
భార్యభర్తల మద్య ఎప్పుడో ఒకప్పుడు చిన్నా పెద్దా గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్నవైతే సమసిపోతాయి కనుక ఇబ్బంది లేదు. కానీ ఆర్ధిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, వ్యసనాలు వంటి కారణాలతో జరిగే గొడవలు చివరికి హత్యలు, ఆత్మహత్యలతో ముగుస్తుంటాయి. వాటి కారణంగా అభంశుభం తెలీని చిన్నారులు కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం. హైదరాబాద్, మూసాపేటలో ఇలాంటి విషాద ఘటన మంగళవారం జరిగింది.
ఇక్కడ వారి వివరాలు ముఖ్యం కాదు. కారణాలు, పరిష్కారమే ముఖ్యం.
ఆర్ధిక సమస్యలు, వివాహేతర సంబందం, తాగుడు కారణంగా భార్య భర్తల మద్య ఘర్షణలు జరిగాయి. భర్త వేధింపులు భరించలేక భార్య తన ఇద్దరు కొడుకులకు ఉరేసి, తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
భర్తకు సంపాదన లేకపోతే సర్దుకుపోవచ్చు. కానీ అక్రమ సంబంధాలు కలిగిన వ్యసనపరుడుని ఏ భార్య భరించలేదు. కనుక అలాంటి వ్యక్తితో రోజూ హింసించబడుతూ, ఘర్షణ పడుతూ తీవ్ర మానసిక క్షోభతో జీవించడం కంటే ఆత్మహత్యే మంచిదనిపించవచ్చు.
కానీ తననే నమ్ముకొని జీవిస్తున్న కన్నపిల్లలను చంపుకొని, ఆత్మహత్య చేసుకునే బదులు విడాకులు తీసుకొని వేరేగా జీవించే ప్రయత్నం చేయవచ్చు కదా?
అవును! ఒడ్డున కూర్చొని ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వడం తేలికే. అనుభవించేవారికే ఆ బాధ అర్ధమవుతుందని వాదించవచ్చు. కానీ జీవించేందుకు మార్గాలు ఉండగా అర్దాంతరంగా జీవితాలు ముగించుకోవడం క్షణికావేశమే అనుకోవాల్సి ఉంటుంది కదా?
మన దేశంలో 70 నుంచి 100 సంవత్సరంల మద్య వయసున్న ఎందరో వృద్ధ మహిళలు ఎవరిపై ఆధారపడకుండా ఏదో ఒక ఉపాధితో జీవించగలుగుతున్నప్పుడు, 25-50 ఏళ్ళ వయసున్న మహిళలు ధైర్యంగా ఒంటరిగా జీవించలేరా?అంటే తప్పకుండా జీవించగలరని ఎవరైనా చెప్తారు.
ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఒంటరి మహిళలకు పించన్లు, ఆరోగ్యశ్రీ, రేషన్ బియ్యం, పిల్లల చదువులకు ఆర్ధిక సాయం అందిస్తున్నాయి. కనుక కాస్త కష్టమైనా జీవించవచ్చు.
ముఖ్యంగా చనిపోవాలనుకున్నప్పుడు ఇంకా జీవితమే ప్రారంభించని పసిపిల్లలను చంపుకోవడం చాలా బాధాకరం. వారు చేసిన పాపం, నేరం ఏమిటి?వారి ప్రాణాలు తీసే హక్కు మనకి ఉందా? అసలు ఎందుకు తీయాలి? ఎవరి కోసమో మనమెందుకు ఆత్మహత్య చేసుకోవాలి?అని దయనీయ స్థితిలో ఉన్న ప్రతీ మహిళ ఆలోచిస్తే ఇలాంటి విషాద ఘటనలు గణనీయంగా తగ్గుతాయి.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…