
Anil Ravipudi's Journey with Nandamuri Heroes
టాలీవుడ్‌లో కొందరు దర్శకులకు హీరోలతో కాంబినేషన్లు కుదరడం అనేది కేవలం సినిమాలకే పరిమితం కాదు. కొన్ని కాంబినేషన్లు వారి కెరీర్‌లో ప్రత్యేకమైన మైలురాళ్లుగా నిలిచిపోతాయి. ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రయాణాన్ని చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది.
ఒకప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్‌తో ‘పటాస్’ అంటూ దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనిల్.. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ అంటూ మరో మెట్టు ఎక్కారు. ఇక ఇప్పుడు ఏకంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా ప్రకటించే స్థాయికి చేరుకున్నారు.
పటాస్‌తో మొదలైన ప్రయాణం..
2015లో ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేశారు. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ హీరో మాత్రమే కాదు.. నిర్మాత కూడా. తొలి సినిమాతోనే మాస్ ఎంటర్‌టైనర్‌ను ఎలా తెరకెక్కించాలో చూపించిన అనిల్.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నారు. ఒక కొత్త దర్శకుడిపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్‌కు అనిల్ తన కెరీర్‌లో ప్రత్యేక స్థానం ఇస్తుంటారు. ‘కళ్యాణ్ రామ్ లేకపోతే నేను లేను’ అంటూ ఆయన గతంలో చెప్పిన మాటలు ఈ అనుబంధానికి నిదర్శనం.
భగవంత్ కేసరితో మరో మెట్టు..
పటాస్‌తో మొదలైన విజయప్రస్థానం ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3 వంటి సినిమాలతో కొనసాగింది. కామెడీ, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తన బలంగా మార్చుకున్న అనిల్.. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలను అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే కేవలం కామెడీ, వినోదాత్మక చిత్రాలకే పరిమితం కాకుండా తనలోని మరో కోణాన్ని బయటపెట్టాలని అనుకున్న ప్రయత్నంలో భాగంగానే నందమూరి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ తెరకెక్కించారు. బాలయ్య మాస్ ఇమేజ్‌ను ఉపయోగించుకుంటూనే, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, మహిళా సాధికారత వంటి అంశాలను కథలో మేళవించారు.
ఈ సినిమా అనిల్ కెరీర్‌లో మరో కీలకమైన మైలురాయిగా నిలిచింది. 71 వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో భగవత్ కేసరి చిత్రానికి ‘ఉత్తమ తెలుగు చిత్రం’ అవార్డు లభించింది. ఈ గౌరవం అనిల్ దర్శక ప్రతిభకు మరో గుర్తింపనే చెప్పాలి.
జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ ప్రకటన…
ఇప్పటివరకు నందమూరి కుటుంబంలో కళ్యాణ్ రామ్‌తో కెరీర్ ప్రారంభించి, బాలకృష్ణతో ప్రత్యేక విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది. ఈ నవంబర్ 14న అనిల్ రావిపూడి, జూనియర్ ఎన్టీఆర్ కలిసి తమ కాంబినేషన్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నట్లు అనిల్ సంకేతాలిచ్చారు.’లాఫ్ రైట్’ అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన హింట్.. అభిమానుల్లో ఈ కాంబినేషన్‌పై అంచనాలను పెంచింది. అయితే సినిమా కథ, ఇతర నటీనటులు, పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
దర్శకుడిగా అనిల్ సాధించిన విజయాలు, నిర్మాతలకు లాభాలు అందించగలడనే నమ్మకం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల వినోదాత్మక కథనాలపై ఆయనకున్న పట్టు కూడా ఈ కాంబినేషన్‌కు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
మరోవైపు అనిల్ ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో ‘జనవరి 12 విడుదల’ సినిమాను రూపొందిస్తున్నారు. సంక్రాంతి 2027కి ఈ చిత్రం విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికి పటాస్‌తో మొదలైన అనిల్ ప్రయాణం.. భగవంత్ కేసరితో మరో స్థాయికి చేరి.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతోంది.
నందమూరి కుటుంబంలోని హీరోలతో వరుసగా సినిమాలు చేయడం ఒక విశేషమైతే.. ప్రతి కాంబినేషన్‌లోనూ తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లడం అనిల్ ప్రత్యేకత. మరి కళ్యాణ్ రామ్‌తో కెరీర్‌కు పునాది వేసుకున్న ఈ దర్శకుడు.. బాలయ్యతో గుర్తింపు తెచ్చుకుని, తారక్‌తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి!
Leaving a secure job in the US to pursue an uncertain career in films is…
Allu Arjun's presence at the pre-release event of Aakasamlo Oka Tara created considerable attention around…