
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అందరికీ తెలిసిందే. పైగా తెలంగాణ ముఖ్యమంత్రికి లేని కేసులు సిఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. కనుక జాతీయ పార్టీ అయిన బిజెపికి తెలంగాణలో కంటే ఏపీలో పట్టు సాధించడం సులువనుకోవాలి. కానీ ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రంలోనే తమకు ఎక్కువ అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తుండటం విశేషం.
భావించడమే కాదు…నాలుగు లోక్‌సభ సీట్లు, జీహెచ్ఎంసీ ఎన్నికలలో, దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలలో బిజెపి తన సత్తా చాటుకొంది. అదే ఉత్సాహంతో వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని ఓడించి తెలంగాణలో అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ప్రయత్నిస్తోంది.
తెలంగాణలో వైఎస్ షర్మిల వంటి మరికొందరు నేతలు పాదయాత్రలు చేస్తున్నప్పటికీ వాటికి పెద్దగా ప్రజాధారణ లభించడం లేదు. అందుకే టిఆర్ఎస్ కూడా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కనుక నిత్యం మంత్రి కేటీఆర్ మొదలు ప్రభుత్వంలో పార్టీలో అందరూ ఆయనపై ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. దానర్ధం టిఆర్ఎస్ ఆయన బలాన్ని గుర్తించిందన్న మాట!
రేపటితో ఆయన రెండో విడత పాదయాత్ర ముగుస్తుంది. కనుక రేపు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బహిరంగసభ నిర్వహించబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే జరిగిన సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కాగా, రేపు జరుగబోయే సభకు బిజెపి సీనియర్ నేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. అంటే తెలంగాణ బిజెపికి ఆ పార్టీ అధిష్టానం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్ధం చేసుకోవచ్చు.
తెలంగాణలో బిజెపి చేస్తున్న ప్రయత్నాలు, పోరాటాలు ఫలించి అధికారంలోకి వస్తుందా రాదా? అనే విషయం పక్కన పెడితే ఆ రాష్ట్రంలో చాలా బలంగా ఉన్న సిఎం కేసీఆర్ ప్రభుత్వంపై, టిఆర్ఎస్ పార్టీపై బిజెపి అలుపెరుగని పోరాటం చేస్తోందని స్పష్టం అవుతోంది.
కానీ ఏపీలో బిజెపి పరిస్థితి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా చాలా దయనీయంగా కనిపిస్తుంది. తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మంచి దూకుడుగా వ్యవహరిస్తూ, ఎన్నికలలో పార్టీని వరుసగా గెలిపించుకొంటుంటే, ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు నోరు తెరిస్తే పార్టీకే తలనొప్పులు, నష్టం అన్నట్లుంది.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌ను నమ్ముకొని మనుగడ సాగిస్తోంది. కానీ ఆయన మళ్ళీ టిడిపితో చేతులు కలిపితే బిజెపి పరిస్థితి మరింత దయనీయంగా మారవచ్చు. జరుగబోయే పరిణామాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నా సోమూ వీర్రాజు ‘మా ప్రధాని నరేంద్ర మోడీ పేరుతోనే మేము ప్రజల వద్దకు వెళ్ళి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము,’ అంటూ తాను భ్రమలో ఉంటూ పార్టీని కూడా భ్రమలో ఉంచుతున్నారు.
రాష్ట్రంలో బిజెపి పరిస్థితి చూసి పార్టీలో దగ్గుబాటి పురందేశ్వరి వంటి సీనియర్ నేతలు కూడా చాలా కాలంగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ కూడా రాష్ట్రంలో బిజెపి అనే ఓ పార్టీ ఒకటుందని గుర్తించనట్లు వ్యవహరిస్తుండటం చూస్తే బిజెపి పరిస్థితి అర్ధం అవుతుంది. కనుక ఏపీ బిజెపి మనుగడ సాగించాలంటే పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళి టిడిపితో మళ్ళీ చేతులు కలిపితే మంచిదేమో?
Rajinder Kumar, a 32-year-old Indian truck driver, has been transferred from federal immigration custody to…
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…