
రాష్ట్ర విభజనతో తెలంగాణకు అన్ని విధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం, దానిలో వందల కొద్దీ ఐటి కంపెనీలు పరిశ్రమలు, టాలీవుడ్, భద్రాచలం పుణ్యక్షేత్రం వగైరా దక్కాయి.
ఏపీకి తిరుమలతో సహా అనేకానేక పుణ్యక్షేత్రాలు, సుమారు 1500 కిమీ పొడవైన సముద్రతీరం, దానిలో చేపలు, రొయ్యల ఖజానా, అనేక పర్యాటక ఆకర్షణ కేంద్రాలు దక్కాయి.
ఏపీకి తిరుమల వెళ్ళిపోవడంతో మాజీ సిఎం కేసీఆర్ సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని యాదాద్రిగా అభివృద్ధి చేసి తిరుమలకు దీటుగా తీర్చిదిద్దారు.
ఏపీకి సముద్రం, దాని ఉత్పత్తులు వెళ్ళిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గొలుసు కట్టు చెరువులు పునరుద్ధరించి, వాటిని కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో అనుసంధానం చేసి కృష్ణా, గోదావరి నీళ్ళతో నింపారు. వాటిలో ఏటా చేప పిల్లలు వేస్తూ జాలారులకు ఆదాయ వనరు సృష్టించారు.
ఏపీకి సారవంతమైన భూములు ఉండగా తెలంగాణకు బీడువారిన భూములు ఉండేవి. వాటన్నిటికీ కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందించి ఆ బీడువారిన భూములు సస్యశ్యామలం చేశారు.
కనుక రాష్ట్ర విభజన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు కూడా అమరావతి నిర్మాణానికి పూనుకున్నారు. కానీ తర్వాత కధ అందరికీ తెలిసిందే. జగన్ హయంలో కేవలం సంక్షేమ పధకాలకు మాత్రమే ప్రాధాన్యం ఉండేది. కనుక రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలుగా ఉన్న అనేక బీచ్‌లు ఉండగా పట్టించుకోలేదు.
దాంతో కొన్ని ప్రాంతాలలో బీచ్‌లు కోతకు గురవుతుండేవి. అన్ని ప్రాంతాలలో బీచ్‌లు చెత్తచెదారంతో అపరిశుభ్రంగా ఉండేవి. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు సముద్రతీరం దాని వెంబడి అనేక బీచ్‌లు, బీచ్ పార్కులు ఉన్నాయి.
ఏపీలో పేరొందిన విశాఖలోని రామకృష్ణా బీచ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ రాష్ట్రంలోని బీచ్‌లను పట్టించుకునే నాధుడే లేదు. నేటికీ అదే పరిస్థితి.
మనకు భౌగోళికంగా, ప్రకృతి సహజంగా బీచ్‌లు లభిస్తే, ప్రభుత్వాలు వాటి విలువ గుర్తించలేకపోతున్నాయి. కానీ సముద్రతీరమే లేని తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర శివారులో రూ. రూ.235 కోట్ల పెట్టుబడితో కృత్రిమ బీచ్ ఏర్పాటు చేసుకుంటున్నారు.
అవుటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో కోత్వాల్ గూడ వద్ద 35 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కాబోతోంది. ప్రస్తుతం ఇది డిజైనింగ్, ప్లానింగ్ దశలో ఉంది. బహుశః మరో రెండు మూడేళ్ళలో హైదరాబాద్‌లో బీచ్ అందుబాటులోకి రావచ్చు. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఆంధ్రా ప్రజలు హైదరాబాద్ వెళుతున్నట్లుగానే అప్పుడు ఈ బీచ్ కోసం హైదరాబాద్ వెళ్ళాలేమో?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…