
ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రతీ అంశంపై ఎవరికి తోచింది వారు మాట్లాడుతుండేవారు. తమ క్రమశిక్షణా రాహిత్యానికి ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ అనే అందమైన ముసుగు వేసుకునేవారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సీనియర్ నేతలు సైతం ఆయన మాట జవదాటడం లేదు.
ముఖ్యమంత్రి అభిప్రాయాలను, ఆలోచనలను, వ్యూహాలను, నిర్ణయాలను అందరూ గట్టిగా సమర్ధిస్తున్నారు. ఉదాహరణకు అల్లు అర్జున్ అరెస్ట్, సినీ పరిశ్రమపై సిఎం రేవంత్ రెడ్డిపై శాసనసభలో సంచలన వ్యాఖ్యలు చేయగానే శనివారం రాత్రి అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారు.
అది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించడానికే అని వేరేగా చెప్పక్కరలేదు. గతంలో అయితే కాంగ్రెస్ పార్టీలో కొందరు అల్లు అర్జున్‌ని వంత పాడేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అందరూ అల్లు అర్జున్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
సంధ్య థియేటర్ ఘటన పట్ల తనకు చాలా బాధ కలిగిందని అల్లు అర్జున్ చెప్పుకున్నప్పటికీ ఆయనలో ఏ మాత్రం పాశ్చాత్తాపం కనిపించడంలేదని, నేటికీ ఆయన తన మనోభావాలు దెబ్బ తిన్నాయనే బాధపడుతున్నారే తప్ప జరిగిన పొరపాటుని ఒప్పుకోవడంలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆక్షేపించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాలమూరి వెంకట స్పందిస్తూ, “అసలు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏమిటి? ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే జరిగిన తప్పును ఒప్పుకోని క్షమాపణ చెపుతారనుకుంటే తన వ్యక్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బ తీస్తోందన్నట్లు ఆరోపణలు చేశారు. తన సినిమాకి టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు, ప్రివిలేజ్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తే కనీసం థాంక్స్ చెప్పాలేదు. కానీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పు పట్టడానికి ప్రెస్‌మీట్ పెట్టారు. సంధ్య థియేటర్ వద్ద ఆ ఘటన జరుగకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకునేదే కాదు కదా?” అని ప్రశ్నించారు.
ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలతో పాటు తెలంగాణ డీజీపీ జితేందర్ తదితరులు కూడా అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టడం, ఆ విదంగా మాట్లాడటం రెండూ సరికావని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో ఈ మార్పు, క్రమశిక్షణ మొదలైంది. కానీ సినీ పరిశ్రమ దానిని గమనించకుండా ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని లైట్ తీసుకోవడంతో ఈ సమస్య ఇంత వరకు వచ్చింది.
కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్‌పై ఎదురుదాడి చేస్తుంటే ఆయనకి సంఘీభావం తెలిపిన సినీ ప్రముఖులు ‘సైలంట్ మోడ్’లో ఉండిపోయారు. ఆయనకు అండగా నిలబడిన వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు కూడా కిక్కురుమనడం లేదిప్పుడు! అంటే రాజకీయ చదరంగంలో కింగ్ అనుకున్న అల్లు అర్జున్ ఒంటరి పావుగా మిగిలిపోయారన్న మాట!
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…