
గతంలో ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పనులను, తీసుకున్న నిర్ణయాలను, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాస్త మార్పు చేర్పులతో యధాతధంగా కొనసాగించేవి. కనుక దేశం ఈ మాత్రం అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారగానే గత ప్రభుత్వం మొదలుపెట్టిన పనులన్నిటినీ పూర్తిగా నిలిపివేస్తున్నాయి.
ఏపీలో అమరావతి, పోలవరం, భోగాపురం విమానాశ్రయం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, అన్నా క్యాంటీన్లు, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ తల్లి విగ్రహం వంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
రాజకీయ కక్షలు, తప్పుడు విధానాలతో ఈవిదంగా చేయడం వల్లనే రాష్ట్రాలకు అపార నష్టం కలుగుతోంది. అభివృద్ధిలో వెనకపడుతున్నాయి.
ఇది సరిపోదన్నట్లు ‘మేము అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని, మొదలుపెట్టిన ప్రతీ పనిని నిలిపివేస్తామని,’ ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్న మాటలు లేదా బెదిరింపులు ఇంకా తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి.
ఉదాహరణకు కూటమి ప్రభుత్వం పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మించి, నిర్వహించాలని నిర్ణయించింది. వైసీపీ ఆ నిర్ణయాన్ని తప్పు పడుతూ నిరసనలు చేసింది. కోటి సంతకాలు చేసింది. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలియజేయడం తప్పు కాదు కనుక అందుకు వైసీపీని తప్పు పట్టలేము.
కానీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ, “మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కొరకు చేసుకున్న ఒప్పందాలను, నిర్ణయాలను అన్నిటినీ రద్దు చేస్తాం,” అని హెచ్చరించారు. ఆయన తమ అధినేత జగన్ మనసులో మాటే చెప్పారని వేరే చెప్పక్కర లేదు.
కనుక కూటమి ప్రభుత్వంతో మెడికల్ కాలేజీల కోసం ఒప్పందం చేసుకొని నిర్మాణ పనులు మొదలు పెట్టేవారు పునరాలోచన చేసి తప్పుకుంటే?నష్టపోయేది ప్రజలే తప్ప రెండు పార్టీలు, ప్రభుత్వమూ కాదు!
జగన్ ప్రభుత్వం అమరావతిని, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని పక్కన పెడితే రెండు రాష్ట్రాలు, ప్రజలే నష్టపోయారు తప్ప పార్టీలు, ప్రభుత్వాలు కాదు కదా?
కనుక ప్రభుత్వాలు మారగానే అన్ని పనులు నిలిపివేయడం, నిర్ణయాలు పున సమీక్షించడం, లేదా పనులు నిలిపివేస్తామని బెదిరింపులు వలన రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలగకుండా నివారించాలంటే, ప్రజలు తరచూ ప్రభుత్వాలను మార్చడం మానుకోవాలి.
ఒకవేళ ప్రభుత్వం తప్పు దారిలో నడుస్తున్నప్పుడు తప్పకుండా గద్దె దించాల్సిందే. కానీ సవ్యంగా సాగుతున్నప్పుడు కనీసం 10-15 ఏళ్ళు ఓ ప్రభుత్వాన్ని కొనసాగనిస్తేనే అభివృద్ధి కనిపిస్తుంది. లేకుంటే ఆరడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్నట్లే సాగుతుంది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…