
ఒకప్పుడు ఇంటి ముందు కొబ్బరాకుల పందిరి వేసి పెళ్లిళ్లు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కనుక కళ్యాణ మండపాలలో చేస్తున్నారు. మంచిదే. కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఒకరిని చూసి మరొకరు పోటీలు పడుతూ రెండు కుటుంబాలను కలిపే వివాహ కార్యక్రమాన్ని జీవితంలో అతి పెద్ద ‘ఈవెంట్’గా మార్చేసుకున్నారు కదా?
ఒకప్పుడు నిశ్చయ తాంబూలాలు పెళ్లి ఖాయం చేసుకోవడానికే జరిగేవి. కానీ ఇప్పుడూ? అదే ఓ పెళ్లిలా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కాగానే కాబోయే వధూవరులు ప్రీ వెడ్డింగ్ షూట్‌లో నటించాల్సి వస్తుంటే, పెళ్లిలో వధూవరులు, వారి తల్లిదండ్రులు కూడా డాన్సులు చేయాల్సి వస్తోంది. పెళ్లి అనేది ఓ శుభకార్యం. ఓ సంతోషకరమైనది. కానీ ఆ వేడుక ఈవెంట్‌గా ఎప్పుడు మారిందో బహుశా ఎవరికీ గుర్తుండదు.
డబ్బు పుష్కలంగా ఉంటే ఆడంబరంగా పెళ్లి చేసుకున్నా నష్టం లేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ తప్పనిసరిగా మారిపోయాయి కనుక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతివారు ఉన్నవన్నీ అమ్ముకొని లేదా తాకట్టు పెట్టుకొని లేదా అప్పులు చేసి ఈ ఈవెంట్ కండక్ట్ చేయక తప్పడం లేదు.
తర్వాత తమ పరిస్థితి ఏమిటో వారికి మాత్రమే తెలుసు కనుక లోలోన భయపడుతూ, సంతోషంగా నటిస్తూ అట్టహాసంగా పెళ్లిళ్లు జరిపించేస్తుంటారు. ఇంత ఖర్చు చేసి పెళ్లి చేసినా ఎవరో ఒకరు వేలెత్తి చూపి తప్పులు ఎంచుతూనే ఉంటారు.
ఇప్పుడు ఓ మధ్యతరగతి కుటుంబం ఇంట్లో పెళ్లి అంటే కనీసం 25-35 లక్షలు అవసరం. రాష్ట్రంలో భూముల విలువ పెరిగితే ధరలు పెరగడం సహజం. కానీ పెళ్లి ఖర్చులు ఎందుకు పెరిగిపోతున్నాయి? అంటే పులి–నక్క వాతలే అని చెప్పుకోవాల్సి ఉంటుంది.
పెళ్లి వేదిక డెకరేషన్, టిఫిన్ సెక్షన్, భోజనాలు, సారె, గిఫ్టులు, ఫోటో–వీడియో షూటింగ్, మెహందీ, సంగీత్, ఈవెంట్ మేనేజర్లు… ఇలా చాలానే ఉన్నాయి. వీటిలో ప్రతి కార్యక్రమంలో ఉపయోగపడేవి తక్కువ… వేస్టేజ్ ఎక్కువ కనిపిస్తుంది.
ఓ సినిమా షూటింగ్ కోసం అనేక సెట్టింగ్స్ వేస్తారు. తర్వాత తీసేస్తారు. కానీ సినిమా ఆడితే ఆ ఖర్చులు గిట్టుబాటు అయిపోతాయి. కానీ లక్షలు ఖర్చు చేసి పెళ్లిళ్లు చేస్తే పది కాలాలపాటు కాపురాలు నిలుస్తున్నాయా? అంటే ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు… సినిమాలాగే!
ముఖ్యంగా మధ్యతరగతివారు ఈ ఆడంబరాలతో నలిగిపోతున్నారు. కనుక నేటి తరం యువత చొరవ తీసుకొని ఈ పెళ్లిళ్ల భారం, అనవసరమైన ఈ హడావుడి తగ్గించడానికి ప్రయత్నించాలి. తద్వారా తమ తల్లిదండ్రులు రోడ్డుపై పడకుండా కాపాడుకోగలుగుతారు.
ఒకవేళ అట్టహాసంగా పెళ్లికి సరిపడా డబ్బు ఉన్నా దానిని ఈ విధంగా వృథా చేసే బదులు నిరుపేద పిల్లలు, వృద్ధులు, చికిత్స చేసుకునేందుకు డబ్బులేక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఆర్థిక సాయం చేయవచ్చు. తక్కువ ఖర్చుతో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నా అది మన మనసుల్లో కలకాలం నిలిచిపోయే మధురస్మృతిగా నిలిస్తే చాలు.
ఆ బంధం కలకాలం పదిలంగా ఉండటమే ముఖ్యం. ఓ పెళ్లి వలన సమాజంలో ఒక్కరి జీవితంలో వెలుగు నింపగలిగినా అది ఇచ్చే తృప్తి ముందు ఈ అట్టహాసం, ఆడంబరాలు నిలవలేవు.
దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలలో యువత నిరాడంబరంగా పెళ్లిళ్లు చేసుకొని, తమ పెళ్లి కోసం ఖర్చు చేయాలనుకున్న డబ్బుతో సమాజంలో నిరుపేదలకు అందించి సాయపడుతున్నారు. కనుక పెళ్లిళ్ల విషయంలో ఈ మార్పు తేగల శక్తి కేవలం యువత చేతుల్లోనే ఉంది.
దేశభక్తి అంటే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇండియా గెలవాలని ఆరాటపడటం కాదు… ఏదో పార్టీ జెండాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చి బైక్‌పై ర్యాలీలు, నినాదాలు చేయడమూ కాదు. వీలైతే సమాజంలో ఒక్కరికి సాయపడి వారి జీవితంలో వెలుగు తెస్తే చాలు.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…