
కొన్నిసార్లు వివిధ కారణాల వలన పెద్ద సినిమాలు వాయిదా పడుతుంటాయి. 2025లో అలా వాయిదా పడిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఓ పెద్ద సినిమా వాయిదా పడితే దాని వలన చిన్న సినిమాలు కూడా వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ముందు అనుకున్న సమయానికి విడుదల కాకపోతే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు చాలా నష్టం కలుగుతుందని సినీ పరిశ్రమలో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు.
అయినప్పటికీ సకాలంలో షూటింగ్ పూర్తికాకపోవడం, గ్రాఫిక్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులలోఆలస్యం, న్యాయవివాదాలు వంటివి సినిమాలకు బ్రేకులు వేస్తుంటాయి.
ఓ సినిమా వారం పది రోజులు లేదా ఓ నెల ఆలస్యమైతే పర్వాలేదు. కానీ 6,12 నెలలు.. అంతకు మించి వాయిదా పడితే ఆ సినిమా ఎంత బాగున్నప్పటికీ చాలా నష్టం జరుగుతుంటుంది.
అయితే సినీ పరిశ్రమలో అనిల్ రావిపూడి వంటి కొందరు దర్శకులు సినిమా పూజా కార్యక్రమం చేసిన రోజునే రిలీజ్ డేట్ ప్రకటించేసి ఆ ప్రకారమే రిలీజ్ చేస్తుంటారు.
గత ఏడాది వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని చెప్పి వచ్చేశారు… బ్లాక్ బస్టర్ కొట్టారు. మళ్ళీ ఈసారి ‘మన శంకర వరప్రసాద్ గారిని’ పండుగకు తీసుకువస్తున్నామని చెప్పారు. పండక్కి రెండు రోజుల ముందుగానే అంటే జనవరి 12న తీసుకు వచ్చేస్తున్నారు. దానికి ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ పడతాయి.
ఈ రెండు సినిమాలలో హీరోల కటవుట్స్ చాలా పెద్దవే. ఒకరు విక్టరీ వెంకటేష్, మరొకరు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు వారిద్దరినీ కలపడమే కాకుండా నయనతారని కూడా జోడించారు.
అయినప్పటికీ అనిల్ రావిపూడి చకచకా సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ చక్కబెట్టేసి, అప్పుడే గుంటూరులో పండగకి అరిసెలు, చక్కిలాలు చేసుకొని లొట్టలు వేసుకొంటూ తింటున్నారు.
అంటే సినిమాకి కధ అనుకున్నాక అన్నీ ప్లాన్ చేసుకోవడం ఎంత అవసరమో అనిల్ రావిపూడి నిరూపించి చూపుతున్నారనుకోవచ్చు.
సినీ పరిశ్రమలో అనిల్ రావిపూడిలా అన్నీ ప్లాన్ చేసుకొని చెప్పిన బడ్జెట్‌తో, చెప్పిన సమయానికి సినిమా రిలీజ్ చేసే దర్శకులు కొంతమంది ఉన్నారు.
అయితే సంక్రాంతికి అనిల్ సినిమా వస్తోంది కనుక అందరూ సులువుగా అర్థం చేసుకునేందుకు అనిల్‌ని ఉదాహరణగా తీసుకొని చెప్పుకుంటున్నాము అంతే!ఎవరినీ కించపరచాలని కాదు.
“అనిల్ రావిపూడి సినిమాకి సిట్టింగ్ అంటూ హడావుడి చేయడు. షూటింగ్ సమయంలోనో మరో చోట కలిసినప్పుడు చాలా క్యాజువల్‌గా స్టోరీ లైన్ చెప్పేసి ‘ఓకే’ అనిపించుకుంటాడు…” అని నిర్మాత దిల్ రాజు అన్నారు.
అంటే కధ, సినిమా, నటీనటులు, సాంకేతిక నిపుణులు, పూజా కార్యక్రమం మొదలు ప్రీ-రిలీజ్ ఈవెంట్ వరకు ప్రతీదానిపై ఆయనకు ఎంత క్లారిటీ, ఎంత గ్రిప్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
అనిల్ రావిపూడి పెద్ద హీరో, హీరోయిన్లను పెట్టుకొని ఇంత అలవోకగా చకచకా సినిమాలు తీసి హిట్స్ కొడుతున్నప్పుడు, మిగిలినవారు ఒక్కో సినిమాని 2,3,4 ఏళ్ళ పాటు ఎందుకు తీస్తున్నట్లు?తీసినా విడుదల చేసేటప్పుడు ఎందుకు ఆందోళన చెందుతుంటారు?
ఒక హీరో కెరీర్‌లో ఒక సినిమాకే రెండు మూడేళ్ళు సమయం తీసుకోవడం అతనికి, అభిమానులకు అన్యాయం చేసినట్లు కాదా? అందరూ ఆలోచిస్తే బాగుంటుంది.
ఒకప్పుడు ఎన్టీఆర్ ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తే, కృష్ణ ఏకంగా 12-14 సినిమాలుపైనే చేసేవారు కదా?నాడు లేని అత్యద్భుతమైన టెక్నాలజీ నేడు అందుబాటులోకి వచ్చాక మరింత వేగంగా ఎక్కువ సినిమాలు తీయాలి కానీ రెండు మూడేళ్ళకో సినిమా… ఎందువల్ల?
Rohit Sharma and Virat Kohli have retained their places in India’s ODI squad for the…
Telangana politics have started to revolve around the discussion on lands and illegal monetary gains…