వేచ్ఛను హరించడానికి తన సోషల్ మీడియాలో వైస్ జగన్ చేసిన వికృత క్రీడ స్వేచ్ఛ సమానత్వాన్ని కల్పించినట్టా.? తనకు తన ఇద్దరు బిడ్డలు సమానమే అని చెప్పే హక్కు లేదని, తండ్రి ఆస్తిలో కూతురికి వాటా ఉందని తెలిపే స్వేచ్ఛ తల్లికి లేదని జగన్ తన తల్లి విజయలక్ష్మి రాసిన లేఖ ఆమె హక్కును ప్రశ్నించలేదా.? ఆమె స్వేచ్ఛను కట్టడి చెయ్యలేదా.?

అసలు భావప్రకటన హక్కు, భావప్రకటన స్వేచ్ఛ రెండిటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొన్ని వేల కిలోమీటర్లు తరిమేసిన వైస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మీడియా ముందుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయాలని చూస్తే అది వారి గత చరిత్రను తవ్వి తీస్తుందనేది గ్రహించాలి. హక్కు అనేది తన రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ‘చట్టం’, అంతే కానీ ఎదుటి వారి మనోభావాలు దెబ్బ తీసే ‘అస్త్రం’ కాదు. అలాగే స్వేచ్ఛ అనేది ఒకరి మనోభావాలు వ్యక్తీకరించే హక్కు అంతేకాని వారి మానప్రాణాలను ఊబిలో నెట్టే ‘ఆయుధం’ కాదు కాకూడదు.




ఇప్పటికైనా ఈ విష సంస్కృతికి వైస్ జగన్ మోహన్ రెడ్డి స్వస్తి పలికి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజల హక్కులను కాపాడే రాజకీయం చేయాలనీ, మహిళల ఆత్మ గౌరవం దెబ్బ తీయని భాష ఉపయోగించాలని ఆశిద్దాం.