
ఏపీలో వైసీపీకి తిరుగులేని మెజార్టీ ఉంది. లోక్సభలో 23 ఎంపీలున్నారు. కనుక తలెత్తుకొని ధైర్యంగా కేంద్రాన్ని నిలదీసి రాష్ట్రానికి రావలసినవన్నీ సాధించుకోవచ్చు. కానీ లోక్సభలో గొంతెత్తి మాట్లాడలేదు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినా ధైర్యంగా అడగలేరు.
జనసేన పార్టీ రాష్ట్రంలో కాస్త బలం పుంజుకొన్నట్లే ఉంది. కానీ అదీ 175 స్థాలలో పోటీ చేసి ఒంటరిగా గెలవలేదు. బిజెపితో పొత్తులు కొనసాగిస్తూ కేంద్రం అండదండలు ఉన్నప్పటికీ జనసేన అధికారంలోకి రావడం అసంభవమే అని చెప్పవచ్చు. అయినా కేంద్రంతో సఖ్యత అవసరమని బిజెపితో అంటకాగుతున్నట్లుంది.
రాష్ట్రంలో బిజెపికి ఏమాత్రం బలం లేదని తెలిసి ఉన్నా టిడిపి కూడా బిజెపి పెద్దలతో దోస్తీకి ఆశగా ఎదురుచూస్తోంది. వచ్చే ఎన్నికలలో వైసీపీని నిలువరించాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు కూడా అవసరమని చంద్రబాబు నాయుడు భావిస్తుండటం వలననే దానితో దోస్తీకి ఆరాటపడుతున్నారేమో? కానీ ఆయన జిల్లా పర్యటనలకి వస్తున్న అపూర్వ స్పందన చూస్తున్నట్లయితే టిడిపి ఒంటరిగా పోటీ చేసినా అవలీలగా గెలిచి అధికారంలోకి రాగలదనిపిస్తుంది.
రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల పరిస్థితి ఈవిదంగా ఉంటే, వాటిపై కర్ర పెత్తనం చేస్తున్న ఏపీ బిజెపి రెచ్చిపోయింది. వైసీపీ, టిడిపిలను వాటి అధినేతల తీరును విమర్శిస్తూ శనివారం వరుసగా ట్వీట్ చేసింది.
“అభివృద్ధి ఎజెండాతో గుజరాత్లో బిజెపి ఏడు సార్లు గెలిచిన ఫలితాలను చూసి ఏపీలో ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాలి. రాష్ట్రంలో 2024లో పంచడానికి ఏముంది హెరిటేజ్ పాలు, భారతి సిమెంట్ కంపెనీల ఆదాయం తప్ప. ఏపీలో మరీ బరితెగించి నిన్న చంద్రబాబు వడ్డీతో సహా పాత సంక్షేమ పథకాలను అధికారంలోకి వస్తే మైనారిటీలకు ఇస్తాము అని చెప్పడం తెదేపా పార్టీ దివాలాకోరు ఓటు బ్యాంక్ రాజకీయాలకు నిదర్శనం. అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం పేరుతో నిధులు దారి మళ్లించి సీఎం @ysjagan రాష్ట్రాన్ని 90% నాశనం చేస్తే, నేను 100% నాశనం చేస్తాను అని మాజీ సీఎం @ncbn చెప్పడం సిగ్గుచేటు. 2024లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు,” అంటూ ఏపీ బిజెపి వరుస ట్వీట్స్ చేసింది.
ఇంతకాలం ఏపీలో ఉందా లేదా అన్నట్లు వ్యవహరించిన బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనకి వచ్చినప్పుడు మార్గదర్శనం చేసిన తర్వాతే ఈవిదంగా విమర్శలు గుప్పిస్తున్నట్లు అర్దం అవుతోంది. గుజరాత్ని చూసి నేర్చుకోవాలని సుద్దులు చెపుతున్నప్పుడు, ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భూమిపూజ చేసిన అమరావతిని జగన్ ప్రభుత్వం పక్కన పడేస్తే ఎందుకు పట్టించుకోలేదు? జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పనులు నిలిచిపోతే ఎందుకు పట్టించుకోలేదు?జగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందని వాదిస్తున్నప్పుడు దానికి కేంద్రం విరివిగా అప్పులు ఎందుకు ఇప్పిస్తోంది? అప్పులు చేయకుండా ఎందుకు కట్టడి చేయడంలేదు?సంక్షేమ పధకాల విషయంలో వైసీపీతో టిడిపి పోటీ పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు సిద్దపడుతోందని విమర్శిస్తున్న బిజెపి, ‘వచ్చే లోక్సభ ఎన్నికలలో మాకు ఓట్లేసి గెలిపిస్తే ఎటువంటి సంక్షేమ పధకాలు ఇవ్వబోమని ధైర్యంగా చెప్పగలదా?’ ఇలా నిలదీసి అడగాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి.
అయితే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన శక్తి సామార్ద్యాలతో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను తన గుప్పెట్లో ఉంచుకొని కర్రపెత్తనం చేస్తోంది కనుక ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. కానీ ఇందుకే కేసీఆర్ తిరగబడి పోరాడేందుకు సిద్దం అవుతున్నారని బిజెపి గ్రహిస్తే మంచిది.
టిడిపి విషయంలో తన వైఖరి ఏమిటో బిజెపి ఈ వరుస ట్వీట్స్ ద్వారా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది కనుక ఇకనైనా బిజెపితో దోస్తీ కోసం టిడిపి ప్రాకులాడటం మానుకొని ధైర్యంగా మాట్లాడటం మొదలుపెడితే ప్రజలు కూడా దానికి అండగా నిలుస్తారు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…