Telugu

ఆగస్టు రిపోర్ట్: ఇరుముడి జోరు.. టాక్సిక్ బేజారు!

ఆగస్టులో సినిమాలకు కొదవ లేదు. ఐదు స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు తమిళం నుంచి రెండు చెప్పుకోదగ్గ సినిమాలు, కన్నడ నుంచి భారీ పాన్ ఇండియా సినిమా వచ్చాయి. కానీ ఫలితాలు చూస్తే ఒక్కో సినిమాది ఒక్కో కథ. కొన్ని కాస్త ఊరటనిస్తే, మరికొన్ని వచ్చినట్టే వెళ్లిపోయాయి. నెల మొత్తంలో అన్ని రకాలుగా కలిసొచ్చింది మాత్రం రవితేజకే.

ముందుగా వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ విషయానికి వస్తే, కంటెంట్ పరంగా మిశ్రమ స్పందన వచ్చింది. అక్కడక్కడా వసూళ్లు బాగున్నా, తొలి శని, ఆదివారాల హడావిడితోనే థియేటర్ రన్ దాదాపుగా ముగిసిపోయింది. అయితే బడ్జెట్ పరిమితంగా ఉండటం సినిమాకు కలిసొచ్చింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్‌కు వసూళ్ల పరంగా కాస్త ఊరట దక్కింది. అంతే తప్ప, కంటెంట్ పరంగానో, సాధించిన విజయం పరంగానో మేకర్స్ గొప్పగా చెప్పుకునే సినిమా కాలేకపోయింది.

ADVERTISEMENT

ఎంఎస్ రాజు ‘అగాధ’ పూర్తిగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ‘పల్లభరసు’ కూడా ఎలాంటి సందడి చేయలేకపోయింది. గ్యాంగ్‌స్టర్ సినిమా ‘కేజేక్యూ’ అయితే పూర్తిగా వాషౌట్ అయిపోయింది.

నెల చివర్లో వచ్చిన ‘ఇరుముడి’ మాత్రం సంచలనం సృష్టించింది. రవితేజకు అన్ని రకాలుగా ఇది కమ్‌బ్యాక్ సినిమా. వసూళ్లతో పాటు నటుడిగానూ మంచి పేరు తెచ్చిపెట్టింది. వరుస పరాజయాల తర్వాత ఆయనకు కావాల్సిన విజయం ఇరుముడితో దక్కింది. మైత్రీ మూవీ మేకర్స్‌కు కూడా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన ఫలితాన్నిచ్చింది.

తమిళం నుంచి వచ్చిన ‘డీసీ’ చూసిన ప్రేక్షకుల నుంచి, రివ్యూల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ఎక్కువమందికి చేరకపోయినా, చూసిన పరిమిత ప్రేక్షకుల్లో మాత్రం బలమైన ముద్ర వేసింది. సాంకేతికంగా సినిమా తీసిన తీరు, నటీనటుల ఎంపిక కలిసొచ్చాయి. హింస ఎక్కువగా ఉన్నా, మంచి యాక్షన్ సినిమాగా తెలుగు, తమిళ ప్రేక్షకుల మెప్పు పొందింది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథ మాత్రం వేరు. తమిళంలో తీసి తెలుగులో డబ్ చేసిన ఈ సినిమా, తమిళంలో ఫ్లాప్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరుగా ఆడింది. ఇక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో ఒకేలా వసూళ్లు రాలేదు. అయినా మొత్తంగా తెలుగులో పాస్ మార్కులు తెచ్చుకుంది.

అమెరికాలో మాత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చాలా బాగా ఆడింది. మూడు మిలియన్ డాలర్లకు దగ్గరవుతోంది. అయితే అక్కడ కూడా తమిళ ప్రేక్షకులు సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. తమిళంలో నిరాశపరిచిన సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మెరుగైన ఫలితం రావడం ఇందులో చెప్పుకోదగ్గ విషయం.

ఇక కన్నడ నుంచి భారీ పాన్ ఇండియా సినిమాగా వచ్చిన యశ్ ‘టాక్సిక్’ తొలి షో నుంచే తేలిపోయింది. భారీ అంచనాలతో వచ్చినా, చివరకు డిజాస్టర్‌గా మిగిలింది.

మొత్తానికి ఆగస్టులో తెలుగు నుంచి ‘ఇరుముడి’ తిరుగులేని విజేతగా నిలిచింది. తమిళం నుంచి ‘డీసీ’ తనదైన ముద్ర వేసింది. కన్నడ నుంచి వచ్చిన ‘టాక్సిక్’ భారీ నిరాశను మిగిల్చింది. సినిమాలు చాలానే వచ్చినా, ఈ నెల గట్టిగా చెప్పుకునే విజయం మాత్రం రవితేజదే.

Share
Chaitanya Krishna

I’m passionate about Telugu cinema, but I also enjoy watching films in other languages, especially Malayalam and Tamil. I love offering critical yet meaningful analysis of movies.

Published by

Recent Posts

హీరోయిన్ల బొడ్లు బ్లర్ చేయించారట.. ఇదేం చోద్యం

రంభ ఊర్వశి మేనక అనే సినిమా ఈవారం విడుదలవుతుందా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ కి ఎట్టకేలకు తెరపడింది. సెన్సార్…

6 minutes ago

కవిత vs బిఆర్ఎస్ మధ్య ‘వన్ సైడ్ వారేనా’.?

తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత చేసే రాజకీయ ప్రకటనలు తెలంగాణ రాజకీయాలలో, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంటాయి.…

11 minutes ago