
ఈరోజు నెల్లూరు జిల్లాలో రాపూరులో సచివాలయంలో కొత్తగా నియమితులైన వాలంటీర్లు, వైసీపీ కన్వీనర్లని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మన ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం కలిగించడంలో అన్ని విధాలా విఫలమయ్యాం. ఇదివరకు టిడిపి నేతలపై పలు అంశాలపై మనం అందరం కలిసి విమర్శలు చేశాం. మేము అధికారంలోకి వస్తే మీరు చేయలేనివన్నీ మేము పూర్తి చేసి చూపిస్తాం అని సవాళ్ళు చేశాం. మన మాటల్ని నమ్మి ప్రజలు మన పార్టీకి ఓట్లేసి గెలిపించారు. ఆ తర్వాత ఎస్ఎస్ కెనాల్ ప్రాజెక్టు కట్టమా? కనీసం శంకుస్థాపన చేశామా? ఏమీ చేయలేదు.
కానీ సం.లోగా అందరూ ఎన్నికలకి సిద్దం కావాలని అప్పుడే మనకి ఆదేశాలు వచ్చేయి. మళ్ళీ మనం ప్రజలకి మాయమాటలు చెప్పాల… ఓట్లు దండుకొని కుర్చీలు ఎక్కాల… సంతోషం! కానీ ఈ నాలుగేళ్ళలో జిల్లా ప్రజలకు ఏమైనా చేయగలిగామా?ప్రజలు మన మాటలని మరోసారి నమ్ముతారా? ఏ అభివృద్ధి చేయకపోయినా కేవలం పెన్షన్లని చూసే ప్రజలు ఓట్లేస్తారా? గత ప్రభుత్వం కూడా పెన్షన్లు ఇచ్చింది కదా?వాళ్ళకంటే ఓ వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం అంతే కదా?
ఆనాడు వైఎస్ రాజశేఖ రెడ్డి హయాంలో ఇళ్ళు కట్టాం. కానీ ఇప్పుడేమైనా కట్టామా? ఎవరికైనా ఇచ్చామా? అనేక చోట్ల పునాదులు వేసి వదిలేశాము. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్న సమస్యలే. ఊళ్ళోకి వెళితే ప్రజలు సమస్యల గురించి ఏకరువు పెడుతున్నారు. రోడ్లన్నీ గుంతలు పడిపోయాయి.. మీరిచ్చే రెండు వేలు ఆ డాక్టర్లకు కూడా చాలడం లేదంటూ నిలదీస్తున్నారు.
ఎస్ఎస్ కెనాల్ని పూర్తి చేయాలని నేనే అనేకసార్లు సిఎం జగన్మోహన్ రెడ్డికి స్వయంగా విజ్ఞప్తి చేశాను. చీఫ్ ఇంజనీర్ల సమావేశాలలో చెప్పాను. చివరికి శాసనసభలో కూడా గట్టిగా అడిగాను. కానీ మన ప్రభుత్వం పట్టించుకోలేదు. కళ్లెదురుగా కండలేరు కనిపిస్తున్నా రాపూరులో ఓ చెరువుని కూడా నింపుకోలేకపోతున్నాం. ప్రజలకు గుక్కెడు నీళ్ళు ఇవ్వలేకపోతుంటే మనల్ని, మన మాటలని, మన ప్రభుత్వాన్ని ప్రజలెందుకు నమ్ముతారు? మన మీద నమ్మకం కోల్పోయిన ప్రజలని మళ్ళీ మనకే ఓట్లు వేయమని ఏ మొహం పెట్టుకొని అడుగుతాము?” అని ఆనం రామినారాయణ రెడ్డి సభాముఖంగా తమ వైసీపీ ప్రభుత్వం నిర్వాకాన్ని ప్రజలకు తెలియజేశారు.
ఆయన టిడిపిలోకి వెళ్ళిపోయేందుకే సొంత ప్రభుత్వం మీద ఈవిదంగా విమర్శలు గుప్పిస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేసి ఆయన నోరు మూయించవచ్చు. తమ ప్రభుత్వాన్ని సమర్ధించుకోవచ్చు. కానీ ఆయన చెప్పినవన్నీ వాస్తవాలే కదా?వాటిని ఏ సాకుతో తప్పించుకోగలరు? ఏవిదంగా దాచి పెట్టుకోగలరు? తమ వైఫల్యాలకు ఎవరిని నిందించగలరు?
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…