
కేవలం పుస్తకాల్లో చదవటమే తప్ప శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలియని జనాలకు మాయాబజార్(1956)లో ఎన్టీఆర్ ని చూశాక నీలమేఘశ్యాముడిగా ఇంకెవరిని చూసేందుకు ఇష్టపడనంత గొప్పగా దాన్ని పండించారు. మూడేళ్ళకే భూ కైలాస్ లో రావణుడిగా చూపించిన అసామాన్యమైన నటన పండిత్ పామరులను అచ్చెరువొందేలా చేసింది. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర మహత్యం, సీతారామకళ్యాణం, జగదేకవీరుని కథ, మహామంత్రి తిమ్మరుసు, పరమానందయ్య శిష్యుల కథ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళ గాథలు, చందమామ కథలు ఇలా అన్నిటికీ సరితూగే కథానాయకుడు ఎన్టీఆర్ ఒక్కరే అయ్యారు
సాంఘిక చిత్రాల్లోనూ ఎన్టీఆర్ ముద్ర ప్రత్యేకం. కలిసి ఉంటే కలదు సుఖంలో వికలాంగుడిగా, ఆత్మ బంధువులో అన్నెం పున్నెం ఎరుగని అమాయకుడిగా, మిస్సమ్మలో నిరుద్యోగిగా, రక్తసంబంధంలో చెల్లి కోసం ప్రాణమిచ్చే అన్నయ్యగా, గుడి గంటలులో విధి వంచనకు గురైన కోటీశ్వరుడిగా, వరకట్నంలో సామజిక సమస్య మీద పోరాడే కార్యకర్తగా లెక్కలేనన్ని పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి తెలుగు ప్రేక్షక హృదయాల్లో తిరుగు లేని స్థానం సంపాదించుకున్నారు. తిరుపతి దర్శనం కోసం వెళ్లిన వాళ్ళు అటునుంచి ఆటే మదరాసు(ఇప్పటి చెన్నై)వెళ్లి అన్నగారి దర్శనం చేసుకుని రావడం గురించి ఫోటోలతో సహా పత్రికల్లో కథనాలు వచ్చాయి. వచ్చిన అభిమానులను ఆప్యాయంగా పలకరించి భోజన సదుపాయాలు కలిగించి పంపే సంస్కారం గురించి ఫ్యాన్స్ చెప్పే ముచ్చట్లు ఎన్నెన్నో
కమర్షియల్ సినిమా ఆధిపత్యం పెరిగి యువ హీరోలు దూసుకొస్తున్న సమయంలో ఎన్టీఆర్ ప్రభ తగ్గిపోతోందని ప్రచారం జరుగుతున్నప్పుడు 1977 అడవి రాముడుతో కోట్ల రూపాయల కనక వర్షాన్ని బాక్సాఫీస్ కు రుచి చూపించిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కే చెల్లింది. అదే ఏడాది మూడు పాత్రలను పోషిస్తూ దర్శకత్వం నిర్మాణం వహిస్తూ భారీ ఖర్చుతో, పెద్ద క్యాస్టింగ్ తో కేవలం నలభై అయిదు రోజుల్లో దానవీరశూరకర్ణ చేయడం ఒక చరిత్ర. నాలుగు గంటల సినిమాను రెండు ఇంటర్వెల్స్ తో ప్రదర్శిస్తే జనం విసుగు లేకుండా బళ్ళు కట్టుకుని మరీ థియేటర్లలో వచ్చి సుయోధనుడిగా ఎన్టీఆర్ విశ్వరూపాన్ని తెరమీద చూసి మురిసిపోయేవారు
దర్శకుడిగా ఎన్టీఆర్ భారతీయ సినీ దిగ్గజాలుగా చెప్పుకునే ఎవరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలు అందుకున్నారు. తొలిఅడుగు సీతారామకళ్యాణం ఒక ఆణిముత్యం. గులేబకావలి కథ, శ్రీ కృష్ణ పాండవీయం గొప్ప క్లాసిక్స్. తాతమ్మ కల, తల్లా పెళ్ళామా సామజిక రుగ్మతలను ప్రశ్నించాయి. దానవీరశూరకర్ణ. చాణక్య చంద్రగుప్త, అక్బర్ సలీం అనార్కలి, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీమద్విరాటపర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం మొదలైనవి ఫలితంతో సంబంధం లేకుండా మైమరపింపజేసిన చిత్రాలు. రామకృష్ణ స్టూడియోస్ నిర్వహణతో పాటు తమ్ముడు త్రివిక్రమరావుతో కలిసి దాన్ని విజయవంతంగా నడిపించడం ఎన్నో మైలురాళ్లను అందించింది
హీరోగా వేటగాడు, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి ఇలా జైత్రయాత్ర కొనసాగుతూనే వచ్చింది. 1982లో తనను ఇంతవాడిని చేసిన ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ కేవలం 9 నెలల్లో అధికారంలోకి రావడం దశాబ్దాల నాటి కాంగ్రెస్ లాంటి అగ్రపార్టీలకు వణుకు పుట్టించింది. రెండు రూపాయల బియ్యం, మహిళా యూనివర్సిటీ, ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, మధ్యపాన నిషేధం లాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి టిడిపిని తిరుగులేని రాజకీయ పార్టీగా మలచిన ఘనత ఎన్టీఆర్ కే చెందుతుంది. అందుకే ఎనిమిదేళ్ల పాటు సినిమాల గురించి ఆలోచించకుండా పూర్తిగా ప్రజాసేవకే అంకితమయ్యారు. రాజకీయంగా ఎదురైన కుదుపులు విషమ పరిస్థితులను ఎదురుకునేలా చేసినప్పటికీ దేనికీ నెరవకుండా తట్టుకుని నిలబడ్డారు
ఇంత చేస్తున్నప్పటికీ ఎన్టీఆర్ లోని నటుడి ఆకలి తీరలేదు. 1990లో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వచ్చిన సమయంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక, శ్రీనాధ కవిసార్వభౌమలతో టాలీవుడ్ లో అడుగంటి పోతున్న చారిత్రక సినిమాలకు ఊపిరి పొసే ప్రయత్నాలు చేశారు. కానీ అవి అంచనాలు అందుకోలేక విఫలమయ్యాయి. కానీ అంత వయసులోనూ మోహన్ బాబు కోరిక మేరకు 1994లో చేసిన చివరి కమర్షియల్ చిత్రం మేజర్ చంద్రకాంత్ ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్ బస్టర్ గా నిలవడం అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. చివరి శ్వాస వరకు నటన తెలుగుజనం రెండుకళ్ళుగా బ్రతికిన ఎన్టీఆర్ శతజయంతి కాదు సహస్రజయంతులు జరిగినా చెరిగిపోని విజయ సంతకం.
After Dragon, NTR is expected to join hands with Trivikram Srinivas for GOW. However, a…
Vidya Balan has revealed that missing the chance to play legendary Carnatic singer M.S. Subbulakshmi…