
దేశంలో ఏ పరిశ్రమ బాగున్నా, లేకున్నా… ప్రజలకు వినోదాన్ని పంచే సినీ పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అలాంటి సినీ పరిశ్రమ ప్రస్తుతం మోడీ తీసుకున్న నిర్ణయంతో వణికిపోతోంది. ఓ పక్కన ధియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు కరువవ్వడం ఒక వంతయితే, సినీ వర్గాలపై జరుగుతున్న ఐటీ దాడులు కలవర పెడుతున్నాయి. ఈ శుక్రవారం విడుదలైన సినిమాలకు ఓపెనింగ్స్ లేక ధియేటర్లలో ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
అహ్మదాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ ధియేటర్లో అయితే “ఒకే ఒక్కడు” కోసం సినిమాను ప్రదర్శించాల్సి వచ్చింది. విడుదల రోజునే పరిస్థితి ఈ స్థాయిలో ఉంటే, ఆ తర్వాత రెండవ రోజు నుండే మార్కెట్ లో దర్శనమిస్తున్న పైరసీని తట్టుకుని నిలబడడం అసాధ్యమేనని చెప్పాలి. కనీసం కరెంటు ఖర్చులకు కూడా కలెక్షన్లు రాలేనంత దారుణమైన స్థితిలో ధియేటర్లు ఉన్నాయి. అయితే “ధృవ” సినిమా విడుదలకు ఇంకా 20 రోజుల సమయం ఉంది కాబట్టి పరిస్థితి కాస్త మెరుగయ్యే అవకాశం ఉంది గానీ, భారీ కలెక్షన్లతో రికార్డులు మోత మొగించాలంటే మాత్రం కష్టమే.
మరి ప్రతి పైసా కూడా లెక్కించే అల్లు అరవింద్ లాంటి నిర్మాత ఇలాంటి గడ్డు పరిస్థితిలో సినిమాను రిలీజ్ చేస్తారా? అన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుత స్థితి నుండి సాధారణ పరిస్థితులకు జనజీవనం రావడానికి ఇంకా సమయం పడుతుంది. దీంతో “ధృవ” సినిమా విడుదలను వాయిదా వేసే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లుగా సినీ జనాలు చెప్పుకుంటున్నారు. అయితే రానున్న రెండు శుక్రవారాలలో విడుదల కానున్న చిన్న సినిమాల ఆదరణను బట్టి “ధృవ” నిర్ణయం ఉంటుందని లభించిన కీలక సమాచారం.
గతంలో ‘ఎవడు’ సినిమా కూడా ఇలా సినిమాయేతర కారణాల వలన అనేక వాయిదాలు పడుతూ డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉండగా, అది కాస్త సంక్రాంతి సమయానికి ముహూర్తం కుదిరింది. తాజాగా “ధృవ” సినిమాకు కూడా అదే పరిస్థితులు ఏర్పడితే తండ్రి కొడుకుల సినిమాలను ఒకేసారి వీక్షించే అవకాశం మెగా అభిమానులకు దక్కినట్లవుతుంది.
Kalvakuntla Kavitha had an emotional exit from the BRS party as she was sent out…
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…