
క్రిమినల్ కేసులలో చిక్కుకున్న సామాన్యులు ఏళ్ళ తరబడి రిమాండ్ ఖైదీలుగా జైల్లోనే జీవితం గడుపుతుంటారు. కానీ ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినవారందరూ, పండగకి అత్తగారింటికి వెళ్ళి వస్తున్నట్లు జైలుకి వెళ్ళి వచ్చేస్తున్నారు.
ఒకరు మరొకరిని హత్య చేస్తే అది తీవ్రమైన నేరం. అదే ఒక దేశం మరో దేశం మీద బాంబులు కురిపించి వేలాదిమందిని చంపేస్తే అది హత్యానేరం కాదు.. యుద్ధం!
అదేవిధంగా, ప్రభుత్వంలో ఒక అధికారి ఆర్ధిక నేరం చేస్తే ఏసీబీ అధికారులు పట్టుకొని అవినీతిపరుడని ప్రజలకు చెప్తారు. అదే.. ప్రభుత్వంలో అందరూ కలిసి చేస్తే దానిని కుంభకోణం అంటారు.
దీనిలో ఎవరూ ప్రత్యేకంగా నిందితులు ఉండరు. అందరూ నిందితులే కనుక (ప్రభుత్వం మారే వరకు) కలిసికట్టుగా రాజకీయాలు చేస్తూ కేసులను సాగదీయగలిగితే చాలు.. ఆ తర్వాత కడిగిన ఆణిముత్యాల్లా అందరూ బయటపడిపోవచ్చు.
దేశంలో రాజకీయ నాయకులున్న ఏ కేసయినా ఇలాగే సాగుతుంది. వాటిలో ఈ మద్యం కుంభకోణం కేసు కూడా ఒకటనుకోవచ్చు.
ఈ కేసు గురించి అడపా దడపా సంచలనం అంటూ మీడియాలో ఏదో వార్త వస్తుంటుంది. కనుక ప్రజలు ఆ ‘సంచలన వార్తలు’ చదువుకుంటూ ఆహా ఓహో అనుకోవాలి తప్ప నేరస్తులు ఎవరు? వారికి శిక్షలు ఎప్పుడు? వంటి పిచ్చి ప్రశ్నలు అడగకూడదు.
కనుక జనం కోసం ఇదిగో అలాంటి ఓ సంచలన వార్త. దీని సృష్టికర్త ఏపీ బిజేపి అధ్యక్షుడు పివిఎన్. మాధవ్. ఆయనేమన్నారంటే, ఈ మద్యం కేసులో త్వరలోనే కొన్ని ‘పెద్ద తలకాయలు’ లోపలకు వెళ్ళబోతున్నాయన్నారు.
ఈ స్థాయిలో ఉన్న జాతీయ పార్టీ నాయకులు కూడా ‘పెద్ద తలకాయలు అలియాస్ అంతిమ లబ్దిదారు’ అని మాట్లాడుతుండటం చూస్తే, వాటిని టచ్ చేయడానికి ఎంత సాహసం ఉండాలో అర్దమవుతుంది.
గత ప్రభుత్వం ఏమాత్రం సంకోచించకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసింది. కానీ దానికి అనూహ్య పర్యవసానాలు ఏర్పడ్డాయి. కనుక కూటమి ప్రభుత్వం అలాంటి తప్పు చేయదు.
రాష్ట్ర బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారంటే దానర్ధం సీబీఐ లేదా ఈడీ ఇందుకు పూనుకోవచ్చనుకోవాలి. కానీ అవి అరెస్టు చేసినా అది కూడా జస్ట్ మరో సంచలన వార్త మాత్రమే.
దాంతో అధికార, ప్రతిపక్షాలకు రాజకీయంగా లాభమా… నష్టమా ఎంత శాతం? అనే లెక్కలు చూసుకోవాలి తప్ప ఈ ఆర్ధిక నేరాలకు శిక్షలు పడతాయని ఎదురు చూడకూడదు.
కనుక ఇలాంటి ‘సంచలన వార్తలు’ చదువుకుంటూ… అలా కళ్ళు మూసుకుంటే చాలు… గిర్రున మూడేళ్ళు లేదా ముప్పై ఏళ్ళు గడిచిపోతాయి.
ఆలోగా రాజకీయ సమీకరణలు, ప్రభుత్వాలు మారిపోతుంటాయి. వాటితో పాటే ఎలాంటి కేసులైనా అటకెక్కిపోతుంటాయి.. లేదా క్లీన్ చిట్‌లతో ఆణిముత్యాలు బయటపడుతుంటాయి. ప్రజలు వాటినే ఏరుకుంటునప్పుడు ఇక అభ్యంతరాలు దేనికి?
Chennai Super Kings have named Zaheer Khan as their new head coach, with MS Dhoni…
Mysaa is shaping up as one of the biggest tests of Rashmika Mandanna’s career. The…