
ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గ్రామ, పట్టణ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నందుకు ఇదివరకు హైకోర్టు ఆయా శాఖల కార్యదర్శులను పిలిపించుకొని గట్టిగా మొట్టికాయలు వేసింది. అప్పుడు వారు లెంపలు వేసుకొని బయటపడ్డారు. కానీ హైకోర్టు ఆదేశాలని ఉల్లంఘిస్తూ నేటికీ పాఠశాలల ఆవరణలలో నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటికి ప్రభుత్వం రూ.40 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపిస్తూ మళ్ళీ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు, ఈసారి పంచాయతీరాజ్, పాఠశాల, విద్యాశాఖల కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాష్లతో పాటు సిఎస్ జవహార్ రెడ్డిని కూడా పిలిపించుకొని అందరికీ గట్టిగా మొట్టికాయలు వేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఏమన్నారంటే…
* పాఠశాల ఆవరణలో ఎటువంటి ఇతర కట్టడాలు నిర్మించకూడదని 2020, జూన్లో హైకోర్టు ఆదేశిస్తే వాటిని ఎందుకు పెడచెవిన పెట్టి నిర్మాణాలు చేస్తున్నారు?
* నిర్మాణాలు చేపట్టేముందు పాఠశాల అభివృద్ధి కమిటీలు, తల్లితండ్రుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు?
* కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పధకానికి ఇస్తున్న నిధులని ఈ భవనాల నిర్మాణాలకి ఎందుకు వినియోగిస్తున్నారు? ఆ నిధులను పక్కదారి పట్టించినందుకు వాపసు చేయమని కేంద్ర ప్రభుత్వం అడిగింది కదా?
* హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి అక్కడ భవనాలు నిర్మించడం, ఉపాధి హామీ పధకానికి ఇస్తున్న నిధులని వాటి కోసం వినియోగిస్తుండటం రెండూ తప్పే. వీటిని అక్రమ కట్టడాలుగా భావించి కూల్చి వేయిస్తాము. వీటికి మీరు బాధ్యత వహిస్తారా? ఆ 40 కోట్లు మీ నుంచే రాబట్టాలనుకొంటున్నాము. సిద్దంగా ఉండండి.
* ఉపాధ్యాయులు నెలనెలా జీతాల కోసం రోడ్లెక్కి ఎందుకు ఆందోళనలు చేయవలసి వస్తోంది?ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? హైకోర్టు ఆదేశాలని ఉల్లంఘిస్తూ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకి ప్రభుత్వం రూ.40 కోట్లు ఇస్తుంది. కానీ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వదా…ఎందుకు?
* గుత్తేదారులకి కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వారూ హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు. గత సీఎస్ సమీర్ శర్మ వారందరికీ వెంటనే చెల్లిస్తామని మాకు 8 నెలల క్రితం హామీ ఇచ్చారు. కానీ నేటికీ చెల్లించలేదు. ఇంకా ఎప్పుడు చెల్లిస్తారు?
* దిగువ కోర్టులలో న్యాయవాదులకి, సిబ్బందికి కూడా బిల్లులు, డీఏ బకాయిలు, పీఎఫ్ లోన్లు, మెడికల్ రీయింబర్స్మెంట్, పదవీ విరమణ తదితర సొమ్ముని ప్రభుత్వం చెల్లించడంలేదని మాకు పిర్యాదులు వస్తున్నాయి. అనంతపురం జిల్లా జడ్జి ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువవచ్చారు. ఈ సమస్యని సుమోటోగా తీసుకొని ప్రభుత్వానికి నోటీస్ పంపించబోతున్నాము నోటీస్ అందుకోవడానికి సిద్దంగా ఉండండి.
జస్టిస్ దేవానంద్ వేసిన ఈ మొట్టికాయలకి బహుశః ముగ్గురు ఉన్నతాధికారులకి బొప్పి కట్టే ఉంటుంది. కనుక సీఎస్ జవహర్ రెడ్డి ఆయనకి సమాధానమిస్తూ, “హైకోర్టు ఉత్తర్వులకి ఉల్లంఘిస్తూ పాఠశాల ఆవరణలో సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మించడం తప్పే. అయితే ఇప్పటికే 63 చోట్ల సచివాలయాలు, 57 చోట్ల ఆర్బీకేలు నిర్మించినందున వాటన్నిటినీ కూలగొట్టే బదులు హైకోర్టు అనుమతిస్తే వాటి నిర్మాణాలు పూర్తిచేసి ఆయా పాఠశాలలకి అప్పగిస్తాము. వాటిని తరగతి గదులుగా లేదా పాఠశాల అవసరాలకి వాడుకొనేలా నిర్మించి ఇస్తాము. మళ్ళీ ఇటువంటి పొరపాటు మరోసారి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటాము,” అని చెప్పారు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…