
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్‌కు దిల్లీ హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ‘పొన్నియిన్ సెల్వన్-2’ చిత్రంలోని ‘వీర రాజ వీర’ పాటకు సంబంధించిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో కోర్టు తీవ్ర ఆదేశాలు జారీ చేసింది. రెహమాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్‌పై రూ. 2 కోట్లు కోర్టులో జమ చేయాలని, అలాగే రూ. 2 లక్షల జరిమానా చెల్లించాలని జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ తీర్పు సినిమా, సంగీత పరిశ్రమలో సంచలనంగా మారింది.
ఈ కేసును దాఖలు చేసింది భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఫైయాజ్ వసీఫుద్దీన్ దాగర్. ‘వీర రాజ వీర’ పాట తన తండ్రి నసీర్ ఫైయాజుద్దీన్ దాగర్ మరియు మామ జహీరుద్దీన్ దాగర్‌లు రచించిన ‘శివ స్తుతి’ నుంచి కాపీ చేయబడిందని ఆయన ఆరోపించారు. ఈ ఇద్దరూ జూనియర్ దాగర్ బ్రదర్స్‌గా పేరొందినవారు. ఫైయాజ్ తన పిటిషన్‌లో, పాటలోని తాళం, రాగం, సంగీత నిర్మాణం ‘శివ స్తుతి’తో దాదాపు ఒకేలా ఉన్నాయని, కేవలం సాహిత్యం మాత్రమే మార్చారని వాదించారు. ఈ పాటను రెహమాన్, మద్రాస్ టాకీస్ అనుమతి లేకుండా ఉపయోగించడం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని, నష్టపరిహారంతో పాటు తమ రచనకు గుర్తింపు ఇవ్వాలని కోరారు.
రెహమాన్ తరఫు న్యాయవాదులు ఈ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ‘శివ స్తుతి’ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ధ్రుపద్ శైలిలోని సాంప్రదాయ రచన అని, అది పబ్లిక్ డొమైన్‌లో ఉందని వాదించారు. ‘వీర రాజ వీర’ పాటను 227 విభిన్న సంగీత లేయర్లతో పశ్చిమ సంగీత శైలిలో స్వతంత్రంగా సృష్టించామని పేర్కొన్నారు. అయితే, కోర్టు ఈ వాదనలను పక్కనపెట్టి, ‘వీర రాజ వీర’ పాట ‘శివ స్తుతి’ నుంచి కేవలం ప్రేరణ పొందినది కాదని, కొన్ని స్వల్ప మార్పులతో దాదాపు ఒకే విధంగా ఉందని తేల్చింది.
కోర్టు ఆదేశాల ప్రకారం, రెహమాన్ మరియు మద్రాస్ టాకీస్ రూ. 2 కోట్లను కోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలి. ఈ కేసు తుది తీర్పు వచ్చే వరకు ఈ మొత్తం అలాగే ఉంటుంది. అదనంగా, రూ. 2 లక్షల జరిమానా కూడా చెల్లించాలి. ఈ తీర్పు సినిమా సంగీతంలో సాంప్రదాయ రచనల వినియోగం, కాపీరైట్ చట్టాలపై మరోసారి చర్చను రేకెత్తించింది.
ఏ.ఆర్. రెహమాన్ భారతీయ సినిమా సంగీతంలో ఒక బ్రాండ్. ఆస్కార్, గ్రామీ, జాతీయ అవార్డులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయనకు ఈ కేసు ఊహించని సవాలుగా మారింది. సంగీత రచనల్లో ఒరిజినాలిటీ, చట్టపరమైన హక్కులను కాపాడుకోవడంపై ఈ కేసు కొత్త కోణాన్ని అందిస్తోంది. ఈ వ్యవహారం తదుపరి విచారణలో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…