
హైదరాబాద్, చందానగర్‌లో నాల్గవ తరగతి చదువుతున్న ఓ 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూమ్‌లో కిటికీకి ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటన తల్లితండ్రులనే కాదు.. చుట్టుపక్కలవారిని, పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే చుట్టుపక్కల సీసీ కెమెరా రికార్డులు పరిశీలించగా అలాంటి ఆధారాలు ఏవీ లేవని తేలింది. దీంతో అసలు ఆ పిల్లాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనే ప్రశ్న మరింత క్లిష్టంగా మారింది.
అది పోలీసుల విచారణలో బయటపడుతుంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆత్మహత్య అంటే ఏమిటో కూడా తెలియని వయసులో ఎందుకు ఈ ప్రయత్నం చేశాడు? ఆత్మహత్య ఎలా చేసుకోవాలో అతనికి ఎలా తెలిసింది?
ఈ వయసులో పిల్లలకు చనిపోవాలనే స్పష్టమైన ఆలోచన కంటే, ఈ భయం లేదా ఈ బాధ ఆగిపోవాలనే భావోద్వేగమే ఎక్కువగా ఉంటుంది. పరీక్షల్లో మార్కుల భయం, తల్లితండ్రులను మెప్పించలేకపోయాననే గిల్టీ ఫీలింగ్, కుటుంబంలో గొడవలు, భయాలు, ఆత్మీయుల మరణాలు వంటి అనేకం ఆ చిన్న మనసుకి భారంగా మారుతాయి. కానీ మనసులో ఆ బాధని సరిగ్గా వ్యక్తం చేయలేకపోతారు.
అలాంటి సమయంలోనే స్నేహితులు లేదా పెద్దల మాటల ద్వారా లేదా యూట్యూబ్ వీడియోల ద్వారా ఆత్మహత్య గురించి విని ఉండవచ్చు. కానీ ఆత్మహత్య చేసుకుంటే చనిపోతానని తెలియక తాను ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడేందుకు చేసిన ఓ అనాలోచిత ప్రయత్నం కావచ్చు. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు చావు గురించి పూర్తి అవగాహన ఉండదు.
దీనికి తోడు మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్, సోషల్ మీడియా ప్రభావం పిల్లల మనసులను, వారి భావోద్వేగాలను మరింత అస్థిరం చేస్తున్నాయి.
కనుక తల్లితండ్రులు, ఉపాధ్యాయులు చిన్నారుల మాటలలో, చేతలలో వచ్చే మార్పులను నిశితంగా గమనిస్తూ, వారి మనసులో భావాలను చెప్పుకునేలా చేయడం చాలా అవసరం. వికసించాల్సిన పుష్పాలు పొరపాటున ఈవిధంగా రాలిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానిదే.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…