
ఒకప్పుడు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు ఏడాదికి కనీసం 6-7 సినిమాలు చేసేవారు. వారిలో కృష్ణ ఏడాదికి 12పైనే సినిమాలు చేసిన రికార్డ్ కూడా ఉంది. ఏడాదికి డజన్ల కొద్దీ సినిమాలు విడుదలవుతున్నా వాటిలో చాలా సినిమాలు 100 రోజులు, కనీసం 50 రోజులైనా ఆడుతుండేవి.
కానీ ఇప్పుడు పెద్ద హీరోలు ఓ సినిమా మొదలు పెడితే కనీసం రెండు-మూడేళ్ళు పడుతోంది పూర్తి చేయడానికి! అలా చేస్తేనే అది చాలా గొప్ప సినిమా అనే భ్రమలో మునిగిపోతున్నారు అందరూ.
వందల కోట్లు భారీ బడ్జెట్తో ఏళ్ళ తరబడి తీసిన ఆ సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్లా తప్పకుండా సూపర్ హిట్ ఆయ్యి నిర్మాతలకు లాభాలు ఆర్జించిపెడితే చాలా సంతోషం. కానీ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పుకున్నా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.
కనుక ఒక పెద్ద సినిమా కోసం హీరోల వయసులో రెండు మూడేళ్ళు తనఖా పెట్టడం అవసరమా?అని ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. వందల కోట్ల బారీ బడ్జెట్తో పేద్ద సినిమా చేస్తున్నామనే తృప్తి తప్ప చివరికి మిగిలేది ఏమీ ఉండదని ఇటీవల విడుదలైన కొన్ని పెద్ద సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి.
అయితే పెద్ద సినిమాల వలన ఒకే ఒక్క లాభం కనబడుతోంది. పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు ఏళ్ళ తరబడి ఒకే సినిమా చేసుకొంటూ ఉండిపోతుండటం వలన వేణు ఎల్దండి, ప్రశాంత్ వర్మ, శైలేశ్ కొలను వంటి నూతన దర్శకులకు, తేజాసజ్జా వంటి చిన్న హీరోలకు సినిమాలు చేసుకొనేందుకు స్పేస్ లభిస్తోంది. వాటితో తమ టాలెంట్ చాటుకోగలుగుతున్నారు కూడా.
కానీ ఇక్కడ మరో సమస్య ఎదురవుతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. పైగా ఓటీటీ ప్లాట్ ఫారం కూడా అందుబాటులోకి వచ్చింది. అయినా ఓ పెద్ద సినిమా విడుదలైతే ‘హనుమాన్’ వంటి చిన్న సినిమాకు థియేటర్లు దొరకని పరిస్థితి ఎందువల్ల?ఓ పెద్ద సినిమా కోసం మరికొన్ని సినిమాల రిలీజ్ వాయిదా కూడా వేసుకోవలసిన పరిస్థితి నెలకొంది.
పోనీ ఓ పెద్ద సినిమా కోసం చిన్న సినిమాలు ఇన్ని త్యాగాలు చేసినా అది ఆడుతుందా?అంటే గ్యారెంటీ లేదు. ఒకవేళ సూపర్ హిట్ అయినా థియేటర్లలో మూడు నెలలు నిలబడగలదా?అంటే అదీ కష్టమే. ఎంత పెద్ద సినిమా అయినా నెలరోజులకల్లా ఓటీటీ బాట పట్టాల్సిందే కదా?
ఈ భయంతోనే పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడానికి వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ చేసుకుని మొదటి పదిరోజులలో టికెట్ ఛార్జీలు పెంచుకోవలసి వస్తోంది. ఇన్ని సమస్యలు, ఇన్ని భయాలు పెట్టుకొని వందల కోట్ల పెట్టుబడి పెట్టి పెద్ద సినిమాలు తీయడం దేనికి? ఏళ్ళ తరబడి ఒకే సినిమా చేస్తూ విలువైన సమయం వృధా చేసుకోవడం దేనికి?అనే ప్రశ్నకు వాటిని చేస్తున్న పెద్దలే సమాధానం చెప్పాలి.
ఏ గ్యారెంటీ లేని ఓ పెద్ద సినిమా చేసే బదులు నాలుగైదు చిన్న సినిమాలు చేస్తే ఇండస్ట్రీలో అందరికీ చేతినిండా పని దొరుకుతుంది కదా?దాని వలన ఇండస్ట్రీకి మేలు కలుగుతుంది కదా?ఆలోచిస్తే బాగుంటుంది.
A film's release is no longer the only way for a new heroine to get…
Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…