
కథ కననిది విననిది కాదు. చిన్న ఇరుకు బస్తీలో ఎదురెదురు ఇళ్లలో ఉండే ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైష్ణవి పదో క్లాసులోనే లవ్వాడుకుంటారు , బాబు టెన్త్ ఫెయిలై ఆటో రిక్షా నడుపుకుంటే అమ్మాయి పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్కడో ధనవంతుల బిడ్డ విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం. ట్రయాంగిల్ లవ్ షురూ. అపార్థాలు, అరుచుకోవడాలు, కన్నీళ్లు అన్నీ ఉంటాయి.
దర్శకుడు సాయిరాజేష్ తమిళం నుంచి వచ్చి కల్ట్ క్లాసిక్స్ గా నిలిచిపోయిన ప్రేమిస్తే, 7జి బృందావన్ కాలనీ టైపు ఫ్లేవర్ లో ఒక తెలుగు సినిమా అందించాలని ప్రయత్నించాడు. ఓపెనింగ్ సీన్లో ఆనంద్ దేవరకొండ తాగి రోడ్డు మీద పడిపోవడం అచ్చం వాటి స్టైల్ లోనే ఉంటుంది. ఊహించినట్టే అక్కడి నుంచి ఓ రెండు మేఘాలిలా పాటతో ఫ్లాష్ బ్యాక్ ని మొదలుపెట్టి లవ్ స్టోరీ చెబుతాడు.
కాలేజీలో వైష్ణవికి విరాజ్ పరిచయమై ఐఫోన్ ఇచ్చాక కథ అసలు మలుపు వైపు తిరుగుతుంది. ఆమె ప్రవర్తన పలుదశల్లో ఎలా మారుతూ వచ్చిందో వివరించాలని చూసిన దర్శకుడు దాన్ని సుదీర్ఘంగా మార్చడంతో ల్యాగ్ వచ్చింది. ఆనంద్, వైష్ణవికి మధ్య ఘర్షణను కుర్ర మాస్ కి రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా బూతు ప్రయోగం చేయడంతో కామన్ ఆడియన్స్ కి ఇబ్బంది కలుగుతుంది.
అయినా సరే ఇంటర్వెల్ బ్లాక్ ని ప్రాపర్ గా కట్ చేసి రెండో సగం మీద కొంత ఆసక్తి వచ్చేలా చేశాడు. సెకండ్ హాఫ్ బెటరనిపించేలా నెరేషన్ సాగుతుంది. సరిపడా డ్రామా ఉన్నట్టు అనిపించినా కొంత సాగతీత ఉన్న మాట వాస్తవం. కాకపోతే వైష్ణవి తాలూకు అంతర్మథనం బలంగా చెప్పాలన్న నిజాయితీ బలహీనతలను కవర్ చేసింది. చివరి గంట బరువైన భావోద్వేగాలు వస్తాయి.
క్లైమాక్స్ కు చేరే సమయానికి వైష్ణవి మీదున్న కోపం జాలిగా మారితే, ఆనంద్ మీదున్న సానుభూతి ఆడియన్స్ అతన్ని ప్రేమించేలా చేసింది. కంటెంట్ తో కనెక్ట్ అయినవాళ్లకు గుండె తడి కలుగుతుంది. లేదూ ముందు నుంచి కాన్సెప్ట్ మీద ఎలాంటి అభిప్రాయం కలగకపోతే ఇదంతా ఓవర్ మెలోడ్రామా అనిపించవచ్చు. లెన్త్ కొంత ఎక్కువే అయినా ఒకసారి చూసేందుకు ఇబ్బంది లేనంత ఎమోషన్స్ పెట్టారు.
ఆనంద్ దేవరకొండలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. కొన్ని సీన్స్ లో చాలా మంచి నటన ప్రదర్శించాడు. జీవించాడని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రీ క్లైమాక్స్, చివరి సీన్స్ లో యూత్ కి పిచ్చగా నచ్చేస్తాడు. వైష్ణవి చైతన్య పూర్తిగా పరకాయ ప్రవేశం చేసింది. ఇంత బరువైన క్యారెక్టర్ ని మోసిన తీరు భేష్ అనిపించుకుంది. వీళ్ళతో పోలిస్తే విరాజ్ అశ్విన్ ది పెర్ఫార్మన్స్ పెద్దగా డిమాండ్ చేసిన పాత్ర కాదు.
విజయ్ బుల్గానిన్ సంగీతం బేబీకి ప్రాణం పోసింది. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం మంచి క్వాలిటీని తీసుకొచ్చింది. విజువల్స్ అన్నీ ఎమోషన్స్ ని క్యారీ చేశాయి. పాతికేళ్ల లోపు యువతీ యువకులను టార్గెట్ గా పెట్టుకున్న సాయిరాజేష్ వాళ్ళను చేరుకోవడంలో ఫెయిల్ కాలేదు. సకుటుంబ సపరివార సమేతంగా చూడమని చెప్పేది కాదు కానీ స్నేహితులతో, ప్రేమికులతో కలిసి ఓసారి చూడొచ్చు.
Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…
Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…