
జయలలితకు స్వయానా అన్న అయిన జయకుమార్… విజయలక్ష్మిని పెళ్లి చేసుకుని తన సోదరితో పాటు పోయస్ గార్డెన్ లోనే ఉండేవారు. దీప కూడా అక్కడే పుట్టింది. ఆ తర్వాత కాలంలో జయకు, జయకుమార్ కు మనస్పర్థలు వచ్చాయి. దీంతో, ఆయన పోయస్ గార్డెన్ ను వదిలి టీనగర్ లో సెటిల్ అయ్యారు. తదనంతర కాలంలో, 1995లో జయకుమార్ చనిపోయారు. అప్పుడు జయలలిత ఆయన ఇంటికి వెళ్లి అందరినీ పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత 2013లో వదిన విజయలక్ష్మి చనిపోయినప్పుడు జయ వెళ్లలేదు. ఇటీవలే జయకుమార్ కుమార్తె దీప వివాహం జరిగింది. ఈ వివాహానికి కూడా జయ హాజరుకాలేదు. కానీ, కొత్త వధూవరులే జయ దగ్గరకు వచ్చి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు. అత్తగా దీపకు ఓ ఫ్లాట్ ను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు జయ.
తర్వాత కాలంలో భర్తతో దీపకు విభేదాలు వచ్చాయి. ప్రస్తుతం భర్తకు దూరంగానే ఉంటోంది. తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో మేనత్తకు దగ్గర కావడానికి దీప ప్రయత్నించింది. జయను కలవడానికి పోయస్ గార్డెన్ వద్ద గంట సేపు వేచి ఉన్నా… లోపలకు వెళ్లడానికి దీపకు అనుమతి లభించలేదు. ఆ సమయంలో అక్కడున్న సెక్యూరిటీతో దీప గొడవ కూడా పడింది. “ఈ ఇల్లును మా నానమ్మ (జయ తల్లి) నాకు రాసిచ్చింది. ఇది నా ఇల్లు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. మా ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి మీరు ఎవరు?” అంటూ సెక్యూరిటీతో దీప వాదించింది కూడా.
మా కుటుంబసభ్యులు మా అత్తకు దగ్గర కాకుండా పోయస్ గార్డెన్ లో ఉంటున్న కొంతమంది అడ్డుపడుతున్నారంటూ కూడా దీప ఆరోపించింది. ‘అత్తా, మిమ్మల్ని కలవాలి’ అంటూ దీప రాసిన ఉత్తరాలకు కూడా జయ నుంచి సమాధానం రాలేదు. చివరగా ఆగస్టులో కూడా జయను కలవడానికి దీప ప్రయత్నించింది. జయ రాజకీయ వారసురాలిగా కూడా తాను ఉండాలనే దిశగా దీప ప్రయత్నాలు చేసింది. అయితే, వారసత్వ రాజకీయాల కోసం కొంత కాలం ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని… దీప కుటుంబ మిత్రుడైన ఓ బీజేపీ నేత నచ్చజెప్పారని సమాచారం. అండన్ లో ఉన్నత విద్యను అభ్యసించిన దీపకు ఆయనే అమెరికాలో ఉద్యోగం చూసి పెట్టారట.
ఈ వ్యవహారమంతా ఇలా రకరకాల మలుపులు తిరుగుతున్న సమయంలోనే జయలలిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆసుపత్రిలో జయను కలవడానికి దీప తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. హాస్పిటల్ కు నేరుగా వెళ్లి అత్తను కలవడానికి యత్నించింది. అయితే అత్తను కలవాలన్న ఆమె విన్నపాన్ని ఏఐఏడీఎంకే నేతలు పట్టించుకోలేదు. జయ మరింత కాలం ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పడంతో… తన మేనత్తను కలవడానికి దీప తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసిందని సమాచారం. జయ రాజకీయ వారసురాలిని తానే నంటూ దీప ఒక్కసారిగా తెరమీదకు రావడంతో… తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజకీయ వర్గాల్లోనే కాకుండా, సామాన్య ప్రజానీకంలో కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరగబోతోందో వేచి చూడాలి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…