
సమాజంలో కనిపిస్తున్న మార్పులు మానవ సంబంధాలను ఎంతలా దిగజారుస్తున్నాయో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ ఇంకొకరి పట్ల సమయం గడిపే అవకాశం రావడంలేదు. చివరికి కన్న బిడ్డలను కూడా కంటికి రెప్పలా చూసుకునే సమయం తల్లితండ్రులకు ఉండడం లేదు.
పొద్దున్న లేస్తే ఒక టిఫన్ డబ్బా పట్టుకుని ఎవరికీ వారు వారి ఉద్యోగాలకు వెళ్లిపోతుంటే ఇంకా వారి పిల్లల బాల్యం మొత్తం డే కేర్ లో ముగిసిపోతుంది. అలాగే వారి తల్లితండ్రుల వృద్ధాప్యం మొత్తం ఒంటరి తనంతోనే గడిచిపోతుంది.
గతంలో హాస్పిటల్స్, స్కూల్స్ ఉన్నంతగా ఇప్పుడు సందుకో డే కేర్, నగరానికో వృద్ధాశ్రమాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. అయితే ఈ మారిన జీవన విధానానికి ఎవరిని నిందించలేని పరిస్థితి, అలాగే ఎవరిని దోషులుగా నిలబెట్టలేని దుస్థితి.
అయితే ఈ ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో ముందుకెళ్ళాలి అంటే తల్లితండ్రులిద్దరు రెండు చేతుల సంపాదించక తప్పని పరిస్థితి. ఒకప్పటి మనిషి అవసరం ఇప్పుడు సౌకర్యంగా, మరొకరి ఆదాయ వనరుగా మారిపోయింది.
బాల్యం కోసం డే కేర్ లు వృద్ధాప్యం కోసం వృద్ధాశ్రమాలు ఆశ్రయిస్తున్న ప్రస్తుత తరం వారి కుటుంబ సభ్యులను ఎంత సురక్షితంగా ఉంచుతున్నారో అనేదానికి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది.
మహారాష్ట్రలోని శంభాజీనగర్ లోని ఒక డే కేర్ సెంటర్ లో జరిగిన ఈ దారుణం పై ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రెండేళ్లు కూడా నిండని ఒక చిన్నారి డే కేర్ సెంటర్ లో ఉన్న తన తోటి విద్యార్థిని అత్యంత దారుణంగా కొట్టి, కొరికాడు. అయితే ఈ ఘటన మొత్తం సిసి కెమెరాలో రికార్డు అవ్వడంతో వైలెన్స్ కి ఏజ్ లిమిట్ ఉండదా అంటూ చూసిన వారు నోరెళ్లబెడుతున్నారు.
సుమారు 15 నిమిషాల పాటు ఆ బాలుడు తనతోటి చిన్నారి పై చేసిన ఈ విచక్షణరహితమైన దాడి చూసినవారిని ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి. ఇంత చిన్న వయస్సులో ఇంత వైలెంట్ గా ప్రవర్తించిన ఆ బాలుడి మానసిక స్థితి పై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డే కేర్ సెంటర్ లో ఉన్న సంరక్షకురాలు బయటకు వెళ్లిన కొన్ని క్షణాలే ఈ రెండేళ్ల బాలుడు మరో బాలుడి పై చేతికి దొరికిన వస్తువులు విసురుతూ, చేత్తో కొడుతూ గాయపరిచాడు. ఇక సదరు బాధితుడి ఒంటి మీద సుమారు 25 చోట్ల కొరికిన పళ్ళ గాట్లు గుర్తించడంతో బాలుడు తల్లితండ్రులు డే కేర్ సెంటర్ మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
ఘటన జరిగిన వెంటనే సదరు బాధిత తలితండ్రులకు అసలు విషయం చెప్పకుండా దాచి ఉంచడం, డే కేర్ సెంటర్ లో పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లడం వంటి నిర్లక్ష్యానికి గాను ఆ డే కేర్ సెంటర్ యాజమాన్యం మీద కేసు నమోదు చేసారు. అయితే డే కేర్ సెంటర్ యాజమాన్యం పరిహారంతో కేసును ముగించేందుకు బాధిత బాలుడి తల్లితండ్రులతో బేరసారాలు ఆడినట్టుగా కూడా వార్తలు బయటకొచ్చాయి.
అయితే తల్లితండ్రులు తమ పిల్లల బాల్యాన్ని డే కేర్ లో కాకుండా గ్రాండ్ పేరెంట్స్ తో గడిపేలా చేస్తే వారికీ చిన్న వయస్సు నుంచి ఒంటరి తనం అలవాటు కాకుండా ఉంటుంది. తల్లితండ్రులకు ఆఫీస్ మాదిరి పిల్లలకు డే కేర్ లు మారిపోవడంతో వారి ఆ పసి వయస్సు మొత్తం ఆ నాలుగు గోడల మధ్య బందీగా మారిపోతుంది.
పిల్లలకు ఆర్థిక భద్రత కోసం తల్లితండ్రులిద్దరు కష్టపడడం తప్పు కాదు కానీ వారికంటూ కొంత సమయాన్ని కేటాయించకపోవడం, వారితో ప్రేమగా ,ఆప్యాయంగా సమయం గడపకపోవడంతో కొంతమంది పిల్లలు ఒంటరితనానికి అలవాటుపడి తోటివారితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేకపోతున్నారు అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఏదిఏమైనా ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడడానికి తలోచేయి వెయ్యాల్సిందే…!
Ishan Kishan could be back in India’s Test plans ahead of the upcoming New Zealand…
Kangan Baruah brings a flash of metallic glamour to this striking portrait series. Her silver…